
బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మించ తలపెట్టిన మెగా డ్యామ్
విశ్లేషణ
ప్రపంచ జల సంతులనాన్ని తలకిందులు చేసే పనికి చైనా ఒడిగడుతోంది. దాని పర్యవసానాలు వాతావరణ మార్పు అంశమంతటి తీవ్ర ప్రభావం చూపబోతు న్నాయి. చైనా 168 బిలియన్ డాలర్లతో హిమాలయ సూపర్–డ్యామ్ నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలో అత్యంత ఖర్చుతో కూడిన మౌలిక వసతి ప్రాజెక్టు మాత్రమే కాక, అంతర్జాతీయంగా అత్యంత ముప్పుతో కూడుకున్నది కావడం వల్ల భయాలు వ్యక్తమవుతున్నాయి. బీజింగ్ దీన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా వర్ణిస్తోంది కానీ, నిజానికి దాన్ని ముంచుకొస్తున్న జీవావరణ మహా విపత్తుగా పేర్కొనాలి.
యాలంగ్ జింగ్పొ నది మలుపు తిరిగి భారతదేశంలోకి ప్రవే శిస్తున్న చోటుకు కొద్ది వెనుకగా ఈ ఆనకట్టను నిర్మిస్తున్నారు. దీన్ని మనం బ్రహ్మపుత్ర నదిగా పిలుచుకుంటాం. చైనా ప్రధాని లీ చాంగ్ గత జూలైలో ఈ ఆనకట్టకు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు గురించి అధి కారికంగా ప్రకటించారు. కానీ, ఆనకట్ట నిర్మాణ పనులు కొంతకాలంగా సాగుతున్నాయని ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడిస్తున్నాయి.
రహస్య నిర్మాణం
చైనా నాయకుడు ఒకరు ఒక ఆనకట్టకు శంకుస్థాపన చేయడం చివరిసారిగా 1994లో జరిగింది. యాంగ్ చి నదిపై నిర్మించిన త్రీ గార్జెస్ డ్యామ్‌కు అప్పటి ప్రధాని లి పెంగ్ శంకుస్థాపన చేశారు. దాని కన్నా కూడా బ్రహ్మపుత్ర మెగా డ్యామ్ పరిమాణంలో చాలా పెద్దది. ఈ ప్రతీకాత్మకత మారుతున్న ప్రపంచంలో పెరుగుతున్న చైనా ఆశ లతోపాటు, పెద్ద గండాన్ని సూచిస్తోంది.
త్రీ గార్జెస్ డ్యామ్‌ను మొదట్లో ఆధునిక వింతగా కీర్తించారు. ఇపుడు దాన్ని పర్యావరణ, సామాజికపరమైన వైపరీత్యంగా గుర్తిస్తు న్నారు. దానివల్ల పది లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఈ డ్యామ్ తరచూ కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతోంది. భూగోళ కంపన సుస్థిరత దెబ్బతింది. దాని బ్రహ్మాండ జలాశయం చివరకు భూ భ్రమణాన్ని కూడా కొద్దిగా మందగింప జేసింది.
చైనా చేపట్టిన నూతన ప్రాజెక్టు స్థితిగతులు మరింత ప్రమాద కరంగా ఉన్నాయి. ప్రపంచంలో భూకంపాలకు ఎక్కువ అవకా శాలున్న ప్రాంతాల్లోని ఒకదానిలో దాన్ని నిర్మిస్తున్నారు. సైనిక దళాలు పెద్ద యెత్తున మోహరించి ఉండే∙సరిహద్దు ప్రాంతానికి దగ్గరలో అది ఉంది. భారతదేశపు విశాలమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా ‘దక్షిణ టిబెట్’గా పరిగణిస్తోంది. నిర్మాణంలో బల హీనత వల్లగానీ లేదా జలాశయం పురికొల్పగల భూగర్భ ఫలకాల చలనం వల్లగానీ డ్యామ్ కుప్పకూలితే, భారతదేశపు ఈశాన్య ప్రాంతం, బంగ్లాదేశ్ మహా విధ్వంసాన్ని చవిచూడవలసి రావచ్చు.
త్రీ గార్జెస్ డ్యామ్ కన్నా దాదాపు మూడింతల ఎక్కువ విద్యుదుత్పాదనకు వీలుగా రూపకల్పన చేసిన ఈ డ్యామ్‌కు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 2021లో ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ నదుల పొడవునా పెద్ద పెద్ద ప్రాజెక్టులను రహస్యంగా నిర్మిస్తూ పోవడం చైనాకు రివాజుగా మారింది.
జలం ఆధిపత్య సాధనం
బ్రహ్మపుత్ర, మిగిలిన నదుల లాంటిది కాదు. హిమాలయ ఉత్తుంగ శిఖరాల నుంచి కిందకు దూకుతూ ప్రపంచంలోని అత్యంత నిటారైన, లోతైన లోయను సృష్టిస్తోంది. అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ కన్నా ఇది రెండింతల లోతైనది. సాటిలేని నదీమ శక్తి కేంద్రీకృతమవుతున్న చోట డ్యామ్‌ను చైనా నిర్మిస్తోంది.
టిబెట్‌లోని పర్వతాలపైన నీటి బుగ్గల నుంచి పుడుతున్న బ్రహ్మపుత్ర, ప్రపంచంలోని ఎత్తయిన ప్రాంతాల నుంచి ప్రవహించే ప్రధాన నదులలో ఒకటి. భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే ఈ నది వ్యవసాయానికి, మత్స్యసంపదకు ఆలంబనగా ఉంటూ, జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మనుగడ కల్పిస్తోంది. బ్రహ్మపుత్రకు ఏటా వచ్చే వరదలు విధ్వంసకరమైనవే అయి నప్పటికీ, అవి విష పదార్థాలను తోసుకుపోతాయి. భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతాయి.
సేద్యానికి ఎంతో ముఖ్యమైన పోషక విలువ లున్న అవక్షేపాలను పొలాలకు చేకూర్చుతాయి. కానీ సూపర్– డ్యామ్ ఈ గతిని తలకిందులు చేస్తుంది. ఒండ్రుమట్టికి అడ్డుకట్ట వేస్తుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలతో ఇప్పటికే సంకటంలోనున్న బంగ్లాదేశ్ డెల్టా కుంచించుకుపోతుంది. భారతీయ రైతులను సహజ ఫలదీకరణ ఆవృత్తాలకు దూరం చేస్తుంది. ఉప్పు నీరు చేరిపోవడం, వరదలు మరింత పరిపాటిగా మారతాయి.
వచ్చిన చిక్కేమిటంటే, నీటిని వనరుగాకాక, ఒక శక్తి సము పార్జన సాధనంగా చైనా చూస్తోంది. నది టిబెట్‌ను విడిచిపెట్టే చోట మెగా–డ్యామ్ నిర్మించడం ద్వారా, దిగువ ప్రవాహ ప్రాంతాలలో నివసించే కోట్లమందికి ఇష్టముంటే నీరు ఇవ్వగలగాలని, లేకపోతే నీటిబొట్టు కూడా అందకుండా చేయగలగాలని చూస్తోంది.
ఒకప్పుడు చమురుపై ఆధిపత్యం ప్రపంచ శక్తిని నిర్ణయించేది. ఈ 21వ శతాబ్దంలో, సరిహద్దులను దాటి ప్రవహించే నదులపై నియంత్రణ అంతే నిర్ణాయక శక్తిగా పరిణమించవచ్చు. ఈ డ్యామ్ ద్వారా చైనా, ఒక్క తూటా కూడా పేల్చనవసరం లేకుండా, నీటిని ఆయుధంగా మలచుకోగలుగుతుంది. ‘చమురు ఉత్పాదన, ఎగు మతి దేశాల కూటమి’ (ఒపెక్) చమురుపై ఒకప్పుడు ఎలాంటి వ్యూహాత్మక పట్టును అనుభవించిందో, నీటిపై అదే రకమైన శక్తిని చైనాకు ఈ డ్యామ్ కట్టబెట్టవచ్చు.
ప్రమాదంలో జల భద్రత
నిజానికి, ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ కలిపి నిర్మించిన డ్యామ్‌లకన్నా కూడా ఎక్కువ సంఖ్యలో పెద్ద డ్యామ్‌లను చైనా నిర్మించింది. అదే ఊపులో, అది 1990ల నుంచి అంతర్జాతీయ నదు లపై దృష్టి పెట్టింది. మికాంగ్ నదిపై అది కట్టిన 11 పెద్ద డ్యామ్‌లు దిగువ ప్రవాహ ప్రాంతాలను ఇప్పటికే అతలాకుతలం చేస్తున్నాయి. దుర్భిక్షాలు తీవ్రమవుతున్నాయి. థాయిలాండ్, లావోస్, కంబో డియా, వియత్నావ్‌ులలో జీవనోపాధులకు ఎసరు పెడుతున్నాయి.
ఏ రూపంలో నీటి పంపకానికైనా ససేమిరా అనడాన్ని బీజింగ్ కొనసాగిస్తోంది. పొరుగునున్న దేశాలతో నీటి పంపక ఒప్పందాలు వేటిపైనా అది సంతకం చేయలేదు. ఐక్యరాజ్య సమితి 1997లో చేసిన జలవనరుల ఒడంబడికలోనూ అది చేరలేదు. తన సరి హద్దుల లోపలనున్న జలాలన్నింటిపైన ‘నిర్ద్వంద్వ సార్వభౌమాధి కారం’ చాటుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.
ఆసియాను మించి ప్రయోజనాలు ఇక్కడ పణంగా ఉన్నాయి. అంతర్జాతీయ సగటుకన్నా వేగంగా టిబెట్ వేడెక్కుతోంది. పీఠ భూమి హైడ్రాలజీని తారుమారు చేయడం ప్రాంతీయ జూదం మాత్రమే కాక, మొత్తం భూగోళానికి ముప్పు తేవడమే అవుతుంది. టిబెట్ నుంచి నదీ ప్రవాహాల గతులు మారుతున్న ప్రభావ ప్రకంప నాలు, ఆసియాను దాటి, బాహ్య వాతావరణ వ్యవస్థలు, ఆహార భద్రత, వలసల తీరుతెన్నులపైన కూడా కనిపిస్తాయి.
దేశ సరిహద్దులను దాటి వెళ్ళే నదులపై ఏకఛత్రాధిపత్యం వహించడంలో బీజింగ్ సఫలమైతే, ఇతర దేశాలు కూడా అదే బాట పట్టవచ్చు. అది ఇతరత్రా బలహీనంగా ఉన్న సహకార నియమ నిబంధనలను నీరుగార్చవచ్చు. నైలు నదీ పరీవాహక ప్రాంతం నుంచి టైగ్రిస్–యూఫ్రటీస్ వరకు అదే పరిస్థితి నెలకొంటుంది. ఆ విధంగా, మెగా–డ్యామ్ ఒక్క ఆసియా సమస్య మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానిది. అందుకే అంతర్జాతీయ జల నిబంధనలను గౌరవించేట్లుగా అంతర్జాతీయ సమాజం చైనాపై ఒత్తిడి తేవాలి.
బ్రహ్మచేలానీ
వ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’లో వ్యూహాత్మక అధ్యయనాల ప్రొఫెసర్
(‘ద గ్లోబ్ అండ్ మెయిల్’ సౌజన్యంతో)