నదీ జలాల విషయంలో గత ప్రభుత్వమే మరణ శాసనం రాసింది
నీటిపారుదల మంత్రి ఉత్తమ్ ధ్వజం
‘పాలమూరు’ సామర్థ్యాన్ని 2 నుంచి 1 టీఎంసీకి తగ్గించారు
ప్రాజెక్టుకు అవసరమైన నీటిని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాలకు మరణ శాసనం రాసిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన నీటిని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి సామర్థ్యాన్ని రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించారని విమర్శించారు. నదీ జిలాల విషయంలో బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వీలుగా గురువారం ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు, ప్రజాప్రతినిధులకు ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఏపీతో అలయ్ బలయ్ చేసుకుని తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఉత్తమ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ‘పాలమూరు’ ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని చెప్పడం శుద్ధ అబద్ధమని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మొత్తం వ్యయం రూ.80 వేల కోట్లు దాటుతుందని చెప్పారు. 2015లో కేవలం రూ.35 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, కానీ డీపీఆర్ తయారు చేసే నాటికి దానిని రూ. 55 వేల కోట్లకు పెంచారని వివరించారు. అది కూడా కాలువల నిర్మాణం, భూ సేకరణ అంశం అందులో లేకుండా చేశారని చెప్పారు.
బీఆర్‌ఎస్ రూ.27 వేల కోట్లే ఖర్చు చేసింది..
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టు కోసం చేసిన వ్యయం రూ. 27 వేల కోట్లు మాత్రమేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అదే రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 2013లో ప్రతిపాదించినట్టు జూరాల వద్దనే నీటిని తీసుకుని ఉంటే వ్యయం తగ్గేదని అన్నారు.


