
దేశంలో అన్ని ఎన్నికలనూ కురుక్షేత్ర సంగ్రామంగా మార్చడం దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. అక్టోబర్ 6న ఎన్నికల నగారా మోగిన బిహార్‌లో మొదలైన ఎన్నికలసందడి అనేక ప్రత్యేకతలు కలిగిన దృష్ట్యా దేశ ప్రజల దృష్టి అటువైపు కేంద్రీకృతమైంది. 243 స్థానాలున్న బిహార్‌లోపోలింగ్ రెండు విడతలలో నవంబర్ 6, 11 తేదీలలో జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడుతాయి.
‘యువ బిహార్’ సాధ్యమా?
ఉత్తరాది రాష్ట్రాలలో, ప్రత్యేకించి బిహార్‌లో అభ్యర్థులు ఎన్ని కలకు ముందు ఆ యా పార్టీలు మారటమే కాకుండా... కూట ముల్లోని పార్టీలు అటు ఇటు పిల్లిమొగ్గలు వేస్తుంటాయి. ప్రధాన కూటములుగా ఎన్డీయే, ఇండియా బ్లాక్ (మహా ఘట్‌బంధన్)లు రెండే ఉన్నాయి. ఎన్డీయేలో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీ (యు), భారతీయ జనతా పార్టీ, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి (ఎల్‌జేపీ) ఉన్నాయి. కొత్తగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేసిన ‘జన్ సురాజ్’ పార్టీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది.
ఇక, ముస్లివ్‌ు ఓట్లను గంపగుత్తగా వేయించు కోగలననే ధీమాతో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. స్వర్గీయ రావ్‌ువిలాస్ పాశ్వాన్ తనయుడైన ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ‘అబ్ కీ బార్ యువ బిహార్’ అనే నినాదంతో బిహార్ యువతను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. అదే జరిగితే ఎన్డీయే కూటమికి ఇబ్బందికరమే! అందుకే ఎన్డీయే నుంచి చిరాగ్ పాశ్వాన్ బయటకు పోకుండా ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం నితీష్ కుమార్‌ను ప్రకటించకుండా బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనకు చెక్ పెట్టింది.
‘యువ బిహార్’ కావాలంటే యువకుడైన ముఖ్యమంత్రి ఉండాలన్న సెంటిమెంట్‌ను ప్రశాంత్ కిశోర్ తేవడంతో... ఈసారి ఎన్డీఏ గెలిచినా, 75 సంవ త్సరాల వయస్సులో ఉన్న నితీష్ కుమార్‌ను మరోమారు ముఖ్య మంత్రిగా ఎన్డీఏ కూటమి ఒప్పుకోకపోవచ్చు.
ఓట్ల తొలగింపు రగడ
నిజానికి బిహార్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికలను మోదీ వర్సెస్ రాహుల్‌గాంధీల నడుమ సాగే పోరుగానే చూడాలి. గత ఏడాది రాహుల్ బిహార్‌లో చోటు చేసుకొన్న ఓటర్ల జాబితా సవరణలపై దృష్టి పెట్టారు. బిహార్‌లో చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించి కేంద్ర ఎన్నికల సంఘం పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ‘సర్’ ద్వారా ఓట్లను తొలగించడంతోకాంగ్రెస్ దానిపై పెద్దఎత్తున ఉద్యమించింది. స్వతంత్రంగా నడుచుకోవాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఓట్లను తొలగించిందని ‘ఓట్ చోరీ’ అంటూ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకొంది. చివరకు ఓటర్ల తొల గింపు అంశం సుప్రీంకోర్టుకు చేరింది.
భారతీయ జనతా పార్టీ దూకుడుకు కళ్లెం వేయడానికి, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. రెండు విడతలుగా భారత్ జోడో యాత్రలు ఇందులో భాగంగానే చూడాలి. దేశంలో సమగ్రంగా, శాస్త్రీయంగా కులగణన చేయాలనీ కాంగ్రెస్ కోరుతోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అక్కడ స్వయంగా కులగణన చేసింది. దానిని తెలంగాణ మోడల్‌గా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంటోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ పట్ల ప్రతికూలంగా మారినా మోదీ ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని విమర్శ చేస్తోంది.
బీజేపీ వైపు నుంచి, మోదీ వైపు నుంచి ‘ఇండియా’ కూటమిపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు కూడా పదునైనవే! దేశం వెనుకబడి పోవడానికీ, అన్ని వ్యవస్థలూ సకల అవలక్షణాలతో కునారిల్లడానికీ కారణం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘంగా పాలించడమేనని బీజేపీ విమర్శిస్తోంది. దాంతోపాటు మోదీ నేతృత్వంలో ఈ 12 ఏళ్లకాలంలో దేశం ఏ విధంగా ముందంజ వేసిందీ ఘనంగా చాటుకొంటున్నారు.
తాజాగా తెచ్చిన జీఎస్టీ సంస్కరణలను, ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని బీజేపీ నేతలు ఉదహరిస్తున్నారు. అయితే, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే... జీఎస్టీ సంస్కరణలు చేశారనీ, ఆ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారనీ ప్రతిపక్షం ఆరోపి స్తోంది. 17 శాతం ముస్లివ్‌ు జనాభా గల బిహార్‌లో... మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో యథావిధిగా ఎవరితోనూ పొత్తు లేకుండా ఒవైసీ తన పార్టీ ‘మజ్లిస్’ను రంగంలోకి దించు తున్నారు. తమకు పడని ఓట్లు ఎదుటి పక్షానికి పడకుండా చీల్చడంలో ఇది బీజేపీకి లాభించేదే!
కొత్త సంస్కరణలు ఇక్కడి నుంచే...
తాజాగా పలు ఎన్నికల సంస్కరణలకు బిహార్ వేదిక కావడం విశేషంగా చెప్పాలి. కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న 17 ఎన్నికల సంస్కరణల అమలు బిహార్ నుంచి మొదలు కాబోతోంది. ఈ సంస్కరణలలో ప్రధానంగా ఒక్కోపోలింగ్ బూత్‌ను 1,200 మంది ఓటర్లకే పరిమితం చేస్తున్నారు. ఈవీఎంల మీద అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లు, పోస్టల్ బ్యాలెట్‌ను ముందుకు జరిపి తప్పనిసరి చేస్తున్నారు.
ఓటరు గుర్తింపునకు ఆధార్‌ను వినియోగించుకోవచ్చు నని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఎన్నికల కమిషన్ తొలుత నిరాకరించినా చివరకు దిగొచ్చింది. గతంలో తన మీద వచ్చిన ఆరో పణలకు కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చేది. ఈసారి అందుకు భిన్నంగా సీఈసీ తనను విమర్శించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. గతంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన టీఎన్ శేషన్ అన్ని రాజకీయ పార్టీల వ్యవహార శైలి పట్ల కఠినంగా వ్యవహరించి ఎన్నికల సంఘానికి గౌరవాన్నిపెంచారు, ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడది మృగ్యమైంది.
ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక పార్టీ లేదా కూటమి గెలు పొందుతుంది. అయితే, ప్రజాస్వామ్యం గెలిచిందన్న భావన ప్రజలకు కలగాలి. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు విశ్వాసం కలగాలి. గెలుపు కోసం ఎంతకైనా దిగజారడానికి రాజకీయ పార్టీలు సిద్ధపడి పోతున్న నేపథ్యంలో... ప్రజాస్వామ్యం గెలవాలని కోరు కోవడం అత్యాశ అవుతుందా? కొత్తగా కొన్ని సంస్కరణలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం డేటా, బ్యాటరీ లాగ్స్, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది.
పైగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌ను నాశనం చేయాలనిజిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఇటువంటి నిబంధనలు విధించడంపై ప్రతిపక్ష పార్టీలు న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఒకవైపు రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, పొత్తులు కుదుర్చు కోవడంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలపై సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనల నేపథ్యంలో బిహార్ ఎన్నికలు ఈసారి అత్యంత రసవత్తరంగా మారనున్నాయి.
-వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు
-డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు