సాక్షి హైదరాబాద్: సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడం కోసం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్‌లో గల తన నివాసానికి బయిలుదేరినట్లు పేర్కొంది. రేపు జరిగే అసెంబ్లీ సెషన్‌కు అక్కడి నుంచి కేసీఆర్ హాజరు కానున్నట్లు వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సెషన్లకు హాజరయ్యారు. తొలిసారి గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వగా రెండోసారి బడ్జెట్ ప్రసంగానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం గుప్పించింది. ఈ నేపథ్యంలో రేపు కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు.
కాగా ఇటీవలే కేసీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చించారు. వాటితో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆరాతీశారు.అసెంబ్లీ సమావేశాల్లో నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.


