రోబోటిక్స్ టెక్నాలజీలో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న చైనా ప్రభుత్వాన్ని ఇప్పుడవే రోబోలు వణికిస్తున్నాయి. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసే కంపెనీల వేగవంతమైన విస్తరణ ఆ దేశ అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళిక సంస్థను ఆందోళనకు గురిచేస్తోంది.ఏకంగా 150 కి పైగా కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోల తయారీలోకి దిగడంతో పరిశ్రమ వేడెక్కే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మార్కెట్లోకి ఒకేవిధమైన రోబోలు ఇబ్బడిముబ్బడిగా రావడంపై చైనా అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళికా సంస్థ నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ (ఎన్డీఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ ప్రతినిధి లీ చావో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "వేగం, బుడగలు ఎల్లప్పుడూ ఎదుర్కోవాల్సిన సమస్యలు" అని వ్యాఖ్యానించారు.
ఈ రోబో తయారీ కంపెనీలలో సగానికి పైగా ఇతర పరిశ్రమల నుండి రోబోటిక్స్ లోకి విస్తరించిన ఇటీవలి స్టార్టప్ లు లేదా సంస్థలే కావడం గమనార్హం. ఈ వైవిధ్యం ఒకప్పుడు ఆవిష్కరణకు ఒక వరంగా కనిపించినప్పటికీ, ఒకే లాంటి ఆవిష్కరణలు మార్కెట్ ను ముంచెత్తితే నిజమైన పరిశోధన, అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎన్‌డీఆర్‌సీ హెచ్చరిస్తోంది. దీనిపై ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ కూడా ఇప్పటికే హెచ్చరించారు.
చైనాలో రోబోలు ఎందుకింతలా పెరుగుతున్నాయి..?
హ్యూమనాయిడ్ రోబోటిక్స్ ను "మూర్తీభవించిన ఏఐ"గా పేర్కొంటున్న చైనా భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి కీలకమైన చోదకంగా ప్రకటిస్తూ ఈ రంగాన్ని పెంపొందించడానికి ప్రోత్సాహకాలు, నిధులు, విధానపరమైన మద్దతును అందిస్తోంది. దీంతో ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. కొత్త కంపెనీలు, పెట్టుబడులు వరదలా పోటెత్తున్నాయి. అనేక సంస్థలు వీలైనంత త్వరగా హ్యూమనాయిడ్ మోడళ్లను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ పరుగులు దాదాపు సారూప్య - రోబోల విస్తరణకు దారితీస్తున్నాయి.
ముఖ్యంగా కంపెనీలు తయారు చేసిన రోబోల డెమోలు, ప్రోటోటైప్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ అవి కర్మాగారాలు, గృహాలు లేదా ప్రజా సేవలలో పెద్ద ఎత్తున వినియోగించదగిన రోబోలుగా మాత్రం అందుబాటులోకి రావడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. హైప్, వాస్తవ యుటిలిటీ మధ్య అసమతుల్యత.. డిమాండ్ కార్యరూపం దాల్చడంలో విఫలమైతే బూమ్ కుప్పకూలుతుందనే భయాలను పెంచింది.


