సైబర్ దాడి జరగకుండా, ఒకవేళ జరిగినా అందుకు అవసరమయ్యే పరిష్కారాలు అందించడం చాలా కీలకం. ఈ విభాగంలో సర్వీసులు అందిస్తూ ఏకంగా 132 బిలియన్ డాలర్ల విలువ సంపాదించుకున్న టెక్ దిగ్గజ కంపెనీకి ఓ ఇండియన్ సారథ్యం వహిస్తున్నారు. 2025 నవంబర్ నాటికి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ (PANW) మార్కెట్ క్యాప్ రికార్డును చేరింది. క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ డ్రివెన్ ప్లాట్‌ఫామ్‌ల్లో ప్రపంచ లీడర్‌గా ఈ కంపెనీ నిలవడానికి కారణం నికేష్ అరోరా వ్యూహాత్మక నాయకత్వమేనని కంపెనీలోని ప్రముఖులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పాలోఆల్టో నెట్‌వర్క్స్ ఛైర్మన్, సీఈఓగా ఎదిగిన నికేష్ అరోరా గురించి తెలుసుకుందాం.
నికేష్ అరోరా తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసేవారు. నికేష్ క్రమశిక్షణతో కూడిన మధ్యతరగతి కుటుంబ వాతావరణంలో పెరిగారు. 1968లో జన్మించిన ఆయన 1990లో వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. తర్వాత అమెరికాకు వెళ్లి బోస్టన్ కాలేజీ నుంచి ఫైనాన్స్‌లో మాస్టర్స్, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. కెరియర్ ప్రారంభంలో ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, పుట్నమ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పనిచేసి ప్రపంచ మార్కెట్లు, పెట్టుబడి వ్యూహాలపై అనుభవాన్ని సంపాదించారు. ఆరంభంలో దాదాపు 400 సార్లు తన జాబ్ అప్లికేషన్‌ను కంపెనీలు తిరస్కరించాయి. అయినా ఆయన పట్టుదలతో కృషి చేశారు.
గూగుల్, సాఫ్ట్‌బ్యాంక్‌లో..
నికేష్ అరోరా 2004లో గూగుల్‌లో చేరడం తనకు టర్నింగ్ పాయింటని చెప్పారు. పదేళ్లలో ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా ఎదిగారు. కంపెనీ ప్రకటనల ఆదాయాన్ని 2 బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు పెంచడంలో కీలకపాత్ర పోషించారు. యూరప్ కార్యకలాపాల నుంచి ప్రపంచ వ్యాపార వ్యూహం వరకు అన్నీ ఆయన చేతుల్లోనే ఉండేవి.
2014లో సాఫ్ట్‌బ్యాంక్‌కు ప్రెసిడెంట్, సీఓఓగా వెళ్లి 100 బిలియన్ డాలర్ల విజన్ ఫండ్‌కు బీజం వేశారు. ఈ సమయంలోనే ఓలా, ఒయో, స్నాప్‌డీల్ వంటి భారతీయ స్టార్టప్‌లతోపాటు గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో భారీ పెట్టుబడులు పెట్టడంలో కీలకంగా మారారు.
2018 నుంచి పాలో ఆల్టోలో..
జూన్ 2018లో నికేష్ పాలో ఆల్టో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ, ఎంఎల్ ఆధారిత సైబర్ సర్వీసులను బలోపేతం చేయడానికి 15కి పైగా కంపెనీలను విజయవంతంగా కొనుగోలు చేశారు. Prisma Cloud, Cortex XDR, Cortex XSIAM వంటి అత్యాధునిక ఏఐ ఆధారిత ఉత్పత్తులను రూపొందించారు. సైబర్ థ్రెట్‌లను రియల్ టైమ్‌లోనే ఆపే సామర్థ్యాన్ని ప్రపంచానికి అందించారు.
2018లో 180 డాలర్లు ఉన్న కంపెనీ స్టాక్ ధర 2025 నాటికి 400 డాలర్లు పైనే ట్రేడవుతోంది. నికేష్ అరోరా నాయకత్వంలో కంపెనీ కేవలం ఐదేళ్లలోనే దాదాపు 120%కు పైగా రిటర్న్‌లను అందించింది.
రికార్డు పరిహారం
నికేష్ అరోరా సంపాదన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2023లో ఆయన అందుకున్న పరిహారం 151.43 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,260 కోట్లు). ఇది అమెరికాలో ఆ సంవత్సరానికి రెండవ అత్యధిక వేతనం పొందిన సీఈఓగా నిలిపింది. 2025 జులై నాటికి ఆయన వ్యక్తిగత నికర విలువ 1.5 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.12,500 కోట్లకు) చేరింది. ఇందులో ఎక్కువ భాగం పాలో ఆల్టో నెట్‌వర్క్స్ స్టాక్స్ రూపంలోనే ఉంది.
ఇదీ చదవండి: రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం


