న్యూఢిల్లీ: చైనాలోని షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక భారత మహిళను 18 గంటలకు పైగా నిర్బంధించడంపై భారత్ తన దౌత్యపరమైన నిరసన తెలియజేసింది. చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే భారత పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ, ప్రేమా వాంగ్ థాంగ్‌డాక్.. లండన్ నుండి జపాన్‌కు వెళ్తుండగా ట్రాన్సిట్ సమయంలో అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలయ్యింది.
చైనా అధికారులు ప్రేమా వాంగ్ థాంగ్‌డాక్ జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అయినందును ఆమె పాస్‌పోర్ట్ చెల్లదని ప్రకటించి, ఆమెను వేధింపులకు గురి చేశారు. కాగా ఈ ఘటన అంతర్జాతీయ విమానయాన నిబంధనలు, చైనా వలస నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించినట్లున్నదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)పేర్కొంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం చైనా తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. ఈ వివాదం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనతో మరింత తీవ్రమైంది. ‘జాంగ్నాన్ చైనా భూభాగం. భారతదేశం చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ఎప్పుడూ అంగీకరించలేదు’ అని చైనా ప్రతినిధి పేర్కొన్నారు.
దీనికి ప్రతిస్పందనగా ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. ‘అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం. ఇది విడదీయరాని భాగం. ఇది వాస్తవం. చైనా వైపు నుండి ఎంత తిరస్కరణ వచ్చినా, ఈ వాస్తవాన్ని మార్చలేం’ అని స్పష్టం చేశారు. ప్రయాణికురాలు థాంగ్‌డాక్ తన అనుభవాన్ని ‘ఎక్స్’లో వివరిస్తూ, తన జన్మస్థలాన్ని లక్ష్యంగా చేసుకొని వేధించారని, పదేపదే ప్రశ్నించారని, విరుద్ధమైన సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన భారత్ ప్రభుత్వం చైనా అధికారులు హాస్యాస్పద కారణాలతో ప్రేమా వాంగ్ థాంగ్‌డాక్‌ను నిర్బంధించారని ఆరోపించింది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. భారత పౌరులను లక్ష్యంగా చేసుకోవడం సహించదగినదికాదని, అరుణాచల్ ప్రదేశ్ స్థితిపై చర్చకు అవకాశం లేదని న్యూఢిల్లీ స్పష్టంగా చైనాకు తన సందేశం పంపింది.
ఇది కూడా చదవండి: 360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే!


