
అభిప్రాయం
మధ్యభారత అరణ్యాలలో ఆదివాసుల మీద, ఆదివాసుల జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ పోరాటానికి మద్దతు ఇస్తున్న మావోయిస్టుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి గట్టడం, ఆ ప్రాంతంలోని అపారమైన, సంపన్నమైన ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహంలో భాగమే అని దాదాపు ఇరవై సంవత్సరాలుగా పరిశీలకులు, విమర్శకులు ఎందరో రాస్తున్నారు.
సల్వా జుడుం పేరుతో 2005లో పాలకులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన ఆదివాసుల మధ్య అంతర్యుద్ధం నుంచి, ఇప్పుడు 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్‌గఢ్ తయారు చేస్తామని ముహూర్తం నిర్ణయించి మరీ సాగిస్తున్న ఆపరేషన్ కగార్ దాకా మధ్య భారత అరణ్యాలలో చాలా నెత్తురు ప్రవహించింది. చివరి యుద్ధం అని చెప్పుకొంటున్న ప్రస్తుత దశ మొదలైన 2024 జనవరి 1 నుంచి గడచిన పద హారు నెలల్లో 400 మందికి పైగా ఆదివాసులను, మావోయిస్టులను భద్రతా బలగాలు చంపివేశాయి.
ఖనిజ వనరుల కోసమే!
ఈ మారణకాండ అంతా ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేసి, స్వస్థలాల నుంచి వారిని నిర్వాసితులను చేసి, వారి కాళ్లకింది నేలలో నిక్షిప్తమైన సంపన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడానికే అని విమర్శకులు చేస్తున్న అభియోగం నిజమేనని చూపే పరిణామాలు జరుగు తున్నాయి.
కార్పొరేట్ సంస్థల రక్షణ కోసం లెక్కలేనన్ని భద్రతా బలగాల క్యాంపులు నిర్మాణమవుతున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర్ సీమా బల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి సరిహద్దులను రక్షించవలసిన బలగాలు ఇప్పుడు మధ్య భారతంలో ఉన్నాయి. ఆ బలగాలను తీసుకుపోవడానికీ, తవ్విన ఖనిజాన్ని బైటికి తీసుకురావడానికీ నాలుగు లైన్ల, ఆరు లైన్ల రహదారుల నిర్మాణం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేగంగా జరిగిపోతున్నది.
ఈ ‘అభివృద్ధి’ కార్యక్ర మానికి అడ్డు వస్తారనే అనుమానం ఉన్నవాళ్ల మీదికి డ్రోన్లతో నిఘా, వైమానిక బాంబు దాడులు, వేలాది కాల్బలాలతో జల్లెడ పట్టి, చుట్టుముట్టి, ఎటువంటి ప్రతిఘటన లేకపోయినా కాల్చి చంపి ఎదురుకాల్పుల కథనాలు విడుదల చేయడం జరుగు తున్నది.
ఆ వరుసలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అత్యుత్తమ స్థాయి ఇనుప ఖనిజం (హెమటైట్) గనులను వేలం వేయడానికి శరవేగంతో ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖనిజ వనరుల శాఖ 2025 జనవరి 15న సరిగ్గా ఈ హత్యాకాండల వార్తలు వస్తున్న దంతెవాడ, కాంకేర్ జిల్లాలలోని ఇనుప ఖనిజం గనుల బ్లాకులు నాలుగింటిని వేలం వేసే ప్రక్రియ ప్రారంభించింది. వీటిలో బైలదిల్లా గనులుగా ప్రఖ్యాతమైన ఖనిజ వనరుల కొండలు దంతెవాడ జిల్లా కిరండుల్ నుంచి బీజాపూర్ జిల్లా గంగలూరు దాకా వ్యాపించి ఉన్నాయి.
బైలదిల్లా డిపాజిట్ 1ఎ, 1బి, 1సి, కాంకేర్ జిల్లాలోని హాహాలొద్ది అనే ఈ నాలుగు బ్లాకుల వేలం ప్రక్రియ ఫిబ్రవరి 28 దాకా సాగి, 58 ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడ్డాయి. చివరికి మూడు గనులను ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా, ఒక గనిని రూంగ్టా స్టీల్ దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా ప్రభుత్వ వేలంపాటలో ప్రతిపాదించిన కనీస ధర కన్నా 154 శాతం, 160 శాతం ఎక్కువకు పాడు కున్నాయంటే, అక్కడ వారికి ఎంత లాభం చేకూరే అవకాశం ఉందో ఊహించవచ్చు. ఈ గనుల లీజు యాభై సంవత్సరాల పాటు ఉంటుంది గనుక ఇది రేపో మాపో వట్టిపోయే ఆవు కూడా కాదు, కామధేనువు!
ఇప్పటివరకూ బైలదిల్లా గనుల్లోకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) తప్ప ప్రైవేటు కంపెనీలు ప్రవేశించలేదు. ఇప్పటివరకూ ఆర్సెలార్ మిత్తల్ తనకు అవసరమైన ఖనిజాన్ని ఎన్‌ఎండీసీ నుంచి తీసుకుని పైప్ లైన్ ద్వారా విశాఖపట్నం పంపుతుండేది. ఇప్పుడీ వేలంతో ఆ కంపెనీకి సొంత గనులు వచ్చాయి.
వీటిలో బైలదిల్లా 1ఎ, 1బి ఒక్కొక్కటీ 2,100 ఎకరాలు, 1సి 1,976 ఎకరాలు, హాహాలొద్ది 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ నాలుగు బ్లాకులతోనే దట్టమైన దండకారణ్యంలో దాదాపు ఏడు వేల ఎకరాల అడవి నేలమట్టమైపోయి ‘అభివృద్ధి’ జరగబోతున్నది. ఈ నాలుగు బ్లాకులూ కలిసి దాదాపు ముపై్ఫ కోట్ల టన్నుల ఉత్తమశ్రేణి ఖనిజం తవ్వబోతున్నారు.
ఇటువంటి లెక్కలలో తాము కాగితాల మీద పొందినదానికన్న ఎక్కువ విస్తీర్ణపు గనులు తవ్వి, మరింత ఎక్కువ ఖనిజాన్ని దోచుకుపోవడం అందరికీ తెలిసిందే. వేలం ప్రక్రియలో చెప్పిన మేరకే తవ్వుతారని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే ఈ నాలుగు గనుల ఖనిజం విలువ ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు. కాగా, ప్రభుత్వానికి దక్కే ఆదాయం ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే!
ఈ రాష్ట్రంలో ఇంతకుముందే ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ ఛత్తీస్‌గఢ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సీఎండీసీ)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పరచి, గనులకు పర్యావరణ అనుమతులు సంపాదించి, ఆ గనులను తవ్వకం, ఖనిజాభివృద్ధి కార్యకలాపాలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు ఇచ్చింది. ఖనిజ సంపన్నమైన ఈ రాష్ట్రంలో ఇప్పటికే అంబుజా, బిర్లా, ఎస్సార్, జిందాల్, జె కె లక్ష్మి, లఫార్జ్, ఎల్ అండ్ టి, వేదాంత వంటి కార్పొరేట్ దిగ్గజాలన్నీ ఉన్నాయి.
ఇది పలు రకాల సమస్య
ఇది ఆదివాసులకో, మావోయిస్టులకో సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది ముహూర్తాలు నిర్ణయించి మనుషులను చంపవచ్చునా అనే మానవతా సమస్య, నాగరికతా సమస్య. పర్యావరణ సమస్య, దేశ సంపద ఎవరికి చెందాలనే సమస్య, అటవీ హక్కుల చట్టం, పంచాయత్ రాజ్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం వంటి చట్టాల ఉల్లంఘన సమస్య. రాజ్యాంగ ఆదర్శాలు, ప్రజల హక్కులు అమలవుతున్నాయా అనే సమస్య. మనందరి సమస్య!
ఎన్. వేణుగోపాల్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్