
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అరాచక పర్వం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా మహిళల రక్షణకు భద్రత కరువైంది. గత కొన్నినెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘటనలే ఇందకు అద్దం పడుతుంటే, తాజాగా మరో మహిళా డాక్టర్‌ను ఆస్పత్రి సాక్షిగా వేధించడమే కాకుండా అత్యాచారం చేస్తామనే బెదిరింపు చర్యలకు దిగడం మహిళా భద్రతపై అనేక ప్రశ్నలకు తావిచ్చింది. ఆర్టీ కార్ ఆస్పత్రిలో ఓ మహిళా డాక్టర్‌ను హత్యాచారం చేసిన ఘటన ఇంకా కళ్లు ముందు కదులాడుతుండగానే, మళ్లీ మరొక మహిళా డాక్టర్‌కు అత్యాచార బెదిరింపులు రావడం రాష్ట్రంలో మహిళా రక్షణకు సవాల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం నడిపే ఓ ఆస్పత్రిలో పని చేస్తున్న మహిళా డాక్టర్‌కు ముగ్గురు ఉన్మాదులు బెదిరింపులకు దిగారు. ఆస్పత్రికి వచ్చి వేధించడమే కాకుండా అత్యాచారం చేస్తామని బెదిరించారు. హౌరా జిల్లాలోని ఉలుబెరియాలో ఉన్న శరత్ చంద్ర ఛటోపాధ్యాయం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్-ఆస్పత్రిలో ఇది చోటు చేసుకుంది.
సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక పేషెంట్ సదరు ఆస్పత్రిలో చికిత్స తీసుకునే క్రమంలో అక్కడకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. మహిళా డాక్టర్‌తో వాగ్వాదానికి దిగారు .ఈ క్రమంలోనే వేధింపులకు గురి చేసి అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీనిపై ఆ మహిళా డాకర్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆ ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షేక్ సామ్రాట్, షేక్ బాబులాల్, ఫేక్ హసిబుల్‌గా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డాక్టర్స్ జాయింట్ ఫారమ్ ఆందోళన
మహిళా డాక్టర్ల భద్రతపై ఆ రాష్ట్ర డాక్టర్స్ జాయింట్ పారమ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉలుబెరియాలో ఆ ఆస్పత్రిని సందర్శించిన ఫారమ్ బృంద సభ్యులు.. డ్యూటీలో ఉన్న డాక్టర్లకు రక్షణ ఉందా అంటూ ప్రశ్నించారు.
మమతా సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదు
మరొకవైపు రాష్ట్ర బీజేపీ సైతం.. టీఎంసీ సర్కార్‌పై ధ్వజమెత్తింది. రాష్ట్రంలో వరుసగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న మమతా సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించింది. రాష్ట్ర బీజేపీ ఎంపీ సామిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన నుంచి మమతా ప్రభుత్వం ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదంటూ మండిపడ్డారు.