సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యు మెంట్లు ఇమంది రవి దొంగిలించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రహ్లాద్ వెల్లేల పేరిట ఇమంది రవి.. పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు తేలింది.
బెంగుళూరు నుంచి ప్రహ్లాద్‌ను పోలీసులు పిలిపించారు. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్‌ను పోలీసులు విచారించారు. రవి ఎవరో తనకు తెలియదని ప్రహ్లాద్ పోలీసులకు చెప్పాడు. అయితే, ప్రహ్లాద్ తన రూమ్ మేట్ అని గతంలో రవి.. విచారణలో చెప్పిన సంగతి తెలిసిందే. తన పేరుతో రవి పాన్, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్‌కు గురయ్యానంటూ ప్రహ్లాద్.. పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. రేపటితో(డిసెంబర్ 29, సోమవారం) ఐబొమ్మ రవి కస్టడీ ముగియనుంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్‌సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. పలు విడతలుగా జరుపుతున్న విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబడుతున్నారు.
సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా పలు ఆసక్తికర సంగతులను రవి వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే.. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను సైతం పైరసీ చేయగలిగానంటూ కస్టడీ విచారణలో సైబర్ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది.


