
అభిప్రాయం
ఒక సమస్య పట్ల తీవ్రమైన వైఖరిని తీసుకుని, అందుకు పరిష్కారం అని చెప్పే దానిలో కనిపించే కొద్దిపాటి మంచిని కూడా తిరస్కరించటం ఒక ధోరణి. జరిగిన మంచిని ఒక ముందడుగుగా భావించి మరింత ముందుకు పోజూడటం మరొక ధోరణి. వీటిలో ఏ సమస్య పట్ల ఏ ధోరణి తీసుకోవాలనేది అందుకు సంబంధించిన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
రెండేళ్ళుగా సాగుతున్న గాజా యుద్ధానికి శాంతియుత పరిష్కారం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 9న వైట్‌హౌస్‌లో ప్రకటించిన 20 అంశాల ప్రణాళికపై 13వ తేదీన ఈజిప్టులోని షర్మ్ అల్‌షేక్ పట్టణంలో తనతోపాటు, ఈజిప్ట్, ఖతార్, తుర్కియే ప్రభుత్వాధినేతలు సంతకాలు చేసి ఆమోదించారు. ఆ ముగ్గురూ హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలకు మధ్య వర్తిత్వం వహించినవారు. దశలు దశలుగా అమలుకు రాగలదనే ఆ 20 అంశాల ప్రణాళికలో మొదటి దశ ఈ 9–13 తేదీల మధ్య అమలు జరిగింది కూడా! అందులో భాగంగా ఉభయ పక్షాలు కాల్పులను విరమించాయి.బందీలను, ఖైదీలను విడుదల చేసుకున్నాయి.
మూల సమస్య విస్మరణ
హమాస్, ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించినట్లు, ట్రంప్ చొరవ, బలిమి లేనిదే ఇది ఎంత మాత్రం జరిగేది కాదు. హమాస్ ఎన్ని త్యాగాలతో ఎంత పట్టుదలగా పోరాడినా, స్వయంగా అరబ్ దేశాలే ద్వంద్వ వైఖరిని చూపుతున్న స్థితిలో ఇజ్రాయెల్‌ను ఓడించటం సాధ్యమయ్యేది కాదు. ఇజ్రాయెల్ ఒకవేళ హమాస్ సహా గాజా ప్రజలందరినీ తుడిచిపెట్టినా పాలస్తీనా జాతి,స్వదేశ ఆకాంక్షల సమస్య పరిష్కారమయ్యేది కాదు. అయినప్పటికీ ఆ విధంగా తుడిచి పెడతాము, గ్రేటర్ ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేస్తాము తప్ప, స్వతంత్ర పాలస్తీనా ప్రసక్తి ససేమిరా లేదన్నది నెతన్యాహూ వైఖరి. అందువల్ల, మొదటి నుంచి ఎన్ని ఊగిసలాటలాడినా చివరకు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ప్రకటించి, దాని అమలు పర్యవేక్షణకు కూడా సిద్ధపడిన నాయకుడు ట్రంప్.
ఇవీ మనకు కనిపిస్తున్న వాస్త వాలు. లేదా వాస్తవాలలో కొన్ని. తక్కిన వాస్తవాలేమిటో చూద్దాము. అన్నింటికన్నా ప్రధానమైనది, దశా బ్దాల ఘర్షణలకు మూలకారణమైన స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు. దాని గురించి ట్రంప్ 20 అంశాలలో గల ప్రస్తావన అత్యంత అస్పష్టమైన రీతిలో, ఎటువంటి కాలవ్యవధి లేకుండా, చిట్టచివరన వస్తుంది. షర్మ్ అల్‌షేక్ సమావేశం తర్వాత విడుదల అయిన సంయుక్త ప్రకటనలోనూ పాలస్తీనా దేశం ప్రస్తావన లేదు.
ఇజ్రాయెలీలకు, పాలస్తీనియన్లకు సమాన హక్కులు అవసరమని, గాజా సమస్య మొత్తం పాలస్తీనా సమస్యలో భాగమని మొక్కుబడిగా అనటం మినహా వారికి స్వయం నిర్ణయాధికారం ఉందని ఎక్కడా పేర్కొనలేదు. ఇటీవలనే పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్ దేశపు విద్యా మంత్రి బ్రిడ్జెట్ ఫిలిప్స్, రెండు స్వతంత్ర దేశాలు అవసరమన్నారు. ఆ తర్వాత జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఆ మాట అన్నారు. కానీ, ఆ మాట ట్రంప్‌తో అనిపించటం గానీ, సంయుక్త ప్రకటనలో చేర్చటం గానీ, ఆ మేరకు 20 అంశాల ప్రణాళికలో మార్పులు జరిపించటం గానీ చేయలేకపోయారు.
ఇంకా అపనమ్మకమే...
ఈ అస్పష్టమైన, అయోమయమైన పరిస్థితుల మధ్య ఏవైనా ఆశారేఖలున్నాయా? మళ్ళీ ట్రంప్‌ను చూద్దాము. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించటంలో ప్రపంచాభిప్రాయపు ఒత్తిడి కూడా పనిచేసిందని ఒక మాట అన్నారాయన. ఇజ్రాయెల్ సేనలు ‘చంపు, చంపు, చంపు’ అన్నట్లుగా వ్యవహరించాయని వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో మీడియాతో, గాజా యుద్ధం ఇక శాశ్వతంగా ముగిసిందని ప్రకటించారు. తాము బందీలను విడుదల చేసిన తర్వాత ఇజ్రాయెల్ తమపై తిరిగి దాడులు జరపవచ్చునని హమాస్ సందేహించగా, అటువంటిది జరగబోదని వారికి మధ్యవర్తుల ద్వారా హామీ ఇచ్చారు. హమాస్ నిరాయుధీకరణ షరతును సడలించి, వారు గాజాలో అంతర్గత శాంతిభద్రతలను నిర్వహించవచ్చునని అంగీకరించారు.
వీటన్నింటి క్రమంలో నెతన్యాహూ ఎక్కడికక్కడ మొండితనంతో వ్యవహరించగా కఠినంగా మాట్లాడి దారికి తెచ్చారు. ఇటువంటివన్నీ పరిగణించినప్పుడు ఏమని భావించాలి? 3 వేల సంవత్సరాల సమస్య ఒక కొలిక్కి వచ్చిందని, మొత్తం పశ్చిమాసియాకే నవోదయం కలిగిందని, ఇది ఇక శాశ్వతమని అంటున్న ట్రంప్ మాటలు, తనకు సాధారణంగా మారిపోయిన అతిశయోక్తి ప్రాగల్భ్యమా? లేక, పాలస్తీనా ఏర్పాటు ఇక ఆపలేదనిదని గుర్తించి ఆ దిశగా తెర వెనుక నర్మగర్భమైన దౌత్యనీతిని నడుపుతుండటమా? అందువల్ల, మొదటి దశ అమలు వరకు ట్రంప్‌ను అభినందిస్తూనే, ఆయన ప్రకటించినట్లు ఇది శాశ్వత నవోదయం అనదగ్గ సంపూర్ణ సూర్యోదయం అనే నమ్మకం మాత్రం ఇంకా కలగటం లేదనాలి.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు