breaking news
Venugopal Rao mallojula
-
పార్టీ తప్పులే శత్రువుకు ఆయుధాలయ్యాయి
సాక్షి, హైదరాబాద్: ‘మావోయిస్టు పార్టీ అనుసరించిన అతివాద, దుందుడుకువాద చర్యలన్నీ ఎక్కడికక్కడే అంతిమంగా శత్రువుకు ఉపయోగపడే ఆయుధాలయ్యాయి. వాటి ద్వారా శత్రువు దండకారణ్యం మినహా మిగతా ప్రాంతాలలో తక్కువ కాలంలోనే ఉద్యమాలను దెబ్బ తీయడంతో పాటు మమ్మల్ని బలపడకుండా చేయగలిగాడు. చాలా కాలం క్రితమే బలహీనతలు ముందుకు వచ్చినప్పటికీ సకాలంలో వాటిని అర్ధం చేసుకోలేకపోయాం. సరిదిద్దుకోలేకపోయాం. నిలకడైన, బలమైన సంఘటిత విప్లవోద్యమాన్ని నిర్మించలేకపోయాం. ఇప్పటికైనా పంథా మార్చుకోవాలి. అందుకు వీలుగా, తాత్కాలికంగా చేస్తున్న సాయుధ పోరాట విరమణను ప్రజలు అర్ధం చేసుకోవాలి..’అని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ సోను పేరిట విడుదలైన ఒక లేఖ పేర్కొంది. తమ తప్పులకు బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. ఈ ఆరు పేజీల లేఖ గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సాధారణంగా మావోయిస్టులు విడుదల చేసే లేఖ మాదిరి ఇది లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. సరైన మార్గంలో ముందుకు వెళదాం గత 20 మాసాలకు పైగా భారత దోపిడీ పాలకవర్గాలు కొనసాగిస్తున్న చుట్టుముట్టి మట్టుబెట్టే దాడులను మనమంతా అసమాన త్యాగాలతో ఎదుర్కొంటున్నాం. ఈ దాడులలో పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు సహా వందలాది మంది కామ్రేడ్లు, విప్లవ ప్రజా సంఘాలు, ప్రజా మిలీషియా, జనతన సర్కార్ల కార్యకర్తలను, విప్లవ ప్రజలనూ కోల్పోయాం. విప్లవోద్యమం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేస్తున్న అమర వీరులందరికీ పేరు పేరునా విప్లవ జోహార్లు అరి్పద్దాం. వారి ఆశయాల సాధనకై భవిష్యత్తులో సరైన మార్గంలో ముందుకు పోదాం. కొత్త వెలుగులు నింపినా.. ఐదు దశాబ్దాలకు పైగా పోరాటాలు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులను, ఆశలను నింపాయి. ముఖ్యంగా మహిళలు తమ సమరశీల పోరాటాల ద్వారా పితృస్వామ్యంపై సాధించిన విజయాలు వారి జీవితాలలో పెను మార్పులకు దారి తీసి మహిళా విముక్తికి పునాదులు వేసి బలోపేతం చేశాయి. అయితే పార్టీ సాధిస్తున్న విజయాలు ఎంత గొప్పవో, చేస్తున్న తప్పులూ అంతకన్నా తీవ్రమైనవి కావడంతో, దేశంలోని ఏ ప్రాంతంలోనూ సాపేక్షికంగా నిలకడైన, బలమైన సంఘటిత విప్లవోద్యమాన్ని నిర్మించలేకపోయామన్నది ఒక చేదు వాస్తవం. ప్రపంచంలో, దేశంలో మారుతున్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడంలో పార్టీ తొలినుంచి చాలా వెనుకబడుతూ వస్తోంది. శత్రువు బలాన్ని, విప్లవ శక్తుల బలాన్ని సరిగా అంచనా వేసుకొని తగిన ఎత్తుగడలతో విప్లవోద్యమాన్ని నిర్మించడంలోనూ తప్పులు చేస్తూ వస్తోంది. మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ దెబ్బతిన్న ప్రాంతాలలో తిరిగి విప్లవోద్యమాన్ని నిర్మించడంలో ఇప్పటివరకూ పార్టీ జయప్రదం కాలేదు. ప్రజల ఆపార సానుభూతి ఉన్నా ఎట్టకేలకు ఒంటరిగానే మిగిలిపోతున్నాం. ఓటమికి శత్రువు గొప్పతనం కన్నా మా బలహీనతలు, తప్పులే ప్రధానమైనవని ఒప్పుకుంటున్నాం. విప్లవోద్యమ నిర్మాణానికే విరమణప్రజలు, కేడర్ల అసమాన త్యాగాల నుంచైనా మేం సకాలంలో గుణపాఠాలు తెలుసుకోని ఫలితంగా, దేశ పీడిత ప్రజలను తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి, అవిశ్వాసం, ఆందోళనలోకి నెట్టాం. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి విప్లవోద్యమాన్ని నిర్మించడానికి తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ తప్పదని తేలిపోయింది. ఇప్పటికైనా దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా అంటూ, సాయుధ పోరాటం అంటూ, పరిస్థితుల్లోని మార్పులతో, స్థల, కాలాలతో నిమిత్తం లేకుండా, చైనా పంథా, రష్యా పంథా అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పాలి. భారతదేశ స్థల, కాల పరిస్థితులకు తగిన పంథాలో భారత విప్లవాన్ని జయప్రదం చేయడానికి పూనుకోవడమే పార్టీ ముందు మిగిలిన ఏకైక కర్తవ్యం. ఇందుకు వీలుగా మేం తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేయడాన్ని ప్రజలు సహృదయంతో అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నిర్ణయం తీసుకోకపోతే రక్తసిక్తం అవుతున్న అడవులను శాంతి వనాలుగా మార్చలేం. మిగిలిన విప్లవ శక్తులనైనా కాపాడుకోలేం. జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నాం. -
తెలంగాణలో మావోయిస్టులు 93 మంది...
రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాభవం తగ్గిపోతున్నట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య 93 ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలోనూ రివార్డులున్న అగ్రనేతలు 28 మంది మాత్రమే ఉన్నట్లు అంచనా వేసింది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం ఒక నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం మావోయిస్టులు 93 మందిలో వరంగల్ జిల్లాకు చెందిన వారు 35 మంది కాగా, కరీంనగర్‌కు చెందిన వారు 30 మంది ఉన్నట్లు గుర్తించింది. అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో చత్తీస్‌గఢ్ సరిహద్దు వెంట మావోల కదలికలున్నట్లు పోలీసుశాఖ నిర్ధారించింది. కొత్తగా రిక్రూట్మెంట్ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టు పార్టీ గత కొంత కాలంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో జాడే లేకుండా పోయినట్లు ఇంటలిజెన్స్ అధికారులు అంచనా వేశారు. అయితే రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య తగ్గినప్పటికీ సెంట్రల్ కమిటీలో మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి హవా కొనసాగుతోంది. పార్టీ సెంట్రల్ కమిటీలో 20 మందికిగాను ఏపీ, తెలంగాణకు చెందిన వారు 12 మంది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ హరిభూషణ్ నేతృత్వంలో కొనసాగుతున్నట్లు పోలీసుల సమాచారం. వరుస ఎదురుదెబ్బలతో కుదేలు.. రాష్ట్రంలో పోలీసులు రచిస్తున్న వ్యూహ రచనతో మావోయిస్టు పార్టీ కుదేలవుతోంది. వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలతో కీలకనేతలను పొగొట్టుకొని అతలాకుతలమైంది. రాష్ట్ర సరిహద్దుల్లో ముఖ్యంగా చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు జరిపిన ఎన్కౌంటర్లలో మావోయిస్టులు భారీగా హతమయ్యారు. ఈ ఏడాది మార్చి నెలలో ఖమ్మం, చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో ఒకేసారి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గడ్చిరోలి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కీలక నేత ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్ సైతం ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో అండర్ గ్రౌండ్లో 180 మంది మావోయిస్టులు ఉండగా ప్రస్తుతం 140కి పడిపోయింది. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 93 మంది ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం. అందులోనూ ముఖ్యనేతలు రివార్డులున్న వారు కేవలం 28 మంది మాత్రమే ఉన్నారు. సెంట్రల్ కమిటీలో ఉన్న గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, గణపతి, మల్లా రాజిరెడ్డి, నంబాల కేశవరావు, మల్లోజుల వేణుగోపాలరావు వంటి వారిపై రూ.25లక్షలు, అలాగే స్టేట్ కమిటీలో ఉన్న వారిపై రూ.20 లక్షలు, జిల్లా కమిటీలో ఉన్న వారిపై రూ.10లక్షలు ఉన్న వారున్నారు. వ్యూహాత్మకంగా కట్టడి.. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విరివిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో వారిని కట్టడి చేయగలిగారు. ఇన్ఫార్మర్ల సహాయంతో గ్రేహౌండ్స్ బలగాలు అనుక్షణం జల్లెడ పట్టడంతో మావోలు కోలుకోలేకపోయారు. పోలీసులు వ్యూహత్మకంగా కట్టడి చేసి.. రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితం చేయగలిగారు. ఒకప్పుడు నల్లమల్ల అటవీ కేంద్రంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో విస్తృత కార్యకలాపాలు జరిపిన మావోయిస్టులు ప్రస్తుతం ఉనికే లేకుండా పోయింది. రాష్ట్రంలో అర్బన్ జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డిలతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మావోయిస్టుల జాడ లేదని ఇంటలిజెన్స్ రూపొందించిన నివేదికలో స్పష్టం చేసింది. కేవలం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ కదలికలున్నట్లు పేర్కొంది. కొత్త రిక్రూట్మెంట్కు దెబ్బకొట్టిన పోలీసులు.. వరుస ఎన్కౌంటర్లతో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు కొత్త రిక్రూట్మెంట్కు అవకాశం లేకుండా పోలీసులు గట్టిదెబ్బ కొట్టారు. ఏడాది క్రితం కొత్త రిక్రూట్మెంట్ కోసం నక్సల్స్ చేసిన ప్రయత్నాలను పోలీసులు అణిచివేశారు. కొన్ని విద్యాలయాల వేదికగా మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. వెంటనే అనుమానితులందరిపై డేగకన్ను వేసిన పోలీసులు అణుక్షణం వెంటాడారు. కొత్తగా రిక్రూట్ అయిన వారిలో ఎంటెక్ విద్యార్థిని మహిత అలియాస్ శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలను పోలీసులు ఎన్కౌంటర్ చేసి భయబ్రాంతులకు గురిచేశారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుతో కొత్త వారు పార్టీలో చేరేందుకు విముఖత చేపేలా చేశారు.