
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు లేఖ?
పరిస్థితులను అర్ధం చేసుకోవడంలో పార్టీ విఫలమైంది
భవిష్యత్తులో సరైన మార్గంలో ముందుకు వెళ్లాలి
చైనా పంథా, రష్యా పంథా అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పాలి
భారతదేశ స్థల, కాల పరిస్థితులకు తగిన పంథా అనుసరించాలి
తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణను ప్రజలు అర్ధం చేసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ‘మావోయిస్టు పార్టీ అనుసరించిన అతివాద, దుందుడుకువాద చర్యలన్నీ ఎక్కడికక్కడే అంతిమంగా శత్రువుకు ఉపయోగపడే ఆయుధాలయ్యాయి. వాటి ద్వారా శత్రువు దండకారణ్యం మినహా మిగతా ప్రాంతాలలో తక్కువ కాలంలోనే ఉద్యమాలను దెబ్బ తీయడంతో పాటు మమ్మల్ని బలపడకుండా చేయగలిగాడు. చాలా కాలం క్రితమే బలహీనతలు ముందుకు వచ్చినప్పటికీ సకాలంలో వాటిని అర్ధం చేసుకోలేకపోయాం. సరిదిద్దుకోలేకపోయాం.
నిలకడైన, బలమైన సంఘటిత విప్లవోద్యమాన్ని నిర్మించలేకపోయాం. ఇప్పటికైనా పంథా మార్చుకోవాలి. అందుకు వీలుగా, తాత్కాలికంగా చేస్తున్న సాయుధ పోరాట విరమణను ప్రజలు అర్ధం చేసుకోవాలి..’అని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ సోను పేరిట విడుదలైన ఒక లేఖ పేర్కొంది.
తమ తప్పులకు బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. ఈ ఆరు పేజీల లేఖ గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సాధారణంగా మావోయిస్టులు విడుదల చేసే లేఖ మాదిరి ఇది లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
సరైన మార్గంలో ముందుకు వెళదాం
గత 20 మాసాలకు పైగా భారత దోపిడీ పాలకవర్గాలు కొనసాగిస్తున్న చుట్టుముట్టి మట్టుబెట్టే దాడులను మనమంతా అసమాన త్యాగాలతో ఎదుర్కొంటున్నాం. ఈ దాడులలో పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు సహా వందలాది మంది కామ్రేడ్లు, విప్లవ ప్రజా సంఘాలు, ప్రజా మిలీషియా, జనతన సర్కార్ల కార్యకర్తలను, విప్లవ ప్రజలనూ కోల్పోయాం. విప్లవోద్యమం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేస్తున్న అమర వీరులందరికీ పేరు పేరునా విప్లవ జోహార్లు అరి్పద్దాం. వారి ఆశయాల సాధనకై భవిష్యత్తులో సరైన మార్గంలో ముందుకు పోదాం.
కొత్త వెలుగులు నింపినా..
ఐదు దశాబ్దాలకు పైగా పోరాటాలు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులను, ఆశలను నింపాయి. ముఖ్యంగా మహిళలు తమ సమరశీల పోరాటాల ద్వారా పితృస్వామ్యంపై సాధించిన విజయాలు వారి జీవితాలలో పెను మార్పులకు దారి తీసి మహిళా విముక్తికి పునాదులు వేసి బలోపేతం చేశాయి. అయితే పార్టీ సాధిస్తున్న విజయాలు ఎంత గొప్పవో, చేస్తున్న తప్పులూ అంతకన్నా తీవ్రమైనవి కావడంతో, దేశంలోని ఏ ప్రాంతంలోనూ సాపేక్షికంగా నిలకడైన, బలమైన సంఘటిత విప్లవోద్యమాన్ని నిర్మించలేకపోయామన్నది ఒక చేదు వాస్తవం.
ప్రపంచంలో, దేశంలో మారుతున్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడంలో పార్టీ తొలినుంచి చాలా వెనుకబడుతూ వస్తోంది. శత్రువు బలాన్ని, విప్లవ శక్తుల బలాన్ని సరిగా అంచనా వేసుకొని తగిన ఎత్తుగడలతో విప్లవోద్యమాన్ని నిర్మించడంలోనూ తప్పులు చేస్తూ వస్తోంది.
మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ దెబ్బతిన్న ప్రాంతాలలో తిరిగి విప్లవోద్యమాన్ని నిర్మించడంలో ఇప్పటివరకూ పార్టీ జయప్రదం కాలేదు. ప్రజల ఆపార సానుభూతి ఉన్నా ఎట్టకేలకు ఒంటరిగానే మిగిలిపోతున్నాం. ఓటమికి శత్రువు గొప్పతనం కన్నా మా బలహీనతలు, తప్పులే ప్రధానమైనవని ఒప్పుకుంటున్నాం.
విప్లవోద్యమ నిర్మాణానికే విరమణ
ప్రజలు, కేడర్ల అసమాన త్యాగాల నుంచైనా మేం సకాలంలో గుణపాఠాలు తెలుసుకోని ఫలితంగా, దేశ పీడిత ప్రజలను తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి, అవిశ్వాసం, ఆందోళనలోకి నెట్టాం. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి విప్లవోద్యమాన్ని నిర్మించడానికి తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ తప్పదని తేలిపోయింది. ఇప్పటికైనా దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా అంటూ, సాయుధ పోరాటం అంటూ, పరిస్థితుల్లోని మార్పులతో, స్థల, కాలాలతో నిమిత్తం లేకుండా, చైనా పంథా, రష్యా పంథా అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పాలి.
భారతదేశ స్థల, కాల పరిస్థితులకు తగిన పంథాలో భారత విప్లవాన్ని జయప్రదం చేయడానికి పూనుకోవడమే పార్టీ ముందు మిగిలిన ఏకైక కర్తవ్యం. ఇందుకు వీలుగా మేం తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేయడాన్ని ప్రజలు సహృదయంతో అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నిర్ణయం తీసుకోకపోతే రక్తసిక్తం అవుతున్న అడవులను శాంతి వనాలుగా మార్చలేం. మిగిలిన విప్లవ శక్తులనైనా కాపాడుకోలేం. జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నాం.