
అభిప్రాయం
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదు, అది ప్రజలకు సమాచారం తెలుసు కునే హక్కు కూడా! ప్రభుత్వ తప్పిదాలు లేదా లోపాలను ఎత్తి చూపినందుకు, ముఖ్యంగా మద్యం మరణాల వంటి సున్నితమైన అంశాలలో, సంపాదకుడిని లేదా విలేకరులను వేధించడం, బీఎన్‌ఎస్ 179(1) వంటి అసంబద్ధమైన సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వడం, ‘సోర్స్’ వివరాలను అడగటం వంటి చర్యలు చట్టబద్ధమైన పరిధిని దాటి అధికార దుర్వినియోగానికి (అబ్యూజ్ ఆఫ్ అథారిటీ) పాల్పడటం కిందికి వస్తాయి.
పత్రికా స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలు జరిగినప్పుడు, వివిధ కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు జర్నలిస్టులకు బలమైన రక్షణ కవచంగా నిలిచిన విషయం గమనార్హం. సత్యాన్ని ధైర్యంగా నిల బెట్టే ప్రతీ జర్నలిస్టుకూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ఎప్పుడూ రక్షణగా నిలుస్తుంది.
ఒక వార్తా దినపత్రిక సంపాదకుడికి, మద్యం మరణాల గురించిన వార్తను ప్రచురించినందుకు గానూ, పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 179(1) కింద నోటీసులు జారీ చేయడం, ఆ వార్తకు సంబంధించిన విలేకరుల అన్ని డాక్యుమెంట్లు, వివరాలను బీఎన్‌ఎస్ సెక్షన్ 94 కింద సమర్పించాలని డిమాండ్ చేయడం చట్ట బద్ధమేనా? ఇటువంటి పోలీసు చర్యలు, లేదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు జర్నలిస్టులను వేధించడం కాదా?
అవి వేధింపులే!
ఏదైనా దర్యాప్తు, విచారణ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఏదైనా పత్రం, ఇతర వస్తువు అవసరమని కోర్టు లేదా పోలీస్ స్టేషన్ అధికారి భావించినప్పుడు, దానిని సమర్పించమని బీఎన్‌ఎస్ సెక్షన్ 94 (పాత సీఆర్‌పీసీ సెక్షన్ 91) కింద ఎవరికైనా సమన్లు జారీ చేయవచ్చు. కానీ అది పాత్రికేయులకు వర్తిస్తుందా? సాధారణంగా, విచారణ కోసం పత్రాలను అడగడానికి ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది.
అయితే, జర్నలిస్ట్ వనరు (సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) లేదా సమాచారాన్ని సమర్పించమని బలవంతం చేయడం, జర్నలిజం ప్రధాన సూత్రమైన ‘సోర్స్ గోప్యత’కు విరుద్ధం. విలేకరుల రక్షణ, పత్రికా స్వేచ్ఛ దృష్ట్యా, ఈ సెక్షన్‌ను విచక్షణా రహితంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం అవుతుంది. వార్తా ప్రచురణను కేవలం ప్రభుత్వంపై విమర్శగా భావించి, ఈ సెక్షన్లను ఉపయోగించి విలేకరుల వివరాలను, డాక్యుమెంట్లను కోరడం స్పష్టంగా ‘చట్టపరమైన వేధింపు’ కిందకు వస్తుంది.
భారతదేశంలో జర్నలిస్టులు తమ వార్తా మూలాలను పోలీసు లకు బహిర్గతం చేయాలని ఏ చట్టం కూడా ఒత్తిడి చేయదు. సమాచా రాన్ని సేకరించే హక్కు, ప్రచురించే హక్కు – ఈ రెండింటినీ ఆర్టికల్ 19(1)(ఎ) కింద భారత రాజ్యాంగం ప్రసాదించింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సంబంధిత న్యాయస్థానం, అది కూడా అత్యవసర మైతేనే ఆ మూలాలను వెల్లడించమని ఆదేశించగలదు. కానీ పోలీసు లకు ఆ హక్కు లేదు. జర్నలిజంలో సమాచారాన్ని అందించిన వనరును రక్షించడం అత్యంత కీలకం. సోర్స్‌ను బహిర్గతం చేయమని బలవంతం చేయడం పత్రికా స్వేచ్ఛను అణిచివేయడమే అవుతుంది.
జర్నలిస్టులకు ‘సుప్రీం’ బాసట
రోమేష్ థాపర్ (1950) నుంచి ఆర్ణబ్ గోస్వామి (2020), ‘న్యూస్‌క్లిక్’ (2024) కేసుల వరకు, భారత అత్యున్నత న్యాయ స్థానం ఎప్పటికప్పుడు పోలీసుల లేదా రాజకీయ నేతల ఒత్తిడి లేకుండా మీడియా పని చేయాలనే హక్కును కాపాడుతూనే ఉంది. ‘ఆర్ణబ్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసును జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షా విచారించారు.
ముఖ్యంగా టీవీ కార్యక్రమాల మీద పలు ఎఫ్‌ఐఆర్లు ఫైల్ చేయడం మీద విచా రణ జరిగింది. జర్నలిస్టులు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగటం, ప్రభు త్వాన్ని విమర్శించడం వారి హక్కుగా కోర్టు పరిగణించింది. రాజకీయ దురుద్దేశంతో ఎఫ్‌ఐఆర్లు దాఖలు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కుకు విరుద్ధం అని వ్యాఖ్యానించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రతి పౌరుడికీ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పిస్తుంది. ఈ హక్కులోనే పత్రికా స్వేచ్ఛ కూడా అంతర్లీనంగా ఉంది. పోలీసుల వేధింపులను ఎదుర్కొంటున్నప్పుడు, ఒక జర్నలిస్ట్ లేదా ఎడిటర్ తన రక్షణ కోసం హైకోర్టును లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.
కోర్టులు తరచూ నాలుగు అంశాలను పరిగణన లోకి తీసుకుంటాయి: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్త ప్రచురిత మైందా? వార్తలో ఉన్న వివరాలు నిజమని భావించడానికి ప్రాథ మిక ఆధారాలు ఉన్నాయా? నేరారోపణ చేయబడిన సెక్షన్ (ఇక్కడ బీఎన్‌ఎస్ 179(1)) ఈ వార్తకు అసలు వర్తిస్తుందా? లేదా ఇది కేవలం జర్నలిస్టును వేధించడానికి లేదా భయపెట్టడానికి ఉపయో గించారా?
ప్రభుత్వ చర్యలు పత్రికా స్వేచ్ఛను అరికట్టే విధంగా ఉండ కూడదు. అంటే భయపెట్టి, ఒత్తిడి చేసి జర్నలిస్టులు సత్యాన్ని రాసేందుకు వెనకాడేలా చేయడాన్ని ‘చిల్లింగ్ ఎఫెక్ట్’ అంటారు. సుప్రీం కోర్టు ఇటువంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది.
పత్రికా స్వేచ్ఛకు ఊతం
‘న్యూస్‌క్లిక్’ ఎడిటర్ కేసులో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు అద్భు తమైన వ్యాఖ్యానాలు చేశాయి. తమకు ఇష్టం లేని రిపోర్టింగ్ చేసినందుకు జర్నలిస్టులను నిందితులుగా పరిగణించే అధికారం పోలీసులకు లేదని కోర్టులు స్పష్టం చేశాయి. అంతేకాకుండా, సదరు వార్త సాధనాలను స్వాధీనం చేయాలని కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.
‘రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్’ కేసులో ఆర్టికల్ 19(1)(ఎ) కింద పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని 1950లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే ఏడాది ‘బ్రజ్ భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ’ కేసులో వార్తలను ప్రచురించడానికి ముందు సెన్సార్ షిప్‌ను కోర్టు కొట్టివేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు తొలి విజయం.
‘అభిషేక్ ఉపాధ్యాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ’ (2024) కేసులో జర్నలిస్ట్ రాతలను ప్రభుత్వ విమర్శగా భావించినంత మాత్రాన, ఆ రచయితపై క్రిమినల్ కేసులు నమోదు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభుత్వ చర్యలను విమర్శించే జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తుంది.
‘సిద్ధార్థ్ వరదరాజన్, ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం’ (2025) కేసులో, ఒక వార్తా పోర్టల్‌కు సంబంధించిన సీనియర్ జర్న లిస్టులపై నిర్బంధ చర్యలు తీసుకోకుండా అస్సాం పోలీసులను సుప్రీంకోర్టు నిలువరించింది. ఈ చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడిగా కోర్టు భావించింది.
పత్రికా స్వేచ్ఛ గురించి న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇస్తున్నా, వేధింపులకు సంబంధించి పోలీసులను హెచ్చరిస్తున్నా ప్రభుత్వాల ఆదేశాల మేరకు వారు ఈ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి కేసులు నిలవవని వారికీ తెలుసు. అయితే ఈ లోపు తాత్కాలికంగా ఇబ్బంది పెడుతూ ‘చిల్లింగ్ ఎఫెక్ట్’తో భయ పెట్టడమే వారి ప్రధానోద్దేశం. ఇలాంటి చర్యలకు సైతం వారు కచ్చి తంగా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుందనేది వాస్తవం.
పి. విజయ బాబు
వ్యాసకర్త రాజ్యాంగ న్యాయ శాస్త్ర పట్టభద్రులు, సీనియర్ సంపాదకులు