
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒక మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో.. వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలు కలవరపరుస్తున్నాయి. తాజాగా ఒడిశాకు చెందిన ఓ మెడికల్ కాలేజ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఎంబీబీఎస్ రెండో ఏడాది చదువుతున్న ఓ విద్యార్థినిని పలువురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన మమతా సర్కార్‌ను మరింత ఇరకాటంలో పడేసింది.
తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన సదరు విద్యార్థినిని, కొంతమంది అడ్డగించి ఆ విద్యార్థిని నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్‌లోని శివపూర్ ఏరియాలో ఐక్యూ సిటీ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని.. తన బాయ్ ప్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లింది.
అయితే ఆ క్రమంలోనే ఓ ప్రైవేటు మెడికల్ కాలేజ్ సమీపంలోకి వెళ్లేసరికి కొంతమంది వారిని అడ్డగించారు. వారి ఇద్దర్నీ భయపెట్టే యత్నం చేశారు. దాంతో అక్కడ నుంచి బాయ్ ఫ్రెండ్ పారిపోయాడు. ఆపై ఆమెను నిర్మానుషప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
ఫ్రెండ్ పాత్రపై అనుమానం..
దీనిపై ఆమె తండ్రి పోలీసుల్ని ఆశ్రయించారు. తన కూతురిపై అత్యాచారం జరగడానికి ఆ స్నేహితుడే కారణమని అంటున్నారు. మాయమాటలు చెప్పి తన కూతుర్ని బయటకు తీసుకెళ్లి, ఇలా అత్యాచారం జరగడానికి కారణమయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ బయటకు వెళ్లిన క్రమంలో ఆమె వెంట వెళ్లిన ఫ్రెండ్ పారిపోవడంలో అతని పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఆ అబ్బాయి కుటుంబం కూడా ఇందులో ఉందనే అనుమానం వ్యక్తం చేశారు బాధిత అమ్మాయి తండ్రి.
బీజేపీ ఆందోళన
దీనిపై బీజేపీ ఆందోళన చేపట్టింది. బాధిత విద్యార్థిని తల్లీ దండ్రులు పోలీసులపై ఎంత నమ్మకంతో ఫిర్యాదులో చేస్తుంటే వారికి మాత్రం కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని బీజేపీ అంటోంది. తనకు జరిగిన అన్యాయంపై స్థానిక బీజేపీ యూనిట్‌కు బాధిత విద్యార్థిని తెలపడంతో విషయం బయటకు వచ్చిందని బీజేపీ స్పష్టం చేసింది.
మమతా సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుందా పోయిందని బీజేపీ విమర్శించింది. గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న అత్యాచార ఘటనలే ఇందుకు ఉదాహరణ అని మండిపడింది.