
బాలకృష్ణ (ఫైల్)
రాష్ట్రానికి చెందిన మావోయిస్టు అగ్రనేత బాలకృష్ణ సహా 10 మంది మృతి
గరియాబండ్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు... మృతుల్లో బాలకృష్ణ ఉన్నట్లు ప్రకటించిన పోలీసులు
ఆయనపై మొత్తం రూ.2 కోట్ల రివార్డు
రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)/ సాక్షి ప్రతినిధి, వరంగల్: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబండ్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు గురువారం పోలీసులు ప్రకటించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ (60) ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు.
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండకు చెందిన బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ బాలన్న, అలియాస్ రామచందర్, అలియాస్ భాస్కర్‌పై మొత్తం రూ.2 కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. వచ్చే మార్చి 31లోగా నక్సలైట్ల ఏరివేత పూర్తి కావడం ఖాయమని పేర్కొన్నారు.
మెయిన్‌పూర్ అటవీ ప్రాంతంలో..
మెయిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. యాంటీ నక్సలైట్ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా దళాలు కూంబింగ్ చేపడుతుండగా ఎన్‌కౌంటర్ జరిగినట్లు రాయిపూర్ రేంజ్ ఐజీపీ అమ్రేశ్ మిశ్రా తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ పోలీస్‌కు చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్, జిల్లా పోలీసు విభాగానికి చెందిన ‘ఈ–30’, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా దళాలు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయని ఆయన చెప్పారు. సీనియర్ నేతలతో పాటు మొత్తం 10 మంది నక్సలైట్లు మృతి చెందారని, పూర్తి వివరాలు అందాల్సి ఉందని అన్నారు. బాలకృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.
హైదరాబాద్‌లో చదువుతూ ఉద్యమ బాట
మోడెం వెంకటయ్య, మల్లమ్మ దంపతులకు బాలకృష్ణ జన్మించారు. వెంకటయ్యకు పోస్టుమ్యాన్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ ఏరియాకు సుమారు 50 ఏళ్ల కిందటే మకాం మార్చారు. బాలకృష్ణకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. 1983లో మావోయిస్టు (పీపుల్స్‌వార్) పార్టీ పట్ల ఆకర్షితుడైన బాలకృష్ణ.. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పోరుబాట పట్టారు. కొంతకాలం రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్‌యూ) జంట నగరాల బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగారు.
1993లో అరెస్టు.. 1999 వరకు జైల్లో..
పీపుల్స్‌వార్ పార్టీ పనిలో భాగంగా అడవినుంచి బయటకు వచ్చిన బాలకృష్ణను అప్పటి యాంటీ నక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్‌ఎస్) పోలీసులు 1993లో అరెస్టు చేశారు. పోలీసు డీఐజీ కేఎస్ వ్యాస్ హత్య, ఎమ్మెల్యే కిడ్నాప్‌లతో పాటు బెంగళూరు ఆయుధాల స్వా«దీనం, కుట్ర కేసులలో ఆయన సుమారు ఆరేళ్ల పాటు ముషీరాబాద్ జైల్లోనే ఉన్నారు.
1999లో బెయిల్‌పై విడుదలైన ఐదు రోజులకే కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వినకుండా తిరిగి అడవిబాట పట్టారు. సుమారు 26 సంవత్సరాలు ఏవోబీలో వివిధ కేడర్‌లలో పని చేశారు.ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా మారారు. ఆయనపై మూడు రాష్ట్రాలతో పాటు ఎన్‌ఐఏ ప్రకటించిన దానితో కలిపి రూ.2 కోట్ల రివార్డు ఉన్నట్లు సమాచారం.
ఆపరేషన్ కగార్ పేరిట గత కొంతకాలంగా ప్రత్యేక పోలీసు బలగాలు అడవులను జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఇతర నాయకులు, దళాలతో కలిసి బాలకృష్ణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులో సంచరిస్తున్నట్లు కేంద్ర బలగాల నుంచి సమాచారం అందింది. ఈ మేరకు కూంబింగ్ చేపట్టగా ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.