
కోల్‌కతా: ఆర్జీకర్ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యురాలి కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఈసారి అతని కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతని మేన కోడలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది.
కోల్‌కతా భోవానిపూర్ ప్రాంతంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సోమవారం 11 ఏళ్ల బాలిక అల్మారాలో శవమై కనిపించింది. బాలికను పాక్షికంగా ఉరికి వేలాడుతుండడాన్ని స్థానికులు గుర్తించారు. బాలిక మరణానికి బాలిక త్రండి భోళా సింగ్, సవతి తల్లి పూజ కారణమంటూ స్థానికులు వారిపై దాడి తెగబడ్డారు. తండ్రి, సవతి తల్లి.. బాలికను మానసికంగా,శారీరకంగా హింసించి ఆపై ప్రాణాలు తీశారు. ఈ దారుణంపై కోపంతో రగిలిపోయిన స్థానికులు భోళా సింగ్,పూజలకు దేహశుద్ధి చేశారు.
స్థానికులు సవతి తల్లి జుట్టు పట్టుకుని తన్నారు. తండ్రిని బూట్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.దాడి చేస్తున్న స్థానికుల నుంచి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతిని అనుమానాస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. పోస్టు మార్టం పూర్తయిన తర్వాత బాలికది ఆత్మహత్యనా? హత్యనా? అన్నది తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసుల తీరుపై స్థానికులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 11ఏళ్ల బాలిక కప్‌బోర్డులో ఆత్మహత్య చేసుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. బాలిక మరణానికి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
కోల్‌కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 2024 ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసుపై విచారణ పూర్తి చేసిన సీల్ధా జిల్లా కోర్టు, సంజయ్ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉన్న వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.