
కుటుంబసభ్యులు, స్నేహితుల ఎదురుచూపు
ఆయుధం అప్పగించిన మావోయిస్ట్ నేత
రాజ్యాంగ ప్రతి స్వీకరించిన మల్లోజుల
సీఎం ఫడ్నవిస్ సమక్షంలో లొంగిపోయిన వేణుగోపాల్‌రావు
ముగిసిన 44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం
తదుపరి అడుగులపై సర్వత్రా ఆసక్తి
‘అన్నా.. మా చిన్నప్పుడు ఊరొదిలి అడవిబాట పట్టినవ్.. పీడిత, తాడితుల కోసం అరణ్యంలో ఉంటూ సమాంతర సర్కార్ నడిపించినవ్.. మారుతున్న పరిస్థితుల్లో బుల్లెట్‌తో కాదు బ్యాలెట్‌తోనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని గుర్తించినవ్.. ఆయుధం వీడి, రాజ్యాంగాన్ని చేతబట్టుకొని జనజీవన స్రవంతిలో కలిసినవ్.. పేపర్లు, టీవీల్లో నీగురించి వినడం తప్ప నేరుగా జూసిందేలేదు.. పెద్దపల్లి పెద్దవ్వ మధురమ్మ నా కొడుకును ఒక్కసారి జూసి కన్నుయూలని తండ్లాడింది.. ఆశ నెరవేరకుండానే కన్నుమూసింది.. నాన్న, అన్న, అమ్మ అంత్యక్రియలకూ రాకపోతివి.. ఇప్పుడైనా వచ్చిపోరాదే.. నిన్ను జూసి ఒక్కసారి చిన్ననాటి ముచ్చట్లు పంచుకోవాలని ఉంది.. జెర గిప్పుడైనా గిటొచ్చి పోరాదే’ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావుతో అనుబంధం ఉన్నవారు అంటున్నారు.

సాక్షి పెద్దపల్లి ●: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు ఉరఫ్ అభయ్, సోను, భూపతి, వివేక్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆయుధలను అప్పగించి, రాజ్యాంగాన్ని చేతబూనారు. 44 ఏళ్లఉద్యమ ప్రస్థానం ముగించి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వేణుగోపాల్‌రావు తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది.
తండ్రి స్ఫూర్తి.. సోదరుడి పిలుపు..
పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య–మధురమ్మకు మూడోసంతానం వేణుగోపాల్‌రావు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తామ్రపత్రం అందుకున్న తండ్రి నుంచి పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న అభయ్.. సోదరుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు ఉరఫ్ కిషన్‌జీ పిలుపుతో 1981లో అడవిబాట పట్టారు. 2010లో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ ఉరఫ్ ఆజాద్ మృతి తర్వాత ఆయన స్థానంలో నియమితులయ్యారు. 2010లో గడ్చిరోలిలో 76 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్ల ఊచకోతలో మాస్టర్ మైండ్‌గా పనిచేశారు. సీస్‌ఫైర్(కాల్పుల విరమణ)కు అనుకూలంగా లేఖరాసి మావోయిస్ట్ పార్టీలైన్ దాటారు. దీంతో విప్లవ ద్రోహిగా పార్టీ ప్రకటించింది. ఇప్పుడు ఆయన లొంగిపోవడంతో 44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. వేణుగోపాల్‌రావు భార్య తారక్క 10 మంది మావోయిస్టులతో ఈ ఏడాది జనవరి ఒకటిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో లొంగిపోయారు. ఇప్పుడు ఆయన కూడా 60 మందితో నక్సల్స్‌తో అదే సీఎం వద్ద లొంగిపోవడం గమనార్హం.
మిగిలింది 9మందే..
మావోయిస్ట్ పార్టీ అగ్రనేత లొంగిపోవడంతో మిగిలినవారి అడుగులపైనా చర్చ జరుగుతోంది. మంథని మండలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన మల్లా రాజిరెడ్డి ఉరఫ్ సంగ్రాం(సీసీఎం), రామగుండం ప్రాంతానికి చెందిన అప్పాసి నారాయణ ఉరఫ్ ర మేశ్(డీసీఎం), సబ్బితానికి చెందిన గంగిడి సత్యనా రాయణరెడ్డి ఉరఫ్ విజయ్(ఎస్‌సీఎం), పాలితానికి చెందిన అలేటి రామలచ్చులు ఉరఫ్ రాయలచ్చులు(డీసీఎస్), దాతు ఐలయ్య(ఏసీఎస్), జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాదరావు ఉరఫ్ చంద్రన్న, సోమన్న(సీసీఎం) అదే గ్రామానికి చెందిన దీకొండ శంకరయ్య ఉరఫ్ శేషన్న(ఏసీఏస్), కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి ఉరఫ్ వెంకటేశ్(ఎస్‌సీఎం), సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన వెంకటేశ్వర్‌రావు ఉరఫ్ ధర్మన్న(ఎసీఎం) మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతుండటంతో వీరి తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది.