12 జోన్లు.. 60 సర్కిళ్లు
డీలిమిటేషన్‌పై ఆందోళనలు.. కొనసాగుతున్న అభ్యంతరాలు
సాక్షి, సిటీబ్యూరో
ఇటీవల విలీనమైన స్థానిక సంస్థలు సహా హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)ను 300 వార్డులు (కార్పొరేటర్ డివిజన్)గా డీలిమిటేషన్‌కు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన అధికార యంత్రాంగం, తదుపరి దశలో చేయాల్సిన సర్కిళ్లు, జోన్లపై దృష్టి సారించింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 150 వార్డులుండగా, 30 సర్కిళ్లు, 6 జోన్లు ఉండటం తెలిసిందే. వార్డులు 150 నుంచి 300కు పెరిగి రెట్టింపు కాగా, సర్కిళ్లు, జోన్లు సైతం రెట్టింపు కానున్నాయి. మొత్తం 60 సర్కిళ్లు, 12 జోన్లుగా జీహెచ్‌ఎంసీ పరిపాలన సాగనుంది. ఈమేరకు కసరత్తు జరుగుతోందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు.
ఆందోళనలు.. అభ్యంతరాలు
విస్తరించిన జీహెచ్‌ఎంసీని 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరిస్తూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా వచ్చిన వార్డుల్లో కొన్నింట్లో వార్డు పేరు తప్ప ఆ ప్రాంతం లేదంటూ బాకారం వార్డును ప్రస్తావించారు. కొందరు కాచిగూడ బదులు వార్డు పేరు బర్కత్‌పురా కావాలని కోరినట్లు తెలిసింది. ఇంకొందరు సరిహద్దులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న వార్డులకు సంబంధించిన మ్యాపులు లేకపోవడం. వార్డుల వివరాలు కూడా ఆంగ్లంలో తప్ప తెలుగులో లేకపోవడంతో అందరికీ అర్థం కావడం లేదని నిరసనలు వ్యక్తం చేశారు.
కమిషనర్ కర్ణన్‌ను కలిసిన కమలం నేతలు
వార్డుల విభజనపై బీజేపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్ర బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతమ్‌రావు, ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, పార్టీ నేతలు సి.కృష్ణయాదవ్, చింతల రామచంద్రారెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి తదితరులు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. విలీనం, డీలిమిటేషన్ అత్యంత తొందరపాటుతో పారదర్శకత లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్‌లోని 300 వార్డుల మ్యాపులను వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌కు ఏ విధానం అనుసరించారో పబ్లిక్ డొమైన్‌లో లేకపోవడం తగదని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా జరగాల్సిన ప్రక్రియ అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. అధికార పార్టీ అండదండలతో ఒకపార్టీ నేతలు ప్రభావం చూపారని ఆరోపించారు. ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు కమిషనర్ పాలకమండలి అభ్యంతరాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా నిబంధనలున్నప్పటికీ, పాటించలేదని, వార్డులవారీగా జనాభా, ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు ఇవ్వాలని కోరారు.
16న పాలకమండలి ప్రత్యేక సమావేశం
శివారు స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్‌ఎంసీ విస్తరణ, కలిసిన పరిధి మేరకు వార్డుల పునర్విభజన అంశాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ పాలకమండలి సభ్యుల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకునేందుకు ఈ నెల 16న పాలకమండలి ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈమేరకు సభ్యులకు సమాచారం పంపారు.
వార్డుల మ్యాపులు, తెలుగులో వివరాలు లేకపోవడంపై నిరసనలు
వార్డు పేరు మార్పు కోసం వినతులు
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసిన బీజేపీ నేతలు
12 జోన్లు.. 60 సర్కిళ్లు


