
కోల్‌కతా: గత ఏడాది దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై మరోసారి పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. ఆ ఘటనలో పూర్తి స్థాయి న్యాయం జరగలేదంటూ ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగి ఏడాది పూర్తైన నేపథ్యంలో ‘నబన్న అభియాన్’ పేరుతో శనివారం(ఆగస్టు, 9వ తేదీ) మార్చ్ నిర్వహించారు.
ఈ నిరసన ర్యాలీలో బాధిత తల్లిదండ్రులతో పాటు ప్రతిపక్ష బీజేపీ, పలు పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని పలు ప్రాంతాలతో పాటు పారిశ్రామిక నగరం హౌరాలో కూడా పెద్ద ఎత్తును నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని చెదరగొట్టడానికి మమతా సర్కార్ పోలీసుల్ని భారీ సంఖ్యలో ప్రయోగించింది. ఎక్కడికక్కడే నిరసనకారులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే పోలీసులకు నిరసనకారులకు మధ్య రగడ చోటు చేసుకుంది. తాము న్యాయం చేయాలంటూ నిరసన చేస్తుంటే ఎందుకు అడ్డకుంటున్నారని ప్రజలు ప్రశ్నించారు. దీనికి మమతా సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ ర్యాలీ శనివారం మధ్యాహ్నం సమయంలో రాణి రష్మోని రోడ్డు వద్ద ప్రారంభమైంది, నిరసనకారులు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ హౌరాలోని నబన్నా వైపు సాగారు. పోలీసులు ఇనుప బారికేడ్లతో నిరసన కారులను అడ్డుకున్నారు. పెద్ద ఎత్తును పోలీసులను మోహరించారు. ఈ క్రమంలోనే పార్క్ స్ట్రీట్ ఘర్షణలు చెలరేగాయి.. నిరసనకారులు తమను అడ్డుకోవడానికి పెట్టిన గార్డు పట్టాలను, బారికేడ్లను చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేయగా పోలీసుల లాఠీచార్జ్ చేశారు.
సరిగ్గా ఇదే రోజు..
కాగా, 2024, ఆగస్టు 9వ తేదీన అంటే సరిగ్గా ఇదే రోజు.. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో శవమై కనిపించింది. అంతేగాక ఆమెను హత్య చేసే ముందు లైంగికదాడికి పాల్పడినట్లు పోస్టుమార్టంలో తేలింది.
బాధితురాలి ముఖం,కుడి చేయి, మెడ, ఎడమకాలు,పెదవులు వంటి శరీర భాగాల మీద గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమె కళ్లు, నోటి నుంచి, ప్రేవేటు భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు వెల్లడైంది.
ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. కానీ ఈ కేసులో ఎటువంటి పురోగతి కనిపించలేదనేది నిరసనకారుల వాదన.
#WATCH | Kolkata | West Bengal Police deploys lathi charge at protestors during the 'Nabanna Abhiyan' rally. The rally has been called to mark the one-year anniversary of the RG Kar Medical College rape and murder. pic.twitter.com/F3jtMFmXk3
— ANI (@ANI) August 9, 2025
ఘటన వివరాలు
తేదీ: 2024 ఆగస్టు 8 అర్థరాత్రి తర్వాత
స్థలం: ఆసుపత్రి సెమినార్ హాల్
బాధితురాలు: 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్
నిందితుడు: సంజయ్ రాయ్ — ఆసుపత్రిలో సివిల్ వాలంటీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి
CCTV ఆధారంగా సంజయ్‌ను అరెస్ట్ చేశారు
కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది
సీబీఐ దర్యాప్తు: కేసును కోల్‌కతా పోలీసులు ప్రారంభించి, తర్వాత సీబీఐకి బదిలీ చేశారు
ఇది గ్యాంగ్ రేప్ కేసు కాదని కోల్‌కతా హైకోర్టుకు సీబీఐకి నివేదిక సమర్పించింది.
తమ కుమార్తె ఆసుపత్రిలో అవినీతిని ప్రశ్నించిందని, అందుకే సామూహిక అత్యాచారం జరిగిందని తల్లి దండ్రులు ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ జూనియర్ వైద్యులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు
న్యాయం కోసం బాధిత కుటుంబం పోరాటం కొనసాగిస్తోంది
ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆవేదన ఉంది. దాంతోనే బాధిత కుటుంబానికి అండగా ఉంటూ న్యాయపోరాటంలో పాల్గొంటున్నారు.