అగ్రి రొబోటిక్స్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, వీసీ జానయ్య తదితరులు
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి రొబోటిక్స్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో వీసీ అల్దాస్ జానయ్య
అగ్రి వర్సిటీల్లో ఈ తరహా ల్యాబ్ ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2030-35 నాటికి రైతుల పొలాల్లో రోబోలు, డ్రోన్లు, మానవరహిత ట్రాక్టర్లు, సెన్సర్ల వినియోగం విస్తృతం కానుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అన్నారు. అందుకు అవసరమైన పరిశోధనలు వర్సిటీల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. మానవరహిత వ్యవసాయ సాధన దిశగా తమ వర్సిటీ కీలక ముందడుగు వేసిందన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన తొలిదశ అగ్రి రొబోటిక్స్ ప్రయోగశాలను ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్టితో కలిసి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య శుక్రవారం ప్రారంభించారు. దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అత్యాధునిక అగ్రి రొబోటిక్స్ ల్యాబ్ ఏర్పాటవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులుశెట్టి మాట్లాడుతూ వర్సిటీ పూర్వ విద్యార్థిగా ఇలాంటి ఆధునిక ప్రయోగశాల ప్రారంభంలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. సుమారు ఏడాది క్రితం ప్రయోగశాల ప్రతిపాదనను వీసీ అల్దాస్ జానయ్య, నాటి డీన్ జెల్లా సత్యనారాయణ తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఏడాదిలోనే ప్రయోగశాల ప్రతిపాదన కార్యరూపం దాల్చి తొలిదశ ల్యాబ్ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లు, రోబోలు భవిష్యత్తులో వ్యవసాయ రంగం వైపు యువతను ఆకర్షించడంలో కీలకంగా మారతాయని శ్రీనివాసులుశెట్టి అభిప్రాయపడ్డారు.
వికసిత్, రైజింగ్ లక్ష్యాల సాధనలో..
ఉపకులపతి అల్దాస్ జానయ్య మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్, తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనలో వ్యవసాయ, గ్రామీణ రంగాలు కీలకపాత్ర పోషించనున్నాయని తెలిపారు. భవిష్యత్తు వ్యవసాయం ఏఐ ఆధారిత పరిజ్ఞానంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఆ దిశగా మానవరహిత వ్యవసాయ సాధనలో భాగంగా అగ్రి రొబోటిక్స్ ల్యాబ్‌ను ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో అగ్రిహబ్ ఎండీ డాక్టర్ జి. వెంకటేశ్వర్లు, అగ్రి రొబోటిక్స్ ల్యాబ్ ప్రాజెక్టు హెడ్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ, వర్సిటీ అధికారులు, ఎస్‌బీఐ సీనియర్ అధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


