సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం రిటైరైన జస్టిస్ బీఆర్ గవాయ్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పలు ప్రత్యేకతలున్నాయి. మొదటిసారిగా ఆరు దేశాల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్ శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్‌లు, కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ నిలిచిపోనున్నారు.
సాధారణ లాయర్ నుంచి...
అక్టోబర్ 30వ తేదీన సీజేఐగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ సుమారు 15 నెలలపాటు బాధ్యతల్లో కొనసాగుతారు. 65వ ఏట ప్రవేశించనున్న జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9వ తేదీన రిటైరవుతారు. హరియాణాలోని హిసార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10వ తేదీన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. కురుక్షేత్ర వర్సిటీ నుంచి ఎంఏ లాలో డిస్టింక్షన్ సాధించారు. అనంతరం జస్టిస్ కాంత్ చిన్న పట్టణంలో లాయర్‌గా ప్రస్థానం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. అంతకుముందు, ఆయన పంజాబ్ హరియాణా హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుల్లో పనిచేశారు.


