మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణమని నిర్ధారణ
సొంత నిధులతో పునరుద్ధరించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారు
నిర్ణయం క్రిమినల్ కేసు నమోదుకు న్యాయశాఖ అంగీకారం
తొలుత షోకాజ్ నోటీసులు జారీ!.. సంస్థ స్పందనను బట్టి తదుపరి చర్యలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీయే కారణమని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. సొంత నిధులతో బరాజ్ పునరుద్ధరణకు బాధ్యత తీసుకోకపోతే సంస్థపై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ కూడా లభించినట్లు సమాచారం. ఎల్ అండ్ టీపై క్రిమినల్ కేసు పెట్టి బరాజ్ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని సంస్థ నుంచి రాబట్టుకోవాలని కాళేశ్వరం బరాజ్‌లపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అంతకు ముందు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇక బరాజ్‌ల మరమ్మతులకు అయ్యే వ్యయం అంతా సంబంధిత నిర్మాణ సంస్థలే భరించాలని, వాటి నుంచే, వాటి ద్వారానే మరమ్మతులు జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రి ఘాటుగా హెచ్చరించడంతో అధికారులు ఇప్పటికే మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీతో పాటు అన్నారం నిర్మాణ సంస్థ ఆఫ్కాన్సుకు, సుందిళ్ల నిర్మాణ సంస్థ నవయుగకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయా సంస్థల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో కఠిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పరీక్షల కోసం చెల్లించిన నిధుల రికవరీ!
ముఖ్యంగా ఎల్ అండ్ టీపై క్రిమినల్ కేసులు పెట్టడానికి న్యాయశాఖ అంగీకారం తెలుపడంతో త్వరలోనే షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ‘మీపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోరాదు?’ అని అంటూ ఒకట్రెండు రోజుల్లో తొలుత షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నోటీసులపై నిర్మాణ సంస్థ స్పందన ఆధారంగా.. క్రిమినల్ కేసు పెట్టాలా..? వద్దా..? అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే క్రమంలో అత్యవసరంగా బరాజ్‌ల పరీక్షల కోసం చెల్లించిన నిధుల రికవరీ కోసం చర్యలకు ఉపక్రమించనున్నారు.
ప్రారంభించిన సంవత్సరంలోనే బయటపడిన లోపాలు
మేడిగడ్డ బరాజ్ నిర్మాణం 2018లో పూర్తయింది. 2019 మే నెలలో ప్రారంభించారు. అదే ఏడాది నవంబర్‌లో వరదల అనంతరం గేట్లు మూయగా.. బరాజ్ దిగువ భాగంలో రక్షణ వ్యవస్థలన్నీ చెల్లాచెదురయ్యాయి. 2020 ఫిబ్రవరి, మే నెలల్లో కూడా బరాజ్‌లో రక్షణ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. ఐదుసార్లు నోటీసులు ఇచ్చినా దెబ్బతిన్న బరాజ్‌లోని కాంపోనెంట్లను నిర్మాణ సంస్థ సరిచేయలేదని ప్రభుత్వం గుర్తించింది. మరమ్మతులు చేయకుండా ఉద్దేశపూర్వకంగానే ఒప్పందంలోని నిబంధనలను అతిక్రమించిందని భావిస్తోంది.
కంప్లిషన్ సర్టిఫికెట్ల రద్దు
ఇక బరాజ్ నిర్మాణం పూర్తయిన నాటినుంచి రెండేళ్లలోపు డిఫెక్ట్ లయబుల్టీ (లోపాలు ఉంటే సవరించడం, మరమ్మతులు చేసే బాధ్యత) నిర్మాణ సంస్థదే కాగా, 2019, 2020 ఫిబ్రవరి, మే నెలల్లోనే లోపాలు గుర్తించినా సరి చేయలేదని, మరమ్మతులేవీ పూర్తి చేయకుండానే బరాజ్ నిర్మాణం పూర్తయినట్లుగా నిర్మాణ సంస్థ సర్టిఫికెట్లు పొందిందని ప్రభుత్వం గుర్తించింది. అలా సర్టిఫికెట్లు పొందడం అక్రమమని గుర్తించి వాటిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఒప్పందంలోని క్లాజు–8, 16, 30, 32.2, 323, 34, 35.1, 38 ప్రకారం నిర్మాణ సంస్థ నడుచుకోవాల్సిందేనని ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది. ఇదే క్రమంలో నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది.


