ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని సమకూర్చుకోవాలని భావించే వారు.. తమ పోర్ట్‌ఫోలియో కోసం స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ను తప్పకుండా పరిశీలించాలి. ఈక్విటీల్లో అత్యధిక రిస్క్ ఉండేది ఈ విభాగంలోనే. అదే సమయంలో అధిక రాబడులు కూడా ఇక్కడే సాధ్యం. కనుక దీర్ఘకాల లక్ష్యాల కోసం తమ మొత్తం పెట్టుబడుల్లో 20 శాతం వరకు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవచ్చు. ఈ విభాగంలో మంచి రాబడులను అందిస్తున్న పథకాల్లో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్ కూడా ఒకటి.
రాబడులు: గత ఐదేళ్ల కాలంలో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్ పెట్టుబడిపై 285 శాతం రాబడిని అందించింది. ఈ కాలంలో నిఫ్టీ 50 రాబడి 164%. అంటే వార్షిక కాంపౌండెడ్ రాబడి 28.44 శాతం. గత ఏడాది కాలంలో రాబడి ఒక శాతంగా ఉంది. గత ఏడాది కాలంగా మార్కెట్లు దిద్దుబాటు దశలో ఉండడం తెలిసిందే. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 15 శాతం వరకు ఉండడాన్ని గమనించొచ్చు.
ఈ పథకం ఆరంభం నుంచి ఇప్పటి వరకు పనితీరును గమనిస్తే వార్షిక రాబడి 19.35 శాతం చొప్పున ఉంది. రాబడుల్లో స్థిరత్వాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక ఈ పథకంలో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఏడాది కాలంలో సిప్ పెట్టుబడులపై 6.88 శాతం నష్టాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే వార్షిక రాబడి 18.49 శాతం చొప్పున ఉంది. ఐదేళ్ల కాలంలో అయితే వార్షిక రాబడి ఏకంగా 55.78 శాతంగా ఉండడం గమనించొచ్చు. ఇక 10 ఏళ్లలో సిప్ రాబడి 164% ఉంది. కనుక సిప్ ప్లాన్ రూపంలో పెట్టుబడులతో రిస్‌్కను అధిగమించడంతోపాటు.. మెరుగైన రాబడుల ను సమకూర్చుకోవచ్చని డేటా తెలియజేస్తోంది.
పెట్టుబడుల విధానం: దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు సంపద సమకూర్చడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. చిన్న కంపెనీలు ఆర్థిక సంక్షోభ సమయాల్లో పెద్ద కంపెనీలతో పోల్చి చూస్తే కుదేలవుతుంటాయి. కనుక ఆ సమయంలో స్మాల్‌క్యాప్ పెట్టుబడుల విలువ పడిపోతుంటుంది. ఆందోళన చెందకుండా, స్థిరంగా ఆ పెట్టుబడిని తిరిగి గణనీయంగా వృద్ధి చెందే వరకు వేచి చూడగలిగే వారికే స్మాల్‌క్యాప్ పెట్టుబడులు అనుకూలం.
పోర్ట్‌ఫోలియో: ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం 36,945 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.27 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 2.57 శాతం పెట్టుబడులు డెట్ సాధనాల్లో ఉన్నాయి. 4.16 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించగా, 36.34 శాతం మేర స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తం మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
పేరుకు స్మాల్‌క్యాప్ ఫండ్ అయినప్పటికీ.. మిడ్‌క్యాప్‌లో ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉంది. దీనికి కారణం స్వల్పకాలంలో రాబడుల అవకాశాలతోపాటు.. ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాతి కాలంలో కొన్ని కంపెనీలు వృద్ధితో మధ్యస్థ కంపెనీలుగా అవతరించినట్టు తెలుస్తోంది. ఈక్విటీల్లో అత్యధికంగా 26.55 శాతం ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. కన్జ్యూమర్ కంపెనీలకు 20.56 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 15.9 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.


