
అభిప్రాయం
దేశంలో మనువాదం తన ప్రభావాన్ని ఏమాత్రం కోల్పోలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై జరిగిన బూటు దాడి ప్రయత్నం మరోసారి నిరూపించింది. అలాగే గవాయ్ తల్లిని ఈ దాడికి ముందే ట్రోల్ (Troll) చేయడం చూస్తే... అణగారిన వర్గాల వారు స్వేచ్ఛగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సనాతనవాదులు ఇబ్బంది పెడతారని స్పష్టమవుతోంది. జస్టిస్ గవాయ్ కుటుంబంపై జరిగిన వివక్షా పూరిత భౌతిక, మానసిక దాడులను ఈ కోణంలోనే చూడాలి.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు (ఆర్‌ఎస్‌ఎస్) వందేళ్లు నిండిన సందర్భంగా మహారాష్ట్రలోని అమరావతిలో నిర్వహించనున్న సభకు జస్టిస్ గవాయ్ తల్లి ‘కళామతి థాయి’ని ప్రధాన వక్తగా ఆహ్వానించారు. ఆహ్వాన పత్రంలో ఆమె పేరు కూడా వేశారు. అయితే ఆమె అనుమతితోనే ఆమె పేరును ఆహ్వాన పత్రంలో వేశారో లేదో గానీ... విషయం తెలుసుకున్న ఆమె సదరు సభకు తాను రాలేను అని నిర్వాహకులకు ఉత్తరం రాశారు. తన కుటుంబం దశాబ్దాలుగా అంబేడ్కర్ ఆలోచనల భావజాలంతో పనిచేస్తున్నదని అంటూ... తన భావజాలానికి భిన్నమైన వేదికను పంచుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె స్వాభిమాన ప్రకటన చేశారు. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. బీఆర్ గవాయ్ తండ్రి రామకృష్ణ సూర్యభన్ గవాయ్ (ramakrishna suryabhan gavai) అంబేడ్కర్ స్థాపించిన ‘రిపబ్లికన్ పార్టీ’ వ్యవస్థాపక సభ్యులు. ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ స్మారక సమితి’ నాగపూర్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. అంబేడ్కర్ తన చివరి రోజుల్లో వేలాదిమందితో కలిసి నాగపూర్‌లో ‘దమ్మ దీక్ష’ తీసుకున్నప్పుడు ఆయనతో పాటు బౌద్ధాన్ని స్వీకరించిన పాతికేళ్ల యువకుడు.
ఇటువంటి కుటుంబ నేపథ్యం ఉన్న కళామతి థాయి తిరస్కారాన్ని నిర్వాహకులు అవమానంగా భావించి సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమెను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేశారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే సుప్రీంకోర్టులో తన కొడుకు అయిన చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మీద దాడి ప్రయత్నం జరిగింది. అంత ఉన్నత పదవిలో ఉన్నా ఆయనపై పాదరక్షతో ఎందుకు దాడి ప్రయత్నం జరిగినట్లు?
ప్రసిద్ద ఖజురహో పర్యాటక ప్రాంతంలో ‘10–12 శతాబ్దాల కాలానికి చెందిన ప్రాచీన విష్ణుమూర్తి విగ్రహానికి మరమ్మతులు జరిపించేలా కోర్టు ఆర్డర్ ఇవ్వాలి’ అని ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. సదరు విగ్రహం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉండటం మూలంగా దాని మీద కోర్టుల జోక్యం కుదరదని చీఫ్ జస్టిస్ గవాయ్ అన్నారు. సదరు పిటిషన్ వేసిన న్యాయవాదికి ఆ విషయం తెలియంది కాదు. వాస్తవానికి అది కోర్టు పరిధిలో లేని అంశం. తెలిసి కూడా పదే పదే వాదన చేస్తున్న అతణ్ణి ఉద్దేశించి ‘వెళ్ళి ఆ దేవుడినే పార్థించండి’ అన్నారు. ఆ ఘటన తర్వాత ఆ మాటను అవమానంగా భావించిన మరో వకీలు రాకేశ్ కిశోర్ (Rakesh Kishore) చీఫ్ జస్టిస్ మీద దాడి చేశాడు.
చదవండి: సంచలనం రేపిన లొంగుబాటు!
ఆర్‌ఎస్‌ఎస్ ఉత్సవాలకు చీఫ్ జస్టిస్ గవాయ్ తల్లిని వక్తగా పిలిచినట్టే... సరిగ్గా ఎనభై తొమ్మిదేళ్ల కింద ‘జాత్ పాక్ తోడక్ మండల్’ అనే సంఘం తమ వార్షిక ఉత్సవానికి అంబేడ్కర్‌ను (Ambedkar) ముఖ్యవక్తగా లాహోర్ ఆహ్వానించారు. కుల అసమానతలు తొలగించే లక్ష్యంతో ఏర్పాటు అయిన ఆ సంఘ బాధ్యులు మీటింగ్ జరగడానికి ముందే బాబా సాహెబ్‌ను తన ప్రసంగ పాఠాన్ని పంపించాల్సిందిగా కోరారు. ఆ ప్రసంగ పాఠాన్ని ముందే చదివిన నిర్వాహకులు అందులో ఉన్న అంశాల పట్ల అంగీకారం లేదని మీటింగ్‌నే రద్దు చేసుకున్నారు. ఆనాడు అంబేడ్కర్ కుల నిర్మూలన పట్ల తనకు ఉన్న మేధను జోడించి రాసుకున్న ఆ ప్రసంగ పాఠమే ‘కుల నిర్మూలన’. ఆనాడు అంబేడ్కర్‌కు జరిగిన అవమానం, నేడు గవాయ్ కుటుంబానికి జరిగిన అవమానం రెండింటికీ ప్రాచీన కాలం నుంచి నేటికీ కొనసాగుతున్న వివక్ష జాడ్యమే కారణం.
- డాక్టర్ గుర్రం సీతారాములు
ఇండిపెండెంట్ రిసెర్చర్