
ఆవిర్భవించి దాదాపు అరవయ్యేళ్లు కావస్తుండగా నక్సలైట్ ఉద్యమం తొలిసారి కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అరెస్టులు, నిర్బంధాలు, ఎన్‌కౌంటర్లు ఆ ఉద్యమానికి కొత్త కాకపోయినా, ఈ స్థాయిలో బీటలు వారటం ఇదే ప్రథమం. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావుతో సహా 61 మంది నక్సలైట్లు గడ్చిరోలిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముందు బుధవారం లొంగిపోయారు. అస్త్ర సన్యాసం చేసినవారు అప్పగించిన ఏకే–47లు, ఇతర తుపాకులు స్వీకరించి అందుకు బదులుగా వారికి సీఎం రాజ్యాంగ ప్రతులు అందజేశారు.
నక్సల్స్‌కు బలమైన స్థావరంగా భావించే అబూజ్‌మాడ్ పూర్తిగా భద్రతా బలగాల అదుపులోకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించి ఛత్తీస్‌గఢ్‌లో నిన్న, ఈ రోజు 197 మంది లొంగిపోయారని తెలిపారు. మొత్తం ఈ రెండు రోజుల్లో 258 మంది ఉద్యమానికి వీడ్కోలు చెప్పారు. ముఖ్యంగా ఉత్తర బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం పూర్తిగా అంతరించింది.
గత కొన్ని నెలలుగా ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడ్, జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. బయటినుంచి వెళ్లిన క్యాడర్‌తోపాటు పలువురు ఆదివాసీలు కూడా వీటిల్లో మరణించారు. ఈ పరిణామాలు గమనిస్తే వచ్చే ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయాలన్న కేంద్ర సంకల్పం నెరవేరేలా కనబడుతోంది.
పీపుల్స్ వార్‌గా 1980లో ఆవిర్భవించిన పార్టీ ఇరవయ్యేళ్లలో పెనువేగంతో విస్తరించింది. 2000వ సంవత్సరంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ), 2004లో మావోయిస్టు పార్టీగా రూపుదిద్దుకున్న సమయానికి దేశంలోని 92,000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 180 జిల్లాల్లో దాని ప్రభావం ఉన్నదని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. నక్సలైట్ ఉద్యమం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పని తెలిపింది. తాజాగా ఆ ఉద్యమ ప్రభావం 11 జిల్లాలకు పరిమితమైంది. వాటిల్లో కూడా ఛత్తీస్‌గఢ్‌లోని మూడు జిల్లాలు – బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్‌లలో మాత్రమే నక్సల్ తీవ్రత అధికంగా ఉన్నదని కేంద్ర హోంమంత్రిత్వ వర్గాల కథనం.
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక మొదట్లో మందకొడిగా ప్రారంభమైన మార్పులు తర్వాత కాలంలో వేగం పుంజుకున్నాయి. పర్యవసానంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల నుంచి ఉద్యమంలోకి రిక్రూట్‌మెంట్ గణనీయంగా తగ్గింది. ఆదివాసీ యువత రాక కొంతమేర పెరిగిన మాట వాస్తవమే అయినా ఏదో సంచలనాత్మక ఘటనల సందర్భంలో తప్ప మావోయిస్టు స్వరం వినబడటం తగ్గింది. సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై ఆ పార్టీ వైఖరేమిటో తెలియని స్థితి నెలకొంది.
ఇప్పటికీ ఆకలి, దారిద్య్రం ఉన్నా, గతంలో మాదిరి కాక వాటి నివారణకు ప్రభుత్వాలు ఏదో మేరకు పథకాలు రచించి అమలు చేస్తున్నాయి. తమ డిమాండ్లు అరణ్య రోదనగా మిగిలే గతకాలపు పరిస్థితి మారి, ఎవరో ఒకరు గొంతెత్తటం, వాటివల్ల సానుకూల ఫలితాలు రావటం సామాన్య ప్రజలకు ఊరటనిస్తోంది. అణచివేత, నిషేధాలతో అజ్ఞాత వాసంలో ఉండటం వల్ల కొద్దోగొప్పో బలం ఉన్న ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు వెనువెంటనే స్పందించే శక్తి లేకపోయింది.
అంతక్రితం మాటేమోగానీ... మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు ఎదురు కాల్పుల్లో మరణించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అంతర్మథనం మొదలైనట్టు కనబడుతోంది. మొన్న ఆగస్టులో సాయుధ పోరుకు తాత్కాలిక విరామం ప్రకటిద్దామంటూ మల్లోజుల పేరిట లేఖ విడుదలైనప్పుడు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని అందరూ అనుకున్నా పార్టీలో పలు కమిటీల మద్దతు కూడా ఉన్నదని మీడియా కథనాలు తెలిపాయి.
ఇప్పుడేర్పడిన సానుకూల స్థితిని ఆదివాసీ జీవితాల మెరుగుకు వినియోగించటంతో పాటు పర్యావరణానికీ, ఆదివాసీ సంస్కృతికీ విఘాతం కలగని అభివృద్ధి నమూనాల రూపకల్పనకు పాలకులు కృషి చేయాలి. మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలుచేస్తే సమస్యలు తలెత్తవు. ఆ వెంబడే వచ్చే సామాజిక, రాజకీయ ఉద్యమాలూ ఉండవు. లేకుంటే అసంతృప్తి రూపం మార్చుకుంటుంది తప్ప సమసి పోదు.