భావ ప్రకటనా స్వేచ్ఛకు మేం వ్యతిరేకం కాదు  | Right to speech can not come at cost of dignity, says SCI | Sakshi
Sakshi News home page

భావ ప్రకటనా స్వేచ్ఛకు మేం వ్యతిరేకం కాదు 

Oct 17 2025 5:17 AM | Updated on Oct 17 2025 5:17 AM

Right to speech can not come at cost of dignity, says SCI

స్వేచ్ఛ అనేది ఇతరుల గౌరవాన్నిదెబ్బతీసేలా ఉండొద్దు  

సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోవడం ప్రమాదకరం  

సుప్రీంకోర్టు ధర్మాసనం ఆందోళన  

లాయర్‌ రాకేశ్‌ కిశోర్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టలేమని వెల్లడి

న్యూఢిల్లీ: భావ ప్రకటనా స్వేచ్ఛ, మాట్లాడే హక్కు అనేవి ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసేలా, నిజాయితీని శంకించేలా ఉండకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోవడం ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌పై లాయర్‌ రాకేశ్‌ కిశోర్‌ బూటు విసిరేందుకు ప్రయత్నించిన ఘటనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. 

డబ్బుల కోసం సోషల్‌ మీడియాలో దిగజారి పోస్టులు పెడుతున్నారని మండిపడింది. సీజేఐపై ఈ నెల 6న బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్‌ రాకేశ్‌ కిశోర్‌(71)పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ అడ్వొకేట్‌ వికాస్‌ సింగ్‌ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం గురువారం స్పందించింది. 

భావ ప్రకటన స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంది. కానీ, అది ఇతరులను అగౌరవపర్చేలా ఉండకూడదని స్పష్టంచేసింది. రాకేశ్‌ కిశోర్‌ ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని, పైగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని, అవి సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయని వికాస్‌ సింగ్‌ చెప్పారు. సుప్రీంకోర్టు సమగ్రతను దెబ్బతీసేలా ప్రచారం సాగుతోందని అన్నారు. 

రాకేశ్‌ కిశోర్‌ ఇంటర్వ్యూలను ప్రసారం చేయకుండా సోషల్‌ మీడియాను కట్టడి చేయాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ... రాకేశ్‌ కిశోర్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టలేమని పేర్కొంది. అలా చేస్తే సోషల్‌ మీడియాకు మరింత మేత అందించినట్లు అవుతుందని స్పష్టంచేశారు. దీపావళి తర్వాత విచారిస్తామని వెల్లడించింది. సహజ మరణంలాగే ఈ కేసు దానంతట అదే ముగిసిపోతుందని ధర్మాసనం వివరించింది.  

రాకేశ్‌ కిశోర్‌పై చర్యలకు అటార్నీ జనరల్‌ అంగీకారం  
లాయర్‌ రాకేశ్‌ కిశోర్‌పై క్రిమినల్‌ నేరం కింద చర్యలు చేపట్టేందుకు అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి గురువారం అంగీకారం తెలియజేశారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్‌సీబీఏ) విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు లాయర్‌పై కంటెంప్ట్‌ ఆప్‌ కోర్ట్స్‌ చట్టం–1971లోని సెక్షన్‌ 2(సీ) ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ పట్ల రాకేశ్‌ కిశోర్‌ ప్రవర్తించిన తీరు అత్యంత గర్హనీయమని ఆర్‌.వెంకటరమణి స్పష్టం చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement