కాంగ్రెస్‌ ఉంటే.. ప్రోగ్రెస్‌ ఉండదు | KTR Open Challenge To CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఉంటే.. ప్రోగ్రెస్‌ ఉండదు

Dec 20 2025 4:33 AM | Updated on Dec 20 2025 4:33 AM

KTR Open Challenge To CM Revanth Reddy

సిరిసిల్ల తెలంగాణభవన్‌లో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. కేసీఆరే మళ్లీ సీఎం

ఆ 66%పై నమ్మకముంటే ఎన్నికలకు రా..

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌

సిరిసిల్ల: కాంగ్రెస్‌ ఉంటే.. ప్రోగ్రెస్‌ ఉండదని.. రెండేళ్లలో ఒక్క పనైనా చేశారా? వచ్చేది మన ప్రభుత్వమే.. మళ్లీ కేసీఆరే సీఎం అని.. ఎగిరేది గులాబీ జెండాయేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా ఎన్నికైన బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణభవన్‌లో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ వెంట ఉన్నారని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్‌ఎస్‌ నుంచి అక్రమంగా చేర్చుకున్న ఆ పది మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు.

అప్పుడు ప్రజలు ఏవైపు ఉన్నారో నిర్ణయిస్తారని, దమ్ముంటే తన సవాల్‌ స్వీకరించాలని కేటీఆర్‌ అన్నారు. రేవంత్‌రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని విమర్శించారు. ‘హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌లో రేవంత్‌రెడ్డి మొదట కాంగ్రెస్‌ 66 శాతం గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారు. కానీ సరిగ్గా ఐదు నిమిషాలకే మాట మార్చి.. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారని వివరించారు.

పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు
ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు కేవలం గడ్డిపోచ లాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటని చెప్పారు. ‘బయట కాంగ్రెస్‌లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, ఢిల్లీలో రాహుల్‌గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్‌ విచారణలో మాత్రం తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి బతుకులు పూర్తిగా ఆగమైపోయాయి’అని మండిపడ్డారు. సీఎం ఒత్తిడితో స్పీకర్‌ కూడా ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్పారు
రైతులు, మహిళలు, బీసీలను మోసం చేసినందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో 117 పంచాయతీలకు 80 చోట్ల బీఆర్‌ఎస్‌ గెలవడమే దీనికి నిదర్శనమన్నారు. సీఎం, మంత్రులు జిల్లాలు తిరిగినా, బెదిరించినా ప్రజలు మాత్రం కేసీఆర్‌ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 

బీఆర్‌ఎస్‌కు కొత్త కమిటీలు వేస్తాం
కాంగ్రెస్‌ బెదిరింపులు, ఫోన్‌కాల్స్‌కు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. గెలిచిన వారు, ఓడిపోయిన వారు కలిసి పనిచేయాలని, వచ్చే సంవత్సరంలో కొత్తగా సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకుంటామని తెలిపారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ‘సెస్‌’చైర్మన్‌ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement