వార్డుమెంబరే ఆ ఊరి ‘చివరి సర్పంచ్‌’? | station ghanpur municipality sarpanch election | Sakshi
Sakshi News home page

వార్డుమెంబరే ఆ ఊరి ‘చివరి సర్పంచ్‌’?

Nov 30 2025 12:41 PM | Updated on Nov 30 2025 1:03 PM

station ghanpur municipality sarpanch election

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రస్తుత స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని గత శివునిపల్లికి వార్డుమెంబరే చివరి సర్పంచ్‌. ఇదేంటి వార్డుమెంబర్‌ సర్పంచ్‌ కావడమేంటి? చివరి సర్పంచ్‌ ఏమిటి? అనే సందేహాలు రావొచ్చు. అసలు ఏం జరిగిందంటే.. 2019 జనవరిలో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో శివునిపల్లి ఎస్టీ రిజర్వ్‌ అయ్యింది. అంతకుముందూ ఎస్టీ రిజర్వేషనే. దీంతో గ్రామ జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఎన్నికలకు బహిష్కరించడంతో ఎవరూ సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేయలేదు. గ్రామంలో ఎన్నికలు జరగలేదు. దీంతో ఎన్నికల అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తిరిగి 2019 ఫిబ్రవరిలో ఎస్టీ రిజర్వేషన్‌తోనే ఎన్నికలు నిర్వహణకు సన్నద్ధమయ్యారు. 

జేఏసీ నాయకులు మరోసారి ఎన్నికలను బహిష్కరించాలని పిలు పునివ్వడంతో ఒక్కరూ కూడా ముందుకురాలేదు. సర్పంచ్‌కు ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో గ్రామానికి చెందిన బూర్ల విష్ణు 8వ వా ర్డు నుంచి నామినేషన్‌ వేశారు. చేసేదేంలేక జేఏసీ నాయకులు అదే వార్డులో జేఏసీ నుంచి మరొకరిని బరిలో ఉంచగా విష్ణు గెలుపొందారు. 2019 నుంచి 2024 వరకు వార్డు సభ్యుడిగా ఉన్న విష్ణు హైకోర్టును ఆశ్రయించి.. తాను ఒక్కడే గ్రామంలో ప్రజాప్రతినిధిగా ఉన్నానని, తనను సర్పంచ్‌గా ప్రకటించాలని కోరారు. 

కోర్టు ఆదేశాలతో చివరి 54 రోజులు విష్ణు సర్పంచ్‌గా విధులు నిర్వహించారు. జేఏసీ నాయకులు తిరస్కరించినా ఆయన చివరి 54 రోజులు సర్పంచ్‌గా పనిచేశారు. ఇదిలా ఉండగా 2025 ఎన్నికల్లోనైనా రిజర్వేషన్‌ తప్పక మారుతుందని, ఎలాగైనా సర్పంచ్‌ పదవికి పోటీ చే యాలని చాలా మంది ఎదురుచూశారు. తీరా ఏడా ది క్రితం స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీగా కావడం, అందులో శివునిపల్లి, ఛాగల్లు గ్రామాలను కలుపడంతో అందరి ఆశలు అడియాశలయ్యాయి.

చివరి సర్పంచ్‌గా పనిచేయడం సంతోషంగా ఉంది
గ్రామ జేఏసీ నాయకులను కాదని ఎన్నికల నిబంధనల మేరకు అధికారుల సహకారంతో ధైర్యంగా వార్డు స్థానానికి పోటీ చేసి  గెలుపొందా. హైకోర్టును ఆశ్రయించి చివరి 54 రోజులు సర్పంచ్‌గా పనిచేశా. వార్డు సభ్యుడిగా, సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి కృషి చేశా. ప్రస్తుతం శివునిపల్లి.. ఘన్‌పూర్‌ మున్సిపాలిటీలో విలీనం కావడంతో గ్రామ చివరి సర్పంచ్‌ నేనే కావడం సంతోషంగా ఉంది. 
–బూర్ల విష్ణు, మాజీ సర్పంచ్,శివునిపల్లి

 

Advertisement
 
Advertisement
Advertisement