'స్వీయ నిబద్ధతే' జీవిత సారం | Sakshi Guest Column On Self-commitment by David Brooks | Sakshi
Sakshi News home page

'స్వీయ నిబద్ధతే' జీవిత సారం

Oct 28 2025 12:34 AM | Updated on Oct 28 2025 12:34 AM

Sakshi Guest Column On Self-commitment by David Brooks

అమెరికాలోని డాట్‌మత్‌ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి రచయిత, న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక కాలమిస్ట్‌ డేవిడ్‌ బ్రూక్స్‌ చేసిన స్నాతకోపన్యాస సంక్షిప్త పాఠం:

విశ్వగురు

సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వక్తలు మీ అంతరాత్మ ప్రబోధాన్ని వినండి, ఇష్టమైన వ్యాపకాన్నే చేపట్టండి, మీ భవిష్య త్తుకు ఆకాశమే హద్దు లాంటి మాటలు చెబుతూంటారు. విఫల మవడం కూడా ముఖ్య మని చెప్పే స్నాతకోపన్యాసాలను నేను ఇష్టపడతాను. కొన్నేళ్ళ క్రితం స్టీవ్‌ జాబ్స్‌ చేసిన ప్రసంగంతో ఈ ధోరణి మొదలైంది. కానీ మీరు స్టీవ్‌ జాబ్స్‌ అయితేనే వైఫల్యం కూడా గొప్పగా ఉంటుంది. లేదంటే కుంగదీస్తుంది. అందుకే విఫలం కాకపోవడమే మంచిది.

ఏజెన్సీ మూమెంట్‌!
వచ్చే రెండేళ్ళలో మీలో కొందరికి ఉద్యోగాలు రాకపోవచ్చు. కొందరికి అర్హతకు తగిన ఉద్యోగాలు దక్కకపోవచ్చు. జీవితానికి సరైన దిశా నిర్దేశం, ఒక ప్రణాళిక అంటూ లేకపోయాయని మీలో సగం మంది భావించవచ్చు. కానీ, ఇదంతా ఒక ప్రక్రియలో భాగమే! మీకు ఇష్టమైన వాటిని కనుగొనే, మీకవి నిజంగానే ఇష్టమైనవో కావో పరీక్షించే ప్రక్రియలో భాగం. 

మనందరం కొన్నింటిని ఇష్టపడతాం. కొందరు స్నేహితులను, కొన్ని సబ్జెక్టులను, కొన్ని కలలను, కొన్ని వృత్తిపరమైన లక్ష్యాలను ఇష్టపడతాం. కానీ, వాస్తవికత అనే గీటురాయిపై వాటిని పరీక్షించి చూసేంత వరకు, వాటి స్వాభావికత గురించి మీకు నిజంగా తెలి యదు. నేను గ్రాడ్యుయేట్‌ అయినపుడు, రచయిత కావాలనీ, కొన్నాళ్ళు టీచింగ్‌ చేపట్టాలనీ, నాటక రచయిత లేదా నవలా రచయిత కావాలనీ కోరుకున్నా. రాజకీయాల్లోకి ప్రవేశించాలనీ, పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కనాలనీ కూడా అనుకున్నా.

ఇరవై ఏళ్ళ ప్రాయంలోని మిగిలినవారి మాదిరిగానే, నేను కూడా నాకిష్టమైన వ్యాపకాలను పరీక్షించి చూసుకున్నాను. ఆ క్రమంలో కొత్తగా ఇష్టమైనవిగా తోచినవాటిని కూడా రుచి చూశాను. ఇది మాల్‌లో, ప్యాంటు, చొక్కా వేసుకుని సరిపోయాయో లేవో అద్దంలో చూసుకోవడం లాంటిదే. పదేళ్ళు గడిచే సరికి నాటక రచన కుదరని పనిగా తోచింది లేదా ఇష్టం పోయిందని చెప్పాలి. కొన్ని కొత్తవి దృష్టి పథంలోకి వచ్చాయి. రాజకీయాలకన్నా రచన మరింత ముఖ్యమైనదని తేల్చుకున్నా. నాకు ఇష్టమైన వాటిని ఒక కాగితంపై ప్రాధాన్యతా క్రమంలో రాసుకున్నా. ఎక్కువగా ఇష్టపడుతున్నవాటికి నా శక్తియుక్తులను వీలైనంత ఎక్కువగా వెచ్చించడం ప్రారంభించా. 

ఒక క్రమపద్ధతిలో ఆ జాబితాను సిద్ధం చేసుకునే సామర్థ్యాన్ని చూపారంటే, ‘ఏజెన్సీ మూమెంట్‌’కు వచ్చినట్లే. అంటే, రూపాంతరీకరణ గ్రహింపును సంతరించుకున్నట్లే! 

ఒక వ్యక్తి బాహ్య ఒత్తిడుల నుంచి బయటపడి, స్వీయ విచక్షణ ప్రమాణాలు, విలువలను ఆధారం చేసుకుని ఇష్టంతో కార్యాచర ణకు దిగడం ప్రారంభించడాన్ని ‘ఏజెన్సీ మూమెంట్‌’ అంటారు. వేరెవరో విజయాన్ని నిర్వచించిన సూత్రాలకు అనుగుణంగా మీకు మీరు మూస పోసుకోవడం మానేస్తారు. మీ సొంత ప్రమాణాలు మీకుంటాయి. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం మానే స్తారు. జీవితాన్ని మీదైన రీతిలో మలచుకోవడం ప్రారంభిస్తారు. 

చాలా మంది 30 ఏళ్ళకు కొద్ది ముందు ఆ స్థితికి చేరుకుంటారు. మరికొన్ని ఇతర ‘ఏజెన్సీ మూమెంట్లు’, తదనంతర జీవితంలో 53 లేదా 75 ఏళ్ళ వయసులో కలుగవచ్చు. మీకు ఇష్టమైన వ్యాప కాల ప్రాధాన్యతా క్రమం మారుతుంది. దాన్ని గ్రహించి, అందుకనుగుణంగా, సర్దుబాట్లు చేసుకోక తప్పదు. ఒకసారి ‘ఏజెన్సీ మూమెంట్లు’ సాధించాక, నిబద్ధత చూపడం మొదలుపెట్టవచ్చు.

స్వేచ్ఛ వర్సెస్‌ నిబద్ధత
మన సమాజం నిబద్ధతతో మెలగడాన్ని పెంపొందించే రకమై నది కాదు. దేనినైనా ఎంచుకునే స్వేచ్ఛను అట్టేపెట్టుకుంటాం, మరో వైపు దేన్నైనా కోల్పోతామేమో అనే భయంతో ఉంటాం. టిండర్, ఓకేక్యూపిడ్, ఇన్‌స్టాగ్రామ్, రెడిట్‌ వంటి డీకమిట్‌మెంట్‌ సాధనా లతో నిండిన సమాజంలో జీవిస్తున్నాం. ఒకదాని తర్వాత మరో దానికి వెంటవెంటనే వెళ్ళేవిధంగా మొత్తం ఇంటర్‌నెట్‌ మనల్ని పురిగొల్పుతుంది. మన ఏకాగ్రతను భగ్నం చేయడమే మన చేతిలోని ఫోన్ల పని. ఒక అంశంపై కనీసం 30 సెకన్లు కూడా దృష్టి పెట్టలేని వాళ్ళం, జీవితం పట్ల నిబద్ధత ఏమి చూపగలం? 

మీ స్వేచ్ఛకు మీరు ఎంత బాగా అడ్డుకట్ట వేసుకోగలుగుతారనే దానిపైనే జీవితంలో ఏదైనా నెరవేరడం లేదా నెరవేరకపోవడం ఆధారపడి ఉంటుంది. నిబద్ధతతో మెలగడమే ప్రాథమిక కర్తవ్య మనే సంగతిని 30 ఏళ్ళ ప్రాయంలో గ్రహిస్తాం. నిబద్ధతతో మెల గాల్సి ఉంటుందంటే, మొదట భయం వేయవచ్చు. కానీ, నిబద్ధత అంటే,  ఏదైనా ఒకదాని పట్ల ఇష్టం ఏర్పడి, అది నెరవేరకపోయినా, జీవితంలో ముందుకు సాగే విధంగా, నడవడికను రూపొందించు కోవడమే! అది జీవిత భాగస్వామి, ఉద్యోగం, పని చేస్తున్న కంపెనీ ఏదైనా కావచ్చు. 

నిబద్ధత ఒక నైతిక కార్యాచరణ
ఒక కెరీర్‌ లేదా ఒకేషన్‌ పట్ల బద్ధులమై ఉన్నామని 28–32 ఏళ్ళ మధ్యలో గ్రహిస్తాం. కానీ, కెరీర్‌ వేరు, ఒకేషన్‌ వేరు. కెరీర్‌ను మీరు ఎంచుకుంటారు, ఒకేషన్‌ మిమ్మల్ని ఎంచుకుంటుంది. ఫ్రాన్సిస్‌ పెర్కిన్స్‌ అనే యువతి 20వ ప్రాయం చివరలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ, అగ్ని ప్రమాదాన్ని చూశారు.

వందలమంది మంటలకు ఆహుతయ్యారు. మంటల నుంచి రక్షించుకునే క్రమంలో పైనుంచి దూకేసి చనిపోయారు. తర్వాత, ఆమె తన జీవితం మొత్తాన్నీ కార్మికుల భద్రత, హక్కుల సాధనకు వెచ్చించారు. మనకు ప్రీతిపాత్రమైన దానిని అంతర్‌ దృష్టితో కనుగొనలేం. దీనిపై అధ్యయనాలు సాగాయి. మనలో ఎనభై శాతం మందికి ప్రీతిపాత్రమైనది అంటూ ఉండదు. బయటకు చూడటం ద్వారా, అవసరాలను చూసినపుడు ఆర్ద్రతతో స్పందించడం ద్వారా దాన్ని కనుగొనవచ్చు.  

భాగస్వామి లేదా పిల్లల పట్ల చూపించేది మరో నిబద్ధత. వివాహం 30 లేదా 40 లేదా 50 ఏళ్ళ సంభాషణ. అన్ని గొప్ప అంకిత భావాల మాదిరిగానే, ప్రేమ కూడా రెండు భిన్నమైన స్థాయు లలో సమాంతరంగా పనిచేస్తూ వస్తుంది. ఒకటి – సడలని వాస్తవి కత. రెండు– భావాతీత ఇంద్రజాలం. ఇంట్లోకి సరుకులు కొనడం, ఇల్లు శుభ్రం చేయడం, రాజీపడవలసి రావడం, తేలికపాటి బలహీనతలతో సర్దుకుపోవడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. 

కవితాత్మకమూ, భావాతీతమూ, ఆదర్శవంతమూ, విశ్వజనీనమూ అయినది ప్రేమలోని మరో కోణం. చాలా భాగం వనరులు పరిమితమైనవి. మనం ఉపయోగించుకుంటున్న కొద్దీ అవి తరిగిపోతాయి. కానీ, ప్రేమ వేరు. ప్రేమిస్తున్న కొద్దీ మీరు ఇంకా ప్రేమించగలుగుతారు. ఒక బిడ్డను ప్రేమిస్తున్నంత మాత్రాన, మరో బిడ్డ పుడితే, ఆ రెండవ బిడ్డను తక్కువగా ఏమీ ప్రేమించరు. పంచుతున్న కొద్దీ ప్రేమ విస్తారమవుతుంది. 

ప్రేమలో ఉన్నవారు కష్టనష్టాలను తట్టుకునేందుకు కూడా సిద్ధపడతారు. రెండు వేర్వేరు నగరాల్లో ఉంటున్న యువతీ యువకులకు కలసి ఉండడంలో అర్థం లేదని చెప్పండి. వారు ఒప్పుకోరు. విడిపోయి సంతోషంగా ఉండటం కన్నా, కలసి ఉండి, కష్టసుఖాలు పంచుకునేందుకే ఇష్టపడ తారు. నిబద్ధతలో ఉండే గొప్ప అంశమది. నిబద్ధత ఒక నైతిక కార్యాచరణ. 

ఒక వృత్తిని నిర్వహించడం నైతిక చర్య. 30 లేదా 50 ఏళ్ళ వివాహ బంధానికి కట్టుబడి ఉండడం నైతిక చర్య. మాట ఇచ్చి నిల బెట్టుకోవడం నైతిక చర్య. ఒక మంచి, నైతిక వ్యక్తిగా పరిణమించడ మంటే, ప్రలోభాలను నియంత్రించలేకపోవడం కాదు. నిబద్ధతతో వ్యవహరించగల సామర్థ్యాన్ని ప్రదర్శించడం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement