
జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల ఆరోపణల వ్యవహారంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు పార్లమెంట్‌లో ఆయన్ని అభిశంసించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు.. సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్‌పై ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం వైదొలిగారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయిస్తామని తెలిపారాయన. ‘‘బహుశా ఈ పిటిషన్‌ను నేను విచారణ చేయలేనుకుంటా. ఎందుకంటే.. జస్టిస్ సంజీవ్ ఖన్నా(మాజీ సీజేఐ) నేతృత్వంలో జరిగిన విచారణలో నేను భాగమయ్యాను. కాబట్టి దీన్ని వేరొక బెంచ్‌కు బదిలీ చేస్తా’’ అని పిటిషన్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్‌కు సీజేఐ స్పష్టం చేశారు.
మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం సంభవించి.. కాలిన స్థితిలో నోట్ల కట్టలు కనిపించాయి. ‘న్యాయవ్యవస్థలో అవినీతి..’ అంటూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. ఆయన్ని హుటాహుటిన అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేసింది. అదే సమయంలో ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు జడ్జిల కమిటీని ఏర్పాటు చేయించింది. ఆ కమిటీ తన నివేదికను అప్పటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించగా.. ఆయన దానిని లేఖ రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు పంపారు.
ఆ నివేదిక ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతికి పాల్పడ్డారని, స్వచ్ఛందంగా రాజీనామాకు ఆయన అంగీకరించలేదని, కాబట్టి ఆయన్ని తొలగించాలని ఇన్-హౌజ్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే తన వాదన వినకుండానే చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టులో జడ్జి యశ్వంత్ వర్మ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఇవాళ(బుధవారం) ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ సీజేఐ బెంచ్‌ను కోరారు. జస్టిస్ వర్మ తరఫున కపిల్ సిబాల్‌తో పాటు ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది, సిద్ధార్థ్ లూథ్రాలాంటి టాప్ లాయర్లు వాదనలు వినిపిస్తుండడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఈ పార్లమెంట్ సెషన్‌లోనే ఆయనపై అభిశంసనకు చర్యలు నడుస్తున్నాయి. ఇలాంటి అభిశంసన తీర్మానం కోసం లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు అభిశంసన నోటీసుపై సంతకం చేయాలి. అయితే జస్టిస్ వర్మ కేసులో ఇప్పటికే 145 మంది లోక్‌సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఇప్పటికే అభిశంసన నోటీసుపై సంతకం చేశారు. జడ్జి తొలగింపు కోసం భారత రాజ్యాంగంలోని 124, 217, 218 ఆర్టికల్స్ ప్రకారం నోటీసు దాఖలైంది. అయితే.. ఎంపీలు ఇచ్చిన అభిశంసన నోటీసును స్వీకరించిన కొన్ని గంటలకే రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి అయిన జగ్దీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
నెక్ట్స్ ఏంటంటే..
లోక్‌సభ స్పీకర్ , రాజ్యసభ ఛైర్మన్ సంయుక్తంగా ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఓ ప్రఖ్యాత న్యాయవేత్త ఉంటారు. ఈ కమిటీకి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇస్తారు. అయితే ఈ కమిటీ ముందు తన వాదనలు వినిపించేందుకు జస్టిస్ యశ్వంత్ వర్మకు అవకాశం(మూడుసార్లు) ఉంటుంది.
గతంలో త్రీజడ్జి కమిటీ సమర్పించిన నివేదికతో పాటు జస్టిస్ వర్మ వాదనలు, సాక్ష్యాలను పరిశీలించాకే స్పెషల్ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈపై ఇరు సభల్లో ఆ నివేదికపై చర్చ జరిగాక.. అభిశంసన తీర్మానాన్నిప్రవేశపెడతారు. దానిని 2/3 మెజారిటీతో సభ్యులు ఆమోదించాక రాష్ట్రపతికి పంపిస్తారు. అప్పుడు ఆయన తొలగింపుపై రాష్ట్రపతి సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తారు.
అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. అదే సమయంలో ఆయన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆగష్టు 21వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని తొలగించడం ఈ సెషన్‌లో సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.