
మల్లోజుల వేణుగోపాల్ (ఫైల్)
60 మంది అనుచరులతో మహారాష్ట్రలో లొంగుబాటు
సోమవారం రాత్రి 10 గంటలకు గడ్చిరోలి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు..
7 ఏకే–47 సహా 54 తుపాకులు పోలీసులకు అప్పగింత
లొంగిపోయినవారిలో ముగ్గురు డీకేఎస్‌జెడ్‌సీ సభ్యులు
పదిమంది డివిజినల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు పోలీసుల వెల్లడి..
16న అధికారికంగా ప్రకటించనున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
1980 నుంచి పీపుల్స్‌వార్ ద్వారా సాయుధపోరాటం మొదలు
2011లో సోదరుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్
అనారోగ్యం, పార్టీతో రాజకీయ విభేదాలతోనే లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, పెద్దపల్లి: తొలితరం మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. ఆయన తలపై రూ.6 కోట్ల వరకు రివార్డు ఉంది. 60 మంది అనుచరులతో కలిసి ఆయన గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వేణుగోపాల్‌తోపాటు లొంగిపోయిన మావోయిస్టులందరినీ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో హోద్రి గ్రామం నుంచి పోలీస్ వాహనాల్లోనే గడ్చిరోలి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
లొంగిపోయినవారిలో ముగ్గురు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జెడ్‌సీ) సభ్యులు, పదిమంది డివిజినల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, మల్లోజుల లొంగుబాటును మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 16న మీడియా సమావేశంలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించనున్నారని సమాచారం. మల్లోజుల భార్య, గడ్చిరోలి దళ సభ్యురాలు తారక్క 2024 డిసెంబర్ 31న లొంగిపోయారు.
ఆపరేషన్ కగార్ వల్ల పార్టీ ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోవడంతో ఇక పోరాడలేమని గ్రహించి మావోయిస్టు పార్టీలో కొందరు లొంగుబాట పట్టారు. మల్లోజుల కూడా సాయుధ పోరాట పంథాను వీడుతున్నట్లు ఇటీవలే లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో మల్లోజుల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్ జీ కూడా పార్టీలో అగ్రనేతే. ఆయన 2011లో పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. కిషన్‌జీ భార్య పోతుల కల్పన గతేడాది తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
లొంగుబాటుకు కారణాలివే..
వేణుగోపాల్‌కు ప్రస్తుతం 70 ఏళ్లు. ఆయనపై 100కుపైగా కేసులున్నాయి. అనారోగ్య, వ్యక్తిగత కారణాలతోపాటు మారుతున్న రాజకీయ పరిస్థితులు కూడా ఆయన లొంగుబాటుకు కారణమని చెబుతున్నారు. ప్రజల నుంచి రోజురోజుకూ ఆదరణ తగ్గుతుండటం, అడవులపై బలగాల పట్టు పెరిగిన కొద్దీ.. వాటిని వదిలి కొత్త ప్రాంతాలకు వెళ్లడంపై వేణుగోపాల్ విభేదిస్తూ వస్తున్నారు. సాయుధ పోరు వదిలి రాజకీయ వేదికగా ఉద్యమించాలని కొంతకాలంగా చెబుతున్నారు.
ఈ విషయంపై ఆగస్టు 15న ‘టెంపరరీ ఆర్మ్‌డ్ స్ట్రగుల్ అబాండెన్’పేరిట విడుదల చేసిన లేఖ సెపె్టంబర్ 17న వెలుగుచూడటం పార్టీలో కలకలం రేపింది. పార్టీలో తీవ్ర చర్చకు దారితీయడంతో ఆయుధాలు సరెండర్ చేయాలని పార్టీ ఆదేశించింది. వేణుగోపాల్ లొంగుబాటును మహారాష్ట్ర గడ్చిరోలి, ఉత్తర బస్తర్, దండకారణ్యంలోని మెజారిటీ మావోయిస్టు అనుచరగణం సమర్థిస్తోంది. కానీ, మావోయిస్టు అగ్రనేతలు పుల్లూరి ప్రసాద్, పార్టీ తెలంగాణ కమిటీ, సెంట్రల్ కమిటీ నేతలు ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
తండ్రి బాటలో పోరాట మార్గం..
మల్లోజుల వేణుగోపాల్‌ది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కేంద్రం). బ్రాహ్మణ కుటుంబంలో 1956లో ఆయన జన్మించారు. తండ్రి మల్లోజుల వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా తామ్రపత్రం అందుకున్నారు. ఆయన వెంకటయ్య 1997లో మరణించారు. తల్లి మధురమ్మ గతేడాది కాలం చేశారు. మరో సోదరుడు ఆంజనేయులు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి రిటైరయ్యారు. తండ్రి బాటలోనే పేద ప్రజల హక్కుల కోసం మల్లోజుల కోటేశ్వర్‌రావు, వేణుగోపాల్ ఉద్యమించారు.
జగిత్యాల జైత్రయాత్ర అనంతరం 1978లో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1980లో పీపుల్స్‌వార్ ఆవిర్భావ సభ్యులుగా వ్యవహరించారు. 1986లో పెద్దపల్లిలో డీఎస్పీ బుచ్చిరెడ్డిని అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్ కాల్చి చంపారు. ఆగ్రహించిన పోలీసులు వెంకటయ్య – మధురమ్మ ఇంటిని కూల్చివేశారు. దీంతో కొంతకాలం వారు గుడిసెలో తలదాచుకున్నారు. వేణుగోపాల్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి అధినేతగా పనిచేశారు. మహారాష్ట్ర, ఏపీ, గోవాతోపాటు పశ్చిమ కనుమల్లో పార్టీ కార్యకలాపాలు విస్తరించారు. 2010లో పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేశారు.
2010లో గడ్చిరోలిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల ఊచకోతలో ఇతనే మాస్టర్ మైండ్ అని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. 2011లో పశ్చిమబెంగాల్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు మరణించారు. ఆ తరువాత సెంట్రల్ ఇండియా అడవుల్లో పార్టీని బలోపేతం చేయడంలో వేణుగోపాల్ వ్యూహాలు రచించారు. ఆయన గడ్చిరోలి జిల్లాలో పనిచేసే సమయంలో తారక్కను వివాహమాడారు.
2018లో ఆమె మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. 44 ఏళ్లపాటు అజ్ఞాతంలోనే ఉన్న ఆయన పార్టీ విధానాలతో విబేధించి జనజీవన శ్రవంతిలో కలిశారు. వేణుగోపాల్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కోయ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని చెబుతారు. ‘సాధన’అనే కలం పేరుతో గోండుల జీవితాలకు అక్షరరూపం ఇచ్చారు. సరిహద్దు, రాగో అనే నవలు రాశారు.
అడవి నుంచి అమ్మకు లేఖ
తన తల్లి మధురమ్మ అంత్యక్రియలకు రాలేకపోయిన వేణుగోపాల్.. మీడియాలో కథనాలు చూసి ‘అమ్మా.. నన్ను మన్నించు’అని లేఖ రాశారు. ‘నీకు, అమరుడైన నా సోదరునికి.. మన కుటుంబానికి ఏ కలంకం రాకుండా, జనానికి దూరం కాకుండా తుదివరకూ నమ్మిన ఆశయాల కోసం నిలబడతానని మరోసారి హామీ ఇస్తున్నా.. అమ్మా’అంటూ లేఖ విడుదల చేశారు. దానికి విరుద్ధంగా వేణుగోపాల్ లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.
నానమ్మ ఉంటే సంతోషించేది
మా బాబాయ్ జనజీవన స్రవంతిలోకి రావడం సంతోషంగా ఉంది. కుటుంబం, దోస్తుల ప్రేమను దూరం చేసుకుని నమ్మిన సిద్ధాంతాలు, ఆశయాల కోసం ఇన్నేళ్లు నిస్వార్థంగా పనిచేశారు. మా నానమ్మ (మధురమ్మ) కొడుకును చివరిచూపు చూడాలని తపించింది. రెండేళ్ల క్రితం చనిపోయింది. ఇప్పుడు ఉంటే కొడుకుని చూసుకుని సంతోషపడేది.
–దిలీప్‌శర్మ, వేణుగోపాల్ అన్న కూమరుడు
వారిచేతుల్లోనే ఎదిగిన
నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు వేణువాళ్ల ఇంట్లోనే తిరుగుతుండేవాడిని. కోటన్న, వేణన్న నన్ను ఎత్తుకుని ఆడించేవారు. విప్లవబాట పట్టాక మధురమ్మ ద్వారా వారి గురించి తెలుసుకున్నా. వెంకటయ్య తాత, కిషన్ అన్న, మధురమ్మ చనిపోయినప్పుడు కూడా వాళ్లు రాలేదు. ఇప్పుడు లొంగిపోయారు. ఇక్కడకు వస్తే ఒక్కసారి చూడాలని ఉంది.
– ఠాకూర్ విజయ్‌సింగ్, పొరుగింటి వ్యక్తి