
కనీసం డిగ్రీ కూడా లేకుండా ఉద్యోగం సంపాదించడం కష్టం. అందులోనూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వాలంటే..అస్సలు సాధ్యం కాదు. కానీ ఈ వ్యక్తి ఏ కంపెనీకి సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడో అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డిగ్రీ కూడా పూర్తి చేయని ఈ వ్యక్తి ఎలా ఇంత పెద్ద ఉద్యోగాన్ని సంపాదించగలిగాడో వింటే..నేర్చుకోవడం విలువ కచ్చితంగా తెలుస్తుంది. లింక్డ్‌ఇన్‌లో వైరల్‌గా మారిన ఇతని స్టోరీ నేటి తరాని స్ఫూర్తి. ఎన్ని డిగ్రీలు చేశామన్నాది కాదు స్కిల్ ఎంత ఉంది అన్నది ముఖ్యం అని చెబుతోంది ఇతడి కథ.
అతడే అబ్దుల్ అలీమ్. లింక్డ్ ఇన్ పోస్ట్‌లో తన సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారిన తన సక్సెస్ జర్నీని షేర్ చేసుకున్నారు. 2013లో ఇంటి నుంచి వెయ్యి రూపాయలతో బయటకొచ్చేశానని, రైలు టికెట్ కోసం రూ. 800లు ఖర్చు చేశానంటూ నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు అబ్దుల్. చిన్నపాటి ఉద్యోగం కూడా లేకపోవడంతో ఎక్కడకి వెళ్లలేని తన దీనస్థితిని గురించి వివరించాడు.
అలా రెండు నెలలు వీధుల్లో గడిపిన అనంతరం..జోహో సాఫ్ట్‌వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనికి కుదిరాడు. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. పదోతరగతి వరకే చదివిన అతడికి హెచ్‌టీఎంఎల్(HTML)పై కొంచెం పట్టు ఉంది. అయితే మరింతగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా..అదెలా అనేది తెలియలేదు అబ్ధుల్‌కి. సరిగ్గా ఆ సమయంలో జోహోలో సీనియర్ ఉద్యోగి శిబు అలెక్సిస్‌తో పరిచయం..ఒక్కసారిగా అబ్దుల్ జీవితమే మారిపోయింది.
అతడు అబ్దుల్ మాటల్లో ఏదో చేయాలనే తపనను గుర్తించి..మార్గనిర్దేశం చేసేందుకు ముందుకొచ్చాడు. అలా ఎనిమినెలల పాటు పగటిపూట భద్రతా విధులను పూర్తి చేసి, సాయంత్రం ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాడు అబ్దుల్. చివరికి ఒకరోజు వినియోగదారు ఇన్‌పుట్‌ను దృశ్యమానం చేసే ఒక సాధారణ యాప్‌ను రూపొందించాడు. దానిని అలెక్సిస్ జోహూ మేనేజర్‌కు చూపించాడు. దీంతో మేనేజర్ అబ్దుల్‌ని ఇంటర్వ్యూకి పిలిచారు.
అయితే తనకు డిగ్రీ లేకపోవడంతో కాస్త తడబడుతున్న అబ్దుల్‌ని చూసి ఆ కంపెనీ మేనేజర్..కాలేజ్ డిగ్రీ అవసరం లేదు, నైపుణ్యం ఉంటే చాలు అంటూ అతడిని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా నియమించారు. అలా సెక్యరిటీ గార్డుగా పనిచేసిన ఎనిమిదేళ్ల తర్వాత అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా నియమాకం అందుకున్నాడు. ఇలా తన కథను వివరిస్తూ..తనకు గురువులా మార్గనిర్దేశం చేసిన శిబు అలెక్సిస్‌కు, అలాగే తనని తాను నిరూపించుకునేలా అవకాశం ఇచ్చిన జోహో కంపెనీ మేనేజర్‌కి ధన్యావాదాలు తెలిపాడు పోస్ట్‌లో.
చివరగా ఆయన "నేర్చుకోవడం అనేది ఎప్పుడైనా ప్రారంభించొచ్చు..ఆలస్యం అనే పదానికి ఆస్కారం లేదు" అని పోస్ట్‌ని ముగించారు. కాగా, జోహో అనేది చెన్నైకి చెందిన గ్లోబల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. 1996లో శ్రీధర్ వెంబు స్థాపించిన ఈ కంపెనీ సరసమైన సాంకేతికత, డేటా గోప్యత, భారతదేశంలో ఉత్పత్తులను నిర్మించడంలో ప్రసిద్ధి చెందింది. యూఎస్ సుంకాల ఉద్రిక్తతల నేపథ్యంలో అనేకమంది మంత్రులు ఈ దేశీ టెక్‌కంపెనీని ప్రమోట్‌చేయడంతో జోహూ కంపెనీ వార్తల్లో నిలిచింది.
(చదవండి: Parenting Tips: పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్‌లు..!)