విశ్లేషణ
దగ్గు మందు సేవించిన పిల్లలు వరుసగా మృత్యువాతపడటం ఇటీవల కలకలం సృష్టించింది. ఔషధాల నియంత్రణ వ్యవస్థ పనితీరు దేశంలో అధ్వానంగా ఉన్న స్థితిని ఇది మరోసారి కళ్ళకు కట్టింది. కల్తీ మందులు సేవించి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఇటీవలి సంవత్స రాలలో దేశ, విదేశాలలో చోటుచేసు కున్నాయి. అవి మన దేశంలో తయారైనవి కావడంతో తీరని తలవంపులు తెచ్చి పెట్టాయి.
ఇలాంటి విషాదకర ఘటనలు వెలుగు చూసిన ప్రతిసారీ మన స్పందన ఒకే విధంగా ఉంటుంది. యథావిధిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దర్యాప్తునకు ఆదేశిస్తాయి. చెదురు మదురుగా కొన్ని మందుల పరిశ్రమలలో సోదాలు నిర్వహిస్తారు. నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేటట్లు చూడాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు వెళతాయి. అనతి కాలంలోనే ‘పరిస్థితులు’ మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారవుతాయి.
సడలింపులతో సమస్యలు
డైఇథిలీన్ గ్లైకాల్(డి.ఇ.జి.), ఇథిలీన్ గ్లైకాల్ వల్ల కల్తీ అయిన దగ్గు మందులను సేవించినవారికి పొత్తి కడుపులో నొప్పి,వాంతులు, అతిసారం, మూత్రం పోయలేకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు మొదలవుతాయి. కొన్ని కేసుల్లో మూత్ర పిండాలకు తీవ్ర గాయమై, అది మరణానికి కూడా దారితీయవచ్చు. భారత దేశంలో తయారైన ఔషధాల వల్ల జాంబియా, ఉజ్బెకిస్తాన్, కామె రాన్, ఇరాక్ తదితర దేశాలలో డజన్ల కొద్దీ పిల్లలు మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో అప్రమత్తమైంది. ఔషధాల తయా రీకి ఉపయోగించే ముందు ముడి పదార్థాలలో డి.ఇ.జి. ఉందేమో పరీక్షించవలసిందని ఆ సంస్థ జాతీయ అధికారులకు సలహా ఇచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఛింద్వారాలో దగ్గు మందు మరణాలకు డి.ఇ.జి.యే కారణమని తేలింది.
విధిగా పాటించవలసిన ‘మంచి తయారీ విధానాల’కు (జీఎంపీ) ఔషధ తయారీ సంస్థలు తిలోదకాలిస్తున్నాయని స్పష్ట మవుతోంది. అవి అనుసరించడం, లేదా అవి తప్పించుకునేందుకు ప్రభుత్వమే అవకాశమిస్తోందా అంటే... రెండూనని జవాబు చెప్పు కోవాలి. కలుషిత మందుల వల్ల మరణాలు సంభవించగానే, జీఎంపీని అమలుపరచడం, వాటిని మరింత కఠినంగా రూపొందించడం గురించిన మాటలు వినవస్తాయి. వెంటనే, చిన్న, మధ్యతరహా ఔషధాల తయారీ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పారిశ్రామిక సంఘాలు నిబంధనల అమలుకు సమయాన్ని అడుగుతాయి.
లేదా వాటిని అమలుపరచగల సామర్థ్యం తమకు లేదంటూ సడలింపు లను కోరతాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం దెబ్బతింటుందని, ప్రభుత్వం కూడా వాటిపట్ల సానుభూతితో వ్యవహరిస్తుంది. జాంబియాలో 68 మంది పిల్లలు మరణించాక కూడా, విధానాలను సరిగా అనుసరించడం లేదంటూ భారతీయ సంస్థలు ప్రపంచ ఆరోగ్య సంస్థనే వేలెత్తి చూపాయి. భారతీయ ఎగుమతులను నీరు గార్చే కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలకు దిగాయి.
‘మంచి తయారీ విధానాల’ ( జీఎంపీ)లోని ‘ఎం’(తయారీ)కు సంబంధించిన రివైజ్డ్ నియమాలను సంస్థలు విధిగా పాటించవలసిన అవసరం ఉందని, ఛింద్వారా ఘటన తర్వాత, ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ పునరుద్ఘాటించారు. సవరించిన జీఎంపీ నిబంధనలను కఠినంగా అమలుజరపవలసిందని రాష్ట్రా లను కోరారు. ‘‘ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల ఉన్నతి పథకా నికి దరఖాస్తు చేసుకున్న కొన్ని సంస్థలకు 2025 డిసెంబర్ వరకు పొడిగింపు ఇచ్చాం’’ అని ఆయన వివరించారు. అంటే, జీఎంపీ నూతన షెడ్యూలును ఇప్పుడిప్పుడే అమలుపరచబోవడం లేదని అవగతమవుతోంది.
పేరుకు కఠిన నిబంధనలే కానీ...
భారతదేశంలో తయారైన దగ్గు సిరప్‌లు వివిధ దేశాలలో మర ణాలకు కారణమవడంపై అంతర్జాతీయంగా హాహాకారాలు రేగడంతో నూతన షెడ్యూలును ప్రవేశపెట్టారు. అది 2024 జూన్ నుంచి పెద్ద సంస్థలకు అమలులోకి వచ్చింది. (రూ. 250 కోట్లకన్నా తక్కువ టర్నోవరు ఉన్న) చిన్న, మధ్య తరహా తయారీ సంస్థలకు 2025 డిసెంబర్ వరకు పొడిగింపునిచ్చారు. నిజానికి, చాలా భాగం కలుషిత మందులు ఈ సంస్థల నుంచే వస్తున్నాయి. తయారీ సంస్థల్లో చాలా వాటికి మినహాయింపు లభించే విధంగా ఈ టర్నో వరు పరిమితిని నిర్ణయించారు.
మందుల తయారీ సంస్థలు ఫార్మ స్యూటికల్ క్వాలిటీ సిస్టం, క్వాలిటీ రిస్క్ మేనేజ్‌మెంట్, కంప్యూ టరైజ్డ్ స్టోరేజీ వ్యవస్థలు వంటి విధానాలకు కట్టుబడి ఉండాలని షెడ్యూలు ఎం నిర్దేశిస్తోంది. సునిశిత పునః పరీక్షకు మధ్యంతర, తుది ఉత్పత్తుల నమూనాలను తయారీ సంస్థలు తప్పకుండా అట్టే పెట్టవలసి ఉంటుంది. కనుక, నిబంధనలకు లోటు లేదు. మరింత కఠినమైన విధంగా వాటిని సవరిస్తున్నారు కూడా! కానీ, వాటిని అమలుపరచే సంకల్ప దీక్ష కొరవడుతోంది.
ఈ నిబంధనలను అమలుపరచేటట్లు చూసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులపై ఉంది. కానీ, తగినంత సిబ్బంది లేదు. ఉద్దేశపూర్వకంగానే సిబ్బందిని అరకొరగా ఉంచుతున్నారని అనుకోవాలి. అనేకానేక నిపుణుల ప్యానెళ్ళు, సమీక్షా కమిటీలు, పార్లమెంటరీ ప్యానెళ్ళు గత రెండు దశాబ్దాలుగా ఈ సంగతిని వెల్లడిస్తూనే ఉన్నాయి. కానీ, క్షేత్ర స్థాయిలో మార్పు లేదు. ఔషధ తయారీ సంస్థలు ఎక్కువగా కేంద్రీకృతమైన తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్నాయి.
పేషెంట్‌కు ప్రాధాన్యత ఉండొద్దా?
పరిశ్రమను కాపాడటం కోసం నిబంధనలను పాటించకపోయినా పట్టించుకోవడం లేదు. లేకపోతే, మన దేశంలో పిల్లల మరణాలకు డి.ఇ.జి. కారణమై ఉండేది కాదు. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న దగ్గు సిరప్‌లు జాంబియా, తదితర దేశాలలో పిల్లల మరణాలకు కారణమైనప్పుడే, ఆ రసాయనిక పదార్థం కారణమని గుర్తించారు. అప్పుడే దగ్గు మందులను తయారు చేసే సంస్థలన్నింటా దేశవ్యాప్తంగా తనిఖీలు జరిపి ఉండవలసింది. అవేవీ జరగకపోవడం వల్ల, ఛింద్వారాలోనూ మరణాలు సంభవించాయి.
‘‘భారతదేశంలో డ్రగ్ రెగ్యులేషన్ వ్యవస్థను పట్టిపీడిస్తున్న చాలా జాడ్యాలకు, డ్రగ్ రెగ్యులేటర్ సంకుచిత ప్రాధాన్యాలు, దృక్కో ణాలే కారణం. కొన్ని దశాబ్దాలుగా అది మందుల తయారీ సంస్థల వ్యాప్తికి, వెసులుబాటుకే ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. దాంతో, దుర దృష్టవశాత్తు, అసలు లెక్కలోకి రావలసిన వినియోగదారుని ప్రయో జనాలు అటకెక్కుతున్నాయి’’ అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ 59వ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను 2012లో పార్లమెంట్‌కు సమర్పించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటాన్నే కేంద్ర ఔషధ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ ప్యానెల్ సిఫార్సు చేసింది. అయినా కల్తీ మందులు ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. ప్రజారోగ్యం కన్నా పరిశ్రమల ప్రయో జనాలకు పెద్ద పీట వేస్తూనే ఉన్నారు.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత


