
సందర్భం
గాజా కాల్పుల విరమణ అంగీకారం అక్టోబర్ 10 నుంచి అమలులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) పాలస్తీనియన్లను ఊచకోత కోయడం ఆగింది. ట్రంప్ కుదిర్చిన ఈ కాల్పుల విరమణను ఒక అత్యవసర కారణం రీత్యా స్వాగతించవలసి ఉంది. కొడిగడుతున్న మానవతా దీపానికి రెండు చేతులు అడ్డుపెట్టేందుకు ఈ సంధిని సమర్థించవలసి ఉంది.
పాలస్తీనా పౌరులపై రెండేళ్ళుగా మోతాదుకు మించి సాగుతున్న దాడుల్లో 67,000 మందికి పైగా పాలస్తీనియన్లు హతులయ్యారు. పౌరులు, సైనికులతో కలిపి సుమారు 2,000 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 55 లక్షల పాలస్తీనియన్లలో సుమారు ఇరవై లక్షల మంది నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్య సమితి, మానవతా సంస్థలు, స్థానిక అధికారుల అంచనా.
మానవ కల్పిత మహా విపత్తు
గాజా శిథిలాల కుప్పగా మారింది. కరవు కాటకాలతో జనం సతమతమవుతున్నారు. ఇతర ప్రాంతాలకు పారిపోయిన పాలస్తీనియన్లు కాల్పుల విరమణ అమలులోకి రావడంతో గాజా నగరానికి, షేక్ రద్వాన్ వంటి ప్రాంతాలకు తిరిగి వస్తున్నారు. నుసేరత్, ఖాన్ యూనిస్ వంటి దక్షిణ ప్రాంత శిబిరాల నుంచి మిగిలిన అరకొర సామాను వేసుకుని అల్ రషీద్ వంటి ఉత్తర ప్రాంతాలకు నడక సాగిస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను ‘మానవ కల్పిత మహా విపత్తు’గా ఐరాస అభివర్ణించింది. ఇపుడు గాజాలోకి రోజూ 600 సహాయ సామగ్రి ట్రక్కులు వస్తున్నాయి కనుక, ఈ కాల్పుల విరమణ ఫలితంగా కరవు తీవ్రత కొద్దిగా తగ్గవచ్చు. సహాయ సామగ్రి రాక పెరగడం, రఫా, ఇతర కూడలి మార్గాలను తిరిగి తెరవడం వల్ల, గాజాలో మిగిలినవారి కష్టాలకు తాత్కాలికంగానైనా ఉపశమనం లభించవచ్చు.
అయితే, వాస్తవ పరిస్థితులు ఇప్పటికీ గుబులు రేకెత్తించేవిగానే ఉన్నాయి. సుస్థిర శాంతితో పాటు, సామాజిక–రాజకీయ న్యాయం పాలస్తీనియన్లకు అందని మావి పండుగానే మిగిలిపోవచ్చు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఒక రకంగా బలవంతంగానే ఈ కాల్పుల విరమ ణకు ఒప్పించారు. ట్రంప్, ఇతర ప్రాంతీయ భాగస్వాములు (ఈజిప్టు, ఖతార్, సౌదీ అరే బియా) ఊహిస్తున్నంత సుందర స్వప్నం సాకారం కాకపోవచ్చు. అయినప్పటికీ, పెడ మొహంతో ఉన్న నెతన్యాహూను బలవంతం గానైనా చర్చలకు కూర్చోబెట్టినందుకు ట్రంప్‌ను ఎంతో కొంత అభినందించాల్సిందే.
పునర్నిర్మాణం ఎలా?
శిథిలాలను తొలగించి, గాజాను పున ర్నిర్మించే పనికి శ్రీకారం చుట్టడం తక్షణ ప్రాధాన్యం కావాలి. యుద్ధానంతరం గాజా పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం వచ్చే పదేళ్ళలో 53.2 బిలియన్ డాలర్ల మేరకు ఉండవచ్చని అధికారిక అంచనాలు వెల్లడి స్తున్నాయి. ఐరాసకు చెందిన నష్టాలు – అవస రాల తాత్కాలిక సత్వర మదింపు సంస్థ, యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంక్ కలసి ఆ రకమైన లెక్కకు వచ్చాయి. అవి 2023 అక్టోబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు వాటిల్లిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆ అంచనాకు వచ్చాయి. పాలస్తీనాకు అంత పెద్ద మొత్తాలను ఎలా అందుబాటులోకి తెస్తారో ఈ దశలోనే చెప్పడం కష్టం.
ఐరాస పరిధికి బయట ఈ ఒడంబడిక కుదరడంతో, ఇది ఎంతవరకు ముందు సాగుతుందనే సందేహాలు రేకెత్తుతున్నాయి. దీన్ని బలమైన ప్రాంతీయ పక్షాల మద్దతుతో అమెరికా నేతృత్వాన సాగిన చొరవగానే చూస్తున్నారు. గాజాకు బయటనున్న స్థావరాల నుంచి హమాస్ ఏ విధంగా నియమాలను పాటిస్తుందో పర్యవేక్షించే ఒక బహుళ దేశీయ సైనిక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిలో అమెరికా దళాలు కూడా 200 వరకు ఉంటాయి. తాత్కాలిక టెక్నికల్ పాలనా బృందానికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నాయకుడిగా ఉంటారు. ఇది ట్రంప్ శైలిలో నయా సామ్రాజ్యవాద పోకడను సూచిస్తోంది.
ఈ ఒప్పందానికి భారత్ కూడా మద్దతు తెలిపింది. మొదటి దశకు శుభారంభం చేసినందుకు నెతన్యాహును ప్రధాని మోదీ ప్రశంసించారు. సంక్లిష్టమైన శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో పాల్గొన్న అనుభవం భారతదేశానికి ఉంది. కొరియా యుద్ధ విరమణ (1953) నుంచి తదుపరి ఐరాస ప్రత్యేక విధుల్లో భారత్ పాలుపంచుకుంది. విపత్తుల సహాయ కార్యక్రమాల్లో భారత్ తన సమర్ధతను విజయవంతంగా నిరూపించుకుంది. కనుక,గాజాకు ఇపుడు ఎంతో అవసరమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ పనులకు భారత్ చేదోడువాదోడు కాగలదు.
కాల్పుల విరమణ ఒడంబడిక తాత్కాలికమైనది, విఘాతాలకు లోనుకాగల అవకాశం ఉన్నది. ఇది 2023 అక్టోబర్‌లో యుద్ధం మొదలైన తర్వాత సంధి కుదర్చడానికి సాగుతున్న మూడవ పెద్ద ప్రయత్నం. రెండు ప్రయత్నాలు గతంలో విఫలమయ్యాయి. ఈసారైనా సత్ఫలితాలు ఇస్తుందా? నిజానికి, ఐరాస ఆధ్వర్యంలోకి ఈ సంక్లిష్ట ఒప్పందాన్ని తీసుకురావడం వాంఛనీయం. కానీ, అటువంటి పరిణామానికి ఉన్న అవకాశం చాలా తక్కువ.
సి. ఉదయ్ భాస్కర్
వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్