
మల్లోజుల
అభిప్రాయం
మల్లోజుల వేణుగోపాల రావు లొంగిపోవడం మీద మావోయిస్టు అభిమానులకు కూడా సానుభూతి ఉంది. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఏదో ఘన విజయాన్ని సాధించినట్టు పళ్ళు ఇకిలించి నవ్వితే సహజంగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఒకరు నవ్వినా మరొకరు ఏడ్చినా జరగాల్సిందే జరుగుతోంది!
మావోయిస్టు గెరిల్లాలు 70 మంది తుపాకులు తెచ్చి ముఖ్యమంత్రికి స్వాధీనం చేసి వారి చేతుల మీదుగా రాజ్యాంగ ప్రతుల్ని అందు కున్నారు. ఇదొక పారడాక్సీ వేడుక. రాజ్యాంగం వెర్సస్ రైఫిల్! ఆ వెంటనే ఛత్తీస్‌గఢ్‌లో ఆశన్న బృందం లొంగుబాటు. ఇలాంటి వేడుకలు సమీప భవిష్యత్తులో ధారావాహికంగా మరికొన్ని జరగవచ్చు.
చాలామంది మరచిపోయినట్టున్నారుగానీ, దేశంలో రక్తపాత విప్లవాన్ని నివారించడానికే రాజ్యాంగం రూపుదిద్దుకుంది. నిజాం సంస్థానంలోని తెలంగాణలో 1946 జూలై 4న రైతాంగ సాయుధ పోరాటం ఆరంభం అయింది. ఆ ఏడాది డిసెంబరు 9న భారత రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగింది. నాలుగు రోజుల తరువాత డిసెంబరు 13న జవహర్‌లాల్ నెహ్రూ లక్ష్య ప్రకటన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
రక్తపాత విప్లవ నివారణకే...
రాజ్యాంగంలో పొందుపరచిన ప్రతి ఆదర్శం వెనుక రక్తపాత విప్ల వాన్ని నివారించాలనే లక్ష్యం ఉంది. అంబేడ్కర్ ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే బాధితులు తిరగబడి ప్రజాస్వామిక భవనాన్ని పేల్చి పడేస్తారు అని రాజ్యాంగ సభలో చేసిన తన చివరి ప్రసంగంలో హెచ్చరించారు.
మన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శ ప్రకటనగా రూపొంద డానికి కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఒక కారణం అంటే అతిశయోక్తి కాదు. నక్సలైట్ పోరాటాల వ్యాప్తిని నిరోధించడానికే భూపరిమితి, అటవీ భూములు, ఆదివాసుల హక్కుల రక్షణ వగైరా చట్టాలు రూపొందాయి. రాజ్యాంగ తొలి ఆదర్శాలైన సమానత్వం సోదర భావాలకు మరింత స్పష్టతను చేకూర్చడానికి రాజ్యాంగ పీఠికలో మతసామరస్యం, సామ్య వాదం ఆదర్శాలు చేరింది కూడా నక్సలైట్ల భయంతోనే! అందుచేత నక్స లైట్ల పోరాటాలు, ప్రాణ త్యాగాలు వృథా ప్రయాసలు అనడానికి వీల్లేదు.
రెండు అధ్యాయాలు
వందేళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను మన ఆసక్తి మేరకు వంద సంకలనాలుగా రాయవచ్చు. రెండు అధ్యాయాల్లో రాయాలంటే మాత్రం దానికో ప్రమాణం ఉంది. అది: 1990లకు ముందు, 1990ల తరువాత. పెట్టుబడిదారీ సమాజం రెండు పనులు చేస్తుంది; యంత్రాల వినియో గాన్ని పెంచి సంపదని విపరీతంగా సృష్టిస్తుంది; అదే సందర్భంలో సృష్టి కర్తలకు యజమానులకు మధ్య శత్రుత్వం కూడా విపరీతంగా పెంచుతుంది. ఈ రెండు ధోరణులు సమాజాన్ని అనివార్యంగా సామ్యవాదం వైపునకు నడిపి స్తాయనేది మార్క్సిస్టు మూల సిద్ధాంతం. వైచిత్రి ఏమంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రామికులు, యజమానుల మధ్య శత్రుత్వాన్ని పెంచకుండానూ బతకలేదు; పెంచినా బతకలేదు. తెలివిగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడా నికి అది నిరంతరం సృజనాత్మకంగా జీవన్మరణ పోరాటాన్ని సాగిస్తుంటుంది.
అయితే, అంతర్గత బలహీనతలు, లోపాలు, శాపాలు కమ్యూనిస్టులకు బోలెడు ఉన్నాయి. 1990లకు కొంచెం అటూ ఇటుగా తూర్పు యూరప్‌లోని సోషలిస్టు దేశాలు పతనమయ్యాయి. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైంది. చైనా లోనూ సోషలిస్టు ధోరణులు తగ్గి పెట్టుబడిదారీ ధోరణులు పెరిగాయి. ఫలితంగా, కమ్యూనిజానికి ఆమోదాంశమే ఇరుకున పడిపోయింది.
‘పెట్టుబడిదారులారా... ఏకం కండి!’
సరిగ్గా ఇలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్న ప్రపంచ పెట్టుబడి దారులు ఏకం అయ్యారు. అప్పటికే క్లౌస్ మార్టిన్ స్క్వాబ్ వంటివారు ప్రపంచ ఆర్థిక వేదికను నడుపుతున్నాడు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ‘నిర్మాణాత్మక సర్దుబాట్లు’ సిద్ధాంతాన్ని రూపొందించాయి. మరోవైపు, ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ విధానం వచ్చింది. ఇదే అదనుగా, గ్యాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ సూదర్‌ల్యాండ్ ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్మాణానికి నడుం బిగించాడు. చాలాకాలం ముందే ఆస్ట్రియా రాజకీయార్థికవేత్త జోసెఫ్ షుంపీటర్ ‘సృజనాత్మక విధ్వంసం’ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. జోయెల్ మోక్యర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్ త్రయం దీనికో రోడ్ మ్యాప్ గీసిపెట్టారు. 2025 నోబెల్ బహుమానం ఇచ్చింది ఈ ముగ్గురికే!
వీళ్ళందరూ తెలివైనవాళ్ళు. ఎక్కడా సామ్యవాదానికి వ్యతిరేకులం అని చెప్పరు. పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగానూ మాట్లాడరు. మార్కెట్ ప్రజాస్వామ్యం, పర్యావరణ రక్షణ వంటి అందమైన పదాల్ని వాడుతుంటారు. మార్క్సిస్టులు సామాజిక పరిణామాలకు కొలబద్దగా భావించే ఉత్పత్తి విధానాన్ని వాళ్ళు, కమ్యూనిస్టు పార్టీలకే అర్థం కాని ఒక మార్మిక వ్యవహారంగా మార్చేశారు. ఒకరోజు మార్కెట్లో వెలిగిన బ్రాండు మరు నాడు కనిపించదు. ఒకదాన్ని అర్థం చేసుకునేలోపునే దాన్ని తీసివేసి దాని స్థానంలో మరోదాన్ని ప్రవేశ పెడుతుంటారు. దీనికి వాళ్ళు పెట్టిన అంద మైన పేరు ‘సృజనాత్మక విధ్వంసం’!
దీనికి తోడు అనేక దేశాల్లో మతతత్త్వాలను రెచ్చగొట్టడం మొద లెట్టారు. దీనితో రాజకీయ లబ్ధిని సులువుగా పొందడమేగాక కొత్త తరాలు సామ్యవాదం వైపునకు మరలకుండా అడ్డుకోవడమూ సాధ్యం అవుతుంది. దీనికి సమాంతరంగా సామాజిక ఉనికివాద ఉద్యమాలు తలెత్తి సన్నివేశాన్ని ఇంకా సంక్లిష్టంగా మార్చాయి. ఇంత జరిగిపోతున్నా సైద్ధాంతిక రంగంలో పెట్టుబడిదారీ వ్యూహకర్తల్ని ఢీకొనే ఆలోచనాపరుల్ని కమ్యూనిస్టు పార్టీలు సృష్టించుకోలేకపోయాయి. దానికి ప్రధాన కారణం కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగుతున్న ఏకేశ్వరోపాసన!
పార్లమెంటరీ పంథా ప్రత్యామ్నాయమేనా?
ప్రపంచ పెట్టుబడిదారులు ఇంతగా విజృంభిస్తున్న సమయంలో, ఇండి యాలో ప్రధాన నక్సలైట్ పార్టీగా భావించే పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వ పోరులో నిండా మునిగి వుంది. ముందు కేజీ సత్యమూర్తిని తరిమేశారు. అవే పద్ధతుల్లో కొండపల్లి సీతారామయ్యను బయటికి పంపించారు. నిజా నికి కొండపల్లి, సత్యమూర్తి కలిసి కొనసాగినా విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో అనూహ్య మార్పులు ఏమీ వచ్చేవి కావు. వాళ్ళు చేయగలిగింది చేసేశారు. చరిత్రలో వాళ్ళ పాత్రలు అక్కడికే పరిమితం.
ఆ తరువాత విప్లవ పార్టీలకు నాయకత్వం వహించినవాళ్ళు ఆపాటి సమర్థులు కూడా కాదు. పెట్టుబడిదారీ సమాజంలో అతి వేగంగా జరిగిపోతున్న పరిణామాలను అర్థం చేసుకుని విరుగుడు కనిపెట్టే శక్తి వాళ్ళకు లేకపోయింది. బ్రిటిష్ కాలంలో 303 రైఫిల్ గొప్పది. ఓ నలభై ఏళ్ళ క్రితం ఏకే 47 గొప్పది. ఇప్పుడు మానవ రహిత డ్రోన్లు, యుద్ధ విమానాలు వచ్చేశాయి. పాత అవగాహనలతో, పాత ఆయుధాలతో కొత్త శక్తుల్ని ఎదుర్కోవడానికి సిద్ధమైతే అది దుస్సాహసం అవుతుంది!
ఏ ఉద్యమంలో అయినా విధిగా మూడు తరాలుండాలి. యువతరం, మధ్యతరం, అనుభవతరం. అనుభవతరం బండిని లాగుతుండాలి. యువ తరం బండిని గెంటుతుండాలి. కొత్త తరాల్ని ఆకర్షించలేకపోతే విప్లవ పార్టీలు వృద్ధాశ్రమాలుగా మారిపోతాయి. ఆయుధాలను ఉపయోగించడం అటుంచి వాటిని మోయడం కూడా సాధ్యం కాదు.
ఒక వ్యూహం ప్రకారం ఉద్యమాల్లోనికి యువతరం రిక్రూట్మెంటును ఆపగలిగినవాళ్ళు... కల్లోల ప్రాంతాల్లో ప్రాణరక్షణ మందుల సరఫరానూ ఆపేశారు. వృద్ధాప్యంలో వచ్చే జీవనశైలి వ్యాధులకు అడవిలో మందులు అందకపోతే అల్లకల్లోలం జరిగిపోతుంది. గ్లూకోజ్ స్థాయిలు పెరిగి రెటీనో పతితో అంధులైన నాయకులు దారి కనిపించక పోలీసులకు దొరికిపోతున్న బాధాకరమైన కేసులు ఇటీవలి కాలంలో అనేకం ఉన్నాయి.
అణగారిన సమూహాల సహజమైన ఆప్షన్ సమసమాజమే. ఆ లక్ష్య సాధన కోసం పుట్టిన పార్టీలు బలహీనంగా ఉన్నప్పుడే మరోవైపు చూడాల్సి వస్తుంది. సాయుధ పోరాటానికి ప్రత్యామ్నాయం రాజ్యాంగం అనడం కూడా ఇప్పుడు సమంజసం కాకపోవచ్చు. పాలకులు మంచోళ్ళయితే చెడ్డ రాజ్యాంగం కూడా ప్రజలకు మంచిదయిపోతుంది; పాలకులు చెడ్డోళ్ళయితే మంచి రాజ్యాంగం కూడా ప్రజలకు చెడ్డదయిపోతుందని అంబేడ్కర్ చెప్పి ఉన్నారు. ఇప్పుడు సమస్య రాజ్యాంగం మంచిదా, కాదా అన్నది కాదు; పాలకుల స్వభావం ఏమిటీ అన్నదే అసలు సమస్య!
మన రాజ్యాంగానికి ప్రాణం ప్రజాస్వామిక ఎన్నికలతో కూడుకున్న పార్లమెంటరీ వ్యవస్థ. ఈ రెండింటినీ, కార్పొరేట్ మతతత్వ నియంతృత్వం భ్రష్టు పట్టించింది. ఆయుధాలు అప్పగించిన మావోయిస్టులు పార్లమెంటరీ పంథా చేపడతారా? అక్కడ మార్పులు తేగలుగుతారా? దానికి సమాధానం కోసం మరికొంతకాలం వేచిచూడాలి.
డానీ
వ్యాసకర్త సమాజ విశ్లేషకులు