బెంగాల్‌లో ఈసీ ఆదేశాలు
కోల్‌కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే సందర్భంగా ‘అన్ మ్యాప్డ్’గా పేర్కొన్న ఓటర్లను ప్రస్తుతానికి విచారణకు పిలవొద్దని జిల్లా స్థాయి ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. విచారణకు రావాలంటూ వారికి అందినవన్నీ ఆటో జనరేటెడ్ నోటీసులని స్పష్టంచేసింది.
2002 నాటి ఎలక్టోరల్ రోల్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడమే ఈ గందరగోళానికి దారితీసినట్టు బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. ‘‘వాటి పీడీఎఫ్ వెర్షన్‌ను సీఎస్‌వీ ఫార్మాట్‌కు మార్చే క్రమంలో బూత్ అధికారుల యాప్‌లో లింకేజీ వైఫల్యాలు చోటుచేసుకున్నాయి. నిజానికి అన్‌మ్యాప్డ్‌గా పేర్కొన్న ఓటర్లలో చాలామంది నిజమైన ఓటర్లే. ఈ కేసులను జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు నిశితంగా పరిశీలించాలి. నిజంగా అవసరమని భావించిన కేసుల్లో మాత్రమే ఓటర్లకు నోటీసులిచ్చి విచారణకు పిలవాలి’’ అని పేర్కొన్నారు.


