నీటి వాటాలు తేలేదాకా పాలమూరు–రంగారెడ్డి పరిశీలించలేం | Jal Shakti Minister CR Patil Write Letter to Minister Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

నీటి వాటాలు తేలేదాకా పాలమూరు–రంగారెడ్డి పరిశీలించలేం

Feb 1 2026 6:10 AM | Updated on Feb 1 2026 6:10 AM

Jal Shakti Minister CR Patil Write Letter to Minister Uttam Kumar Reddy

ట్రిబ్యునల్లో విచారణ పూర్తయ్యేదాకా ఆగాల్సిందే

టెలిమెట్రీలపై తదుపరి బోర్డు సమావేశంలోనే చర్చించి, నిర్ణయం తీసుకోండి

మంత్రి ఉత్తమ్‌కు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌ –2లో విచారణ పెండింగ్‌ లో ఉన్నందున .. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ ను ఇప్పట్లో పరిశీలించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్‌ –2 కి సంబంధించిన కేసులు సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున డీపీఆర్‌ పరిశీలన సాధ్యం కాదని తెలియజేసింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఈనెల 28న లేఖ రాశారు. 

కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని తెలంగాణ ప్రాజెక్టులకి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ ను ఆమోదించాలని కోరుతూ మంత్రి ఉత్తమ్‌ గత జూలై 10న, ఆ తర్వాత గత నవంబర్‌ 18న రాసిన లేఖలకు బదులిస్తూ ఈ లేఖ రాశారు. నీటి పంపిణీ ట్రిబ్యునల్‌ పరిధిలో ఉన్నందున పాలమూరు డీపీఆర్‌ ను గతంలోనే వెనక్కి పంపించామని కేంద్రం గుర్తు చేసింది. సమ్మక్క సాగర్‌ (తుపాకులగూడెం) బరాజ్‌ డీపీఆర్‌ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలనలో ఉందని, దీనిపై లేవనెత్తిన అనుమానాలు నివృత్తి చేయాలని తెలంగాణకు సీడబ్ల్యూసీ లేఖ రాసిందని గుర్తు చేసింది. 

లేఖలోని అంశాలు... 
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవడానికి జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కు ఈ ఏడాది జూలై 31దాకా గడువు ఇచ్చాం . ఇప్పటిదాకా 43 దఫాలు హియరింగ్స్‌ పూర్తయ్యాయి. తెలంగాణ వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి.  పోలవరం –బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎఫ్‌ఆర్‌)ను ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి అందించగా, ఆ డీపీఆర్‌ పై అభిప్రాయాలు వ్యక్తం చేయాలని కృష్ణా/గోదావరి బోర్డులతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కు, గోదావరి నది పరీవాహక రాష్ట్రాలు (తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌)లకు పంపించాం. ఆయా రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు/ అభిప్రాయాలను సీడబ్ల్యూసీ పరిశీలిస్తోంది. ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచకుండా కట్టడి చేయాలని తెలంగాణ కోరగా.. డ్యామ్‌ను 519.6 మీటర్ల పూర్తిస్థాయి రిజర్వాయర్‌ లెవల్‌(ఎస్‌ఆర్‌ఎల్‌)లో నిర్వహిస్తున్నామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచి్చంది. 

తెలంగాణకు ‘అదనపునీటి’అవకాశం.. 
గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టుతో బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులకు మించి నీటిని వినియోగించుకునే అవకాశం తెలంగాణకు ఉండనుంది. ఇంద్రావతి నదిలో ఛత్తీస్‌ గఢ్‌ వినియోగించుకోని వాటాను తొలిదశలో ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మించి, గోదావరి– కావేరీ అనుసంధానంలో తరలించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మలిదశలో హిమాలయన్‌ కాంపోనెంట్‌ నుంచి తరలించే నీటినే గోదావరి–కావేరీ అనుసంధానంలో భాగంగా తరలించడం జరుగుతుంది. తొలిదశలో కేవలం మధ్యంతర ఏర్పాట్లలో బాగంగానే నీటిని తరలిస్తున్నాం.

తెలంగాణకు ఈ ప్రాజెక్టుతో అదనంగా నీటిని వినియోగించుకోవడానికి అవకాశం కలగనుంది. కేటాయించిన కోటా నుంచే 10 టీఎంసీల జలాలను కడప– కర్నూలు హైలెవల్‌/లో లెవల్‌) కెనాల్‌ కు ఏపీ తరలిస్తుందని తుంగభద్ర బోర్డు సమాచారం ఇచ్చింది. గోదావరి/కృష్ణా పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్‌ ప్రకారం ఆయా ప్రాజెక్టులు బోర్డులకు ఇంకా అప్పగించలేదని బోర్డులు సమాచారం ఇచ్చాయి. ఇక రెండో, మూడో దశ టెలిమెట్రీల ఏర్పాటుపై రానున్న బోర్డు సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి ఆదేశాలు ఇచ్చాం.  

ఆ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ ఇవ్వలేదు.. 
2006–31 సంవత్సరాలకు గాను ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన కింద ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి, మక్తల్‌– నారాయణపేట – కొడంగల్‌ ఎత్తిపోతల పథకం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సహాయం అందించాలని లేఖ రాశారు. ఈ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఇప్పటిదాకా ఎటువంటి క్లియరెన్స్‌ ఇవ్వలేదు. ఇక సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు, ముక్తేశ్వర్‌ (చిన్న కాళేశ్వరం), మొడికుంటవాగు, చనాకా కొరాటా డి్రస్టిబ్యూటరీలకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ ఉంది. వీటిపై మరిన్ని వివరాల కోసం ప్రాజెక్టు అథారిటీ (సంబంధిత ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌)లకు పంపించాం. 

Advertisement
 
Advertisement
Advertisement