
మాజీ డీజీపీ కొడుకు మృతి కేసులో భయంకరమైన ట్విస్ట్ వెలుగు చూసింది. తన భార్యతో తన తండ్రి అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. అప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారని, చివరకు చంపేందుకు కూడా వెనకడలేదని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది.
పంజాబ్ మాజీ డీజీపీ(మానవ హక్కుల) ముహ్మద్ ముస్తాఫా తనయుడు అకీల్ అక్తర్(35)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచకుల నివాసంలో అక్టోబర్ 16వ తేదీన అకీల్ విగతజీవిగా కనిపించాడు. అయితే డ్రగ్ ఓవర్‌డోస్ కారణంగానే చనిపోయాడంటూ ఆ కుటుంబం చెబుతూ వచ్చింది. ఈలోపు పొరుగింట్లో షామ్‌షుద్దీన్ చౌద్రీ ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు ఈ కేసు దర్యాప్తులో ఉండగానే.. సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో తన తండ్రి తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని, తననూ చంపేందుకు కుట్ర కూడా పన్నాడని అకీల్ వివరించాడు. ఆగస్టు 27వ తేదీన రికార్డు చేసిన ఆ వీడియో 16 నిమిషాల నిడివి ఉంది. ఇంకా అందులో..
తన తండ్రి ముస్తాఫా తన భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నానని, ఈ విషయం తన తల్లీ, సోదరికి కూడా తెలుసని, వాళ్లు అభ్యంతర వ్యక్తం చేయకపోగా తననే నాశనం చేశారని వాపోయాడు. తనను మానసిక రోగిగా ప్రచారం చేస్తూ రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపారని, తన వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారని.. హింసించడంతో పాటు తప్పుడు కేసులు పెడతానని బెదిరించారిని అకీల్ చెప్పుకొచ్చాడు.
ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయాలని ఫిర్యాదుదారి షాముద్దీన్ కోరుతున్నాడు. దీంతో.. ముస్తాపా, ఆయన సతీమణి(మాజీ మంత్రి కూడా) రజియా సుల్తానా, వీళ్ల కూతురు, కోడలి(మాజీ)పైనా బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన పంజాబ్ రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.