మదురో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏడాదిగా సాగిస్తున్న ప్రయత్నాలు నెరవేరక పోతుండటంతో ట్రంప్ కొత్త కార ణాన్ని ముందుకు తెస్తున్నారు. వెనిజులా నుంచి తమ దేశంలోకి కొకైన్, ఫెంటానిల్ వంటి మాదక ద్రవ్యాలు భారీగా రవాణా అవుతున్నాయని ఆరోపిస్తున్నారు.
విశ్లేషణ
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు గల లాటిన్ అమెరికా దేశం వెనిజులాను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా ఇపుడు సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల తర్వాత ఈ కొత్త పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తు న్నాయి. తమ సన్నాహాలలో భాగంగా అమెరికా ఇటీవలి వారాలలో వెనిజులా సమీపంలోని కరీబియన్ సముద్రానికి 10 యుద్ధ నౌకలను, 10 ఎఫ్–35 యుద్ధ విమానాలను, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌకను, ఒక అణుశక్తి జలాంత ర్గామిని మోహరించింది. ఇందుకు అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్న కారణాలు అదే ప్రాంతంలో గల ట్రినిడాడ్ దేశంతో కలిసి యుద్ధ విన్యాసాలు జరపటం, అదే విధంగా వెనిజులా నుంచి మాదక ద్రవ్యాల రవాణాను నిలువరించటం! కానీ, గత 35 సంవత్సరా లుగా ఎన్నడూ లేని స్థాయిలో సాగుతున్న మోహరింపుల ఉద్దేశం అదేనని ఎవరూ నమ్మటం లేదు.
చమురు కోసమేనా?
వెనిజులాలోని చమురు నిల్వలు 303 బిలియన్ బ్యారల్స్ అని అంచనా. వాటితో పోల్చినపుడు సౌదీ అరేబియా నిల్వలు 267 బిలియన్లు, ఇరాన్‌వి 208 బిలియన్లు, రష్యావి 80 బిలియన్లు కావ టాన్ని బట్టి పరిస్థితిని ఊహించవచ్చు. అయితే, పాశ్చాత్య దేశాల ఆంక్షలు, పెట్టుబడులకు – మౌలిక ఏర్పాట్లకు గల కొరత కారణంగా అక్కడ ఉత్పత్తి స్వల్పంగానే జరుగుతున్నది. మరొకవైపు అక్కడి నిల్వలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు పాశ్చాత్య దేశాల కంపెనీల ప్రయత్నాలు నెరవేరటం లేదు. ఆ నిల్వలన్నింటి యాజ మాన్యం అక్కడి ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. సోషలిస్టు పార్టీకి చెందిన హ్యూగో చావెజ్ ప్రభుత్వం లోగడ తీసుకున్న ఈ నిర్ణ యాన్ని, ఆయన వారసుడైన ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో కొనసాగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరిపడని ట్రంప్, ఆయనను పడగొట్టేందుకు తన మొదటి పాలనా కాలంలోనూ ప్రయత్నించారు గానీ వీలుపడలేదు.
వెనిజులాలో సోషలిస్టు పార్టీ బలమైనది. తమ దేశంలోగానీ, మొత్తం లాటిన్ అమెరికాలో గానీ అమెరికా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చావెజ్ తన రోజులలో ప్రపంచవ్యాప్తంగా పేరు పడ్డారు. ఆయన మరణం తర్వాత అధ్యక్షుడైన మదురో స్వరంలో అటువంటి తీవ్రత లేకపోయినా, విధానాలలో ఎటువంటి మార్పూ లేదు. మదురో సమాజంలోని అడుగుస్థాయి నుంచి ఎదిగి వచ్చిన వాడు. 2013 నుంచి ఇప్పటికీ వరుసగా అధ్యక్షునిగా ఎన్నికవు తున్నారు. ఆయనకు ప్రజల మద్దతు సరేసరి కాగా, సమాజంలోని ఎగువ తరగతులు, పట్టణవాసులతోపాటు సైన్యం సమర్థన కూడా పూర్తిగా ఉందన్నది అంచనా. అందువల్లనే ఆయన్ని అమెరికా అనేక ఇతర లాటిన్ అమెరికా దేశాలలో చేసినట్లు అంతర్గత కుట్రల ద్వారా పడగొట్టలేక పోతున్నదనే అభిప్రాయం ఉంది.
మాదక ద్రవ్యాల సాకుతో...
ఒక విశేషం చెప్పుకోవాలి. గత ఎన్నికలలో మదురోతో పోటీ చేసి ఓడిన మరియా కొరీనా మచాడోకు ఇటీవలి నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. వెనిజులా సమీపాన అమెరికా సేనల మోహరింపుపై, ‘యుద్ధాన్ని మదురో ప్రారంభించారు, ట్రంప్ ముగించనున్నారు’ అని వ్యాఖ్యానించి ఆమె అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ నేపథ్యం ఇట్లుండగా, వెనిజులాపై చర్యలకు ట్రంప్ సాకులు వెతకటం మొదలుపెట్టారు. అందులో మొదటిది నిరుటి అధ్యక్ష ఎన్నికలలో అక్రమాలు జరిగాయనీ, అందువల్లనే మరియా మచాడో ఓడిందనీ ఆయన ఆరోపణ.
మరొక దేశపు ఎన్నికల సక్ర మాలు, అక్రమాలను నిర్ధారించటమనే సాకుతో తమకు సరిపడని ప్రభుత్వాలను పడగొట్టజూడటం అమెరికాకు గతం నుంచి ఉన్న సంప్రదాయమే! అంతెందుకు? వెనిజులాకు సరిగా పొరుగునే గల బ్రెజిల్‌లో, ఎన్నికలలో గెలిచిన అధ్యక్షుడు లూలాతో ఓడిన బోల్సొ నారో తిరుగుబాటును, ఆయనపై కోర్టు చర్యలను ట్రంప్ బాహాటంగా వ్యతిరేకించారు. తన మిత్రుడైన బోల్సొనారోపై చర్యలు తీసు కున్నందుకు బ్రెజిల్‌పై సుంకాలను 50 శాతం పెంచారు.
అమెరికా ఉద్దేశంలో ఇదంతా ప్రజాస్వామ్య పరిరక్షణ. కనుక ఇపుడు వెనిజులా ఎన్నికలు, మచాడో ఫిర్యాదులు అమెరికా అధ్యక్షునికి సాకులుగా ఉపయోగపడుతున్నాయి. అయితే, గత ఏడాదిగా సాగుతున్న ఈ ప్రయత్నాలు నెరవేరక పోతుండటంతో ట్రంప్ ఇటీవల కొత్త సాకు ముందుకు తెస్తున్నారు. వెనిజులా నుంచి తమ దేశంలోకి కొకైన్, ఫెంటానిల్ వంటి డ్రగ్స్ భారీగా రవాణా అవుతున్నాయంటున్నారు!
మాదక ద్రవ్యాల సమస్య అమెరికాలో తీవ్రంగా ఉంది. కానీ అందులో వెనిజులా పాత్ర ఏమిటన్నది ప్రశ్న. అమెరికా సంస్థ ప్రక టించిన మాదక ద్రవ్యాల నివేదిక – 2025లో వెనిజులా ప్రస్తావన లేదు. కొకైన్, ఫెంటానిల్ తదితరాలన్నీ ఉత్పత్తి అవుతున్నది కొలంబియా, పెరూ, బొలీవియా, మెక్సికో వంటి చోట్ల. రవాణా మాత్రం స్వల్పస్థాయిలో వెనిజులా మీదుగా జరుగుతున్నది. ఇతరత్రా కూడా బయటి నిపుణుల అభిప్రాయం అదే.
ఏకపక్ష దాడులు
ఈ వివరాలన్నీ గమనించినపుడు, అమెరికా అధ్యక్షుని లక్ష్యం మదురో ప్రభుత్వాన్ని పడగొట్టి తమ అనుకూలురను అధికారానికి తేవటమని తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఆ మాట ట్రంప్ గత పర్యాయమే అన్నట్లు పైన చూశాము. అదే మాటను ఈసారి డొంక తిరుగుడుగా చెబుతుండగా, తన విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూటిగానే అంటున్నారు. ఇటీవలి వారాలకు వస్తే, అక్కడ జోక్యం చేసుకుని రహస్య కార్యకలాపాలు సాగించవలసిందిగా సీఐఏను ఆదేశించినట్లు ట్రంప్ బాహాటంగానే ప్రకటించారు.
మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ వెనిజులా తీరంలో పది బోట్లపై వైమానిక దాడులు జరిపి సుమారు యాభైమంది ప్రాణాలు తీశారు. ఆ రవాణా అబద్ధమని, అవన్నీ మామూలు బోట్లని మదురో ఖండించారు. మాదక ద్రవ్యాలకు ఆధారాలు దాడికి ముందుగానీ, తర్వాతగానీ ఉన్నాయా అన్న మీడియా ప్రశ్నలకు ట్రంప్ సమాధానమివ్వలేదు. ఐక్యరాజ్యసమితి సముద్రయాన, సముద్ర తీర చట్టాల ప్రకారం అసలు అటువంటి దాడుల అధికా రమే లేదని నిపుణులు స్పష్టం చేశారు. అయినా ఇదంతా ప్రపంచపు అమాయకత్వంగాని, అమెరికా ప్రయోజనాలకు ఎప్పుడు ఏది ప్రతిబంధకమైంది గనుక!
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


