సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాను గవర్నరు, రాష్ట్రపతి విధుల్లో వేలు పెట్టేది లేదని పరోక్షంగానైనా స్పష్టంగానే తెలియబర్చింది. రాష్ట్రపతి రిఫరెన్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తన అభిప్రాయాల్ని ఏకగ్రీవంగా వెలిబుచ్చింది. కొండొకచో కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాన్నీ, వాదననూ బలపర్చింది. శాసన వ్యవస్థకు, కార్య నిర్వాహక వ్యవస్థకు నడుమ ఏర్పడగల వివాదానికి ‘మీరూ మీరే చూసుకోండి గానీ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ అన్న తరహాలో జవాబులిచ్చింది.
ఈమధ్య గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు ఎక్కువవుతున్నాయి. కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో తస్మదీయ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి వివాదాలు వస్తున్నాయి. రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లు గవర్నర్ సంతకం పెడితేనే చట్టంగా మారుతుంది. ఆయన సంతకం పెట్టాలి, లేదా తిప్పి పంపాలి లేదా రాష్ట్రపతి అభిప్రాయాన్ని కోరుతూ పంపాలి. ఇలా ఏదో ఒక నిర్ణయం ఎప్పటిలోగా తీసుకోవాలన్నది రాజ్యాంగం చెప్పలేదు. అది ఆధారం చేసుకొని కొంతమంది గవర్నర్లు ఎటూ తేల్చకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. దాని వల్ల ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాను చట్టాన్ని అందివ్వలేని స్థితిలో పడుతుంది.
(మాటలే సరిగ్గా రాని వయసులో డైరెక్టరై పోయాడు)
ఇలాంటి కేసుల్లో గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది ఏమంటే మరీ జాప్యం చేసిన బిల్లుల్ని ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లు అనుకోవాలని! అయితే ఇప్పుడు అదే సుప్రీం కోర్టు అలా ఆటోమేటిక్ ఆమోదం (డీమ్డ్ అస్సెంట్) అన్నది రాజ్యాంగ బద్ధం కాదంది. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయం తీసుకోవడంపై ఎలాంటి గడువూ లేదంది. పైగా వారి నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతం అని కూడా అభిప్రాయ పడింది. అయితే బిల్లులపై జాప్యం చెయ్యడం అన్యాయమని తోస్తే వాటిపై కాల పరిమితి పెట్టే అవకాశం కోర్టు తీసుకుంటుందని చెప్పింది. స్థూలంగా రాష్ట్రపతి, గవర్నర్‌ల అధికారాల పట్ల, కేంద్రం వాదన పట్ల సానుకూల ధోరణితో ఉందీ తీర్పు.
చదవండి: ఇంటర్న్స్ కావాలి, నెలకు రూ. లక్ష స్టైఫండ్ : ట్విస్ట్ ఏంటంటే
– డా.డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ


