ప్రాజెక్టుల పనుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోం
నెల రోజుల్లోగా కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణకు డిజైన్లు
సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ ఆదేశం
సాక్షి,హైదరాబాద్: సాగు నీటి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు సాధించడానికి అన్ని రకాల ప్రయత్నా లు చేయాలని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన భారీ ప్రాజెక్టులపై చేసిన వ్యయం నిరర్థకంగా మారితే ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుందనే కారణంతో, తర్వాతి దశలో పర్యావరణ అనుమతులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు ఇటీవల సడలింపులు ఇచ్చిందని గుర్తు చేశారు.
అయినా, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అనుమతుల జారీ విషయంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీఎంతో చర్చించాక ప్రధాన మంత్రి కార్యాలయం దృష్టికి సైతం తీసుకెళ్తామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల పనులపై బుధవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) అంజాద్ హుస్సేన్, సీఈలు, ఈఈలతో సమీక్షించారు.
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలే..
నిర్మాణంలోని/కొత్త సాగునీటి ప్రాజెక్టుల పనులను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో వేగిరం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించబోమని హెచ్చరించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ నిర్మాణ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి పనుల నిర్వహణ, పర్యవేక్షణకు నీటిపారుదల శాఖలో ప్రత్యేక విభాగం (డివిజన్) ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.
సొరంగం లోపల రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. తుమ్మిడిహెట్టి బరాజ్ సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీకి అవసరమైన సర్వేలు, పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయన్నారు. బరాజ్‌కు సంబంధించిన 73 చ.కి.మీ.ల నిర్మిత ప్రాంతంతోపాటు 85 కి.మీ.ల పొడవైన కాల్వ నిర్మాణానికి సంబంధించిన టోపాలజీ సర్వే పూర్తయిందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాధాన్యత ప్రాజెక్టుల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షించాలని రాహుల్ బొజ్జాను ఆదేశించారు.
నెలలో మేడిగడ్డ రిపేర్‌కు డిజైన్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌ల పునరు ద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్లను నెల రోజుల్లోగా సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. పుణేలోని సెంట్రల్ పవర్ అండర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లను తనిఖీ చేసి నివేదిక సమర్పించిందని మంత్రి తెలిపారు.
సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యుల బృందం బుధవారం నుంచి మేడిగడ్డ బరాజ్‌కు తదుపరి పరీక్షలను ప్రారంభించగా, మరో ఇద్దరు సభ్యుల బృందం సమాంతరంగా బోర్‌హోల్ పరీక్షలు జరుపుతోందన్నారు. ఈ నెల 22 నుంచి అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల టెస్టింగ్ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. జలాశయాల్లో పూడిక తొలగింపు కోసం సత్వరంగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆయా ప్రాజెక్టుల ఈఈలకు మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.


