జ్యోతి ప్రజ్వలన చేసి బుక్‌ఫెయిర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. చిత్రంలో కోదండరాం, రియాజ్, యాకుబ్ తదితరులు
పుస్తక ప్రదర్శనలను జిల్లాలకు విస్తరిస్తాం
నిర్వహణకు రూ.3 కోట్లు, గ్రంథాలయాల పుస్తకాల కోసం రూ. కోటి మంజూరు
హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ప్రారంభంలో మంత్రి జూపల్లి
కవాడిగూడ: సమాజంలో మార్పు తీసుకురావడానికి పుస్తక పఠనం ఒక శక్తి వంతమైన ఆయుధమని, ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయంగా మారాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 38వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం పునాస మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత అధునాతన సాంకేతికత, సోషల్ మీడియా యుగంలోనూ దాదాపు 15 లక్షల మంది పుస్తక ప్రదర్శనకు రావడం శుభపరిణామమన్నారు. ప్రస్తుత విద్యావ్యవస్థ కేవలం మార్కులు ర్యాంకుల చుట్టూనే తిరుగుతోందని, ఇది మనిషిని సంస్కరించలేకపోతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాటితరం ఆలోచనా విధానం, విలువలు నేడు కల్తీ అయి.. కేవలం ఉద్యోగం, సంపాదన «ధోరణిలో పడి మానవజన్మ సార్థకతను మర్చిపోతున్నాం. పాత కాలపు సంస్కారం మళ్లీ రావాలంటే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది’అని జూపల్లి పేర్కొన్నారు.
సామాజిక చైతన్యం నింపేందుకు ప్రభాతభేరి
పుస్తక ప్రదర్శనలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు జూపల్లి వెల్లడించారు. ఇందుకోసం సాంస్కృతికశాఖ ద్వారా రూ.3 కోట్లు (జిల్లాకు రూ.10 లక్షల చొప్పున) కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. గ్రామీణ, మండల స్థాయి గ్రంథాలయాలకు మంచి పుస్తకాలను చేరవేయడానికి తక్షణమే రూ.కోటి మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల్లో సామాజిక చైతన్యం నింపేందుకు త్వరలోనే ప్రభాతభేరి అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌కు బుక్‌ఫెయిర్‌కు శాశ్వత స్థలం కేటాయించే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సోషల్ మీడియా ఇచ్చే సంతృప్తి తాత్కలికమైనదని.. పుస్తకాల ద్వారా లభించే జ్ఞానం మాత్రమే శాశ్వతమని పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ పేరు పెట్టడం హర్షణీయమని చెప్పారు. ఎన్ని సాంకేతిక మార్పులు వచ్చినా పుస్తకం ప్రాధాన్యం తగ్గదన్నారు. ఆధ్యాత్మికత, టెక్నాలజీ, చరిత్ర, సాహిత్యం వంటి అన్ని రకాల పుస్తకాలు ఒకేచోట లభించే ఈ ప్రదర్శనను నగరవాసులు కుటుంబ సమేతంగా సందర్శించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ యాకుబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాలాచారి, సీనియర్ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి, బుక్‌ఫెయిర్ ప్రధాన కార్యదర్శి ఆర్.వాసు తదితరులు పాల్గొన్నారు.


