సైబర్ సెక్యూరిటీ కోర్సులో మార్పులు
దాడుల్లో దాగున్న నిజాన్ని గుర్తించే ట్రైనింగ్
దర్యాప్తు సంస్థలతో సమన్వయం
కేంద్రానికి ఏఐసీటీఈ ముసాయిదా ప్రతి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సహా ఇతర డిప్లొమా కోర్సుల్లో సైబర్ సెక్యూరిటీ కోర్సును రీడిజైన్ చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కేంద్రానికి ప్రతిపాదించింది. ఉగ్ర దాడుల దర్యాప్తు, నిఘాకు ఉపయోగకరంగా ఇది ఉండాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా రూపొందించింది. మార్పులతో కూడిన సైబర్ సెక్యూరిటీ కోర్సులను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చే వీలుందని ఏఐసీటీఈకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ఇప్పుడీ అంశం చర్చకు వచ్చింది.
దేశంలోని కొన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలకు చెందిన ప్రొఫెసర్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, దర్యాప్తు సంస్థల అభిప్రాయాలకు కోర్సు రీడిజైన్‌లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉగ్రవాద చర్యల్లో సమాచార మార్పిడి, సైబర్ దాడులు, డేటా చోరీ వంటివి అత్యంత కీలకమైనవని దర్యాప్తు వర్గాలు అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు వివిధ సందర్భాల్లో సెక్యూరిటీని భగ్నం చేసే విధానాలు, కోడింగ్ పద్ధతులపై ఇప్పటికే అనేక మంది నిపుణులు అధ్యయనం చేశారు. ఇందులోని సారాంశాన్ని కూడా ఐఐటీ సంస్థలు అధ్యయనం చేశాయి.
అవే కీలకాంశాలు...
ఉగ్రవాదులు డిజిటల్ పద్ధతులను అనుసరిస్తున్నారని ఇటీవల అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ పేర్కొంది. దేశాల్లోని మౌలిక సదుపాయాలపై దాడులు,డేటా హ్యాకింగ్, తప్పుడు వార్తల ద్వారా మానసిక యుద్ధం సృష్టించడం, ఆర్థిక మోసాలకు పాల్పడటం వంటివి చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సైబర్ సెక్యూరిటీలో సైబర్ ఇంటెలిజెన్స్, ఎథికల్ హ్యాకింగ్, నెట్‌వర్క్ డిఫెన్స్ సబ్జెక్టులను మరింత ఆధునీకరించాలని ఏఐసీటీఈ భావించింది.
చాప్టర్ల రూపకల్పనే కాకుండా ఇంటెలిజెన్స్ బ్యూరో, ఫోరెన్సిక్ విభాగం నుంచి నిపుణులతో ప్రాక్టికల్ అనుభవాన్ని విద్యార్థులకు అందించేలా కోర్సు డిజైన్ చేయాలని తలపోస్తోంది. వీటన్నింటినీ జోడిస్తూ సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ పేరుతో కొత్త బ్రాంచీని కూడా తేవాలని యోచిస్తోంది. ఇంటర్న్‌షిప్ కూడా దర్యాప్తు సంస్థల తోడ్పాటుతో చేస్తే బాగుంటుందని సూచించింది.
వీటిపై ఫోకస్
ఉగ్రవాద చర్యలకు మూలంగా నిర్ధారించే సైబర్ దాడులు, సహకారం, వాటి రకాలపై దృష్టి పెడుతున్నారు. కంప్యూటర్ నెట్‌వర్క్‌లో లాన్, వాన్, ఇంటర్నెట్, నెట్‌వర్క్ ప్రొటోకాల్స్‌లో టీసీపీ, ఐపీ, డీఎన్‌ఎస్, హెచ్‌టీటీపీ, ఫైర్‌వాల్స్‌లో డిటెక్షన్ సిస్టమ్, వీపీఎన్ వంటివి ఆధునీకరించాలని ఏఐసీటీఈ భావిస్తోంది. ఉగ్రవాదులు కోడింగ్, ఉగ్ర చర్యలకు అవసరమైన స్థలాల ఎంపిక వంటివి గుర్తించే విధంగా క్లాసికల్, మోడ్రన్ క్రిటోగ్రఫీ, హాషింగ్ అల్గారిథం, డిజిటల్ సిగ్నేచర్ వంటి అంశాలపై దర్యాప్తు సంస్థల తోడ్పాటుతో మార్పులు చేస్తున్నారు.
మాల్‌వేర్ అనాలసిస్, సైబర్ ఫోరెన్సిక్ సబ్జెక్టులు అత్యంత కీలకమని భావిస్తున్నారు. ఇందులో మాల్‌వేర్ డిటెక్షన్, రిమూవల్, మెమొరీ, డిస్క్ ఫోరెన్సిక్ వంటి చాప్టర్లను సమూలంగా మార్చాలని ఏఐసీటీఈ భావిస్తోంది. లాస్, పాస్, సాస్‌వంటి క్లౌడ్, ఐవోటీ సెక్యూరిటీ విధానాలను అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా తీసుకురావాలని గుర్తించింది. దీంతోపాటు ఘటనాస్థలం ఆధారంగా నేరస్తుడు వాడిన సైబర్ మెథడ్స్‌ను ప్రాక్టికల్‌గా పరిశీలించేలా సైబర్ సెక్యూరిటీ కోర్సును తీర్చిదిద్దే యోచనలో ఉంది.


