
మావోయిస్టుల ప్రభావాన్ని చెరిపేసేందుకే: సీఆర్‌పీఫ్
న్యూఢిల్లీ/బిజాపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్ బలగాలు 10 వేలకు పైగా రేడియో సెట్లను ప్రజలకు పంపిణీ చేసింది. జాతీయ స్థాయి పరిణామాలను వారికి అందజేయడం, మావోయిస్టుల సైద్ధాంతిక ప్రభావం నుంచి స్థానికులను దూరం చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో వీటిని అందజేశామని సీఆర్‌పీఎఫ్ తెలిపింది.
గడిచిన నాలుగు నెలల కాలంలో దట్టమైన బస్తర్ అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో వందలాది చిన్నాపెద్దా సమావేశాలను పూర్తి చేసినట్లు వివరించింది. ఇందుకోసం బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల కోసం హోంశాఖ రూ. 1.62 కోట్లు కేటాయించిందని సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సుమారు రూ.1,500 ఖరీదు చేసే ఈ రేడియోలు బ్యాటరీలతోపాటు కరెంట్ సాయంతోనూ పనిచేస్తాయన్నారు.
మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లో 180 కంపెనీల బలగాల సాయంతో మొత్తం 10,800 రేడియో సెట్లను అందజేశామన్నారు. కుటుంబానికి ఒకరు చొప్పున కనీసం 54 వేల మందిని మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడేయటమే తమ లక్ష్యమని చెప్పారు. 2026 మార్చికల్లా మావోయిస్టులను పూర్తిగా ఏరిపారేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందన్నారు.
ఇందులో భాగంగానే సంక్షేమ, అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’సహా రేడియోలో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలను గురించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని వారికి వివరిస్తున్నామని తెలిపారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో మరిన్ని రేడియో టవర్లను ఏర్పాటు చేసి, స్థానికులకు రేడియో ప్రసారాలను అందుబాటులోకి తేవాలని హోం శాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు.