మహారాణులకు, ఏడువారాల నగల వలె, అమెరికా మహారాజు డోనాల్డ్ ట్రంప్‌కు ఏడువారాల వ్యూహాలుంటాయి. ఈ స్థితిని ప్రపంచం పలు విషయాలలో గమనిస్తున్నది. గమనించి మొదట భయ పడింది. తర్వాత అయోమయానికిగురైంది. చివరకు పరిస్థితి కొంత వినోదాత్మకంగా మారగా, ప్రేక్షకులలో కొందరు ట్రంప్ తలపై ఆయన ఇటీవల స్వయంగా ధరించి పోస్ట్ చేసిన రాజు గారి కిరీటానికి బదులు సర్కస్ క్లౌన్ టోపీని చూస్తున్నారు. కొందరు ఏమిచేయాలో తోచక విసుగెత్తి తలలు పట్టుకుంటున్నారు.
అమెరికా అధ్యక్షుని గురించి పైన చేసిన వ్యాఖ్యలేవీ కాలక్షేపపు ఊహాగానాలు కావు. ప్రతి ఒక్కటీ వాస్తవంగా జరుగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకుని అన్న మాటే. అట్లా పరిగణించిన విష యాలు ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, భారత దేశంతో ఆర్థిక – వ్యూహాత్మక సంబంధాలు, చైనాతో వాణిజ్య – వ్యూహాత్మక తగవులు. వీటికి సంబంధించి కొన్ని మాసాల నుంచి మొదలుకొని నేటివరకు మాట్లాడుతున్నవి, చేస్తున్నవి, చేస్తానని చేయనివి, తాను చేయకున్నా ఇతరులు చేయాలనేవి, ఇతరులు చేయాలంటూ తిరిగి అందుకు మార్పులు చేసేవి, తాను చేస్తాననే వాటిలో మార్పులు తెచ్చేవి... అన్నింటినీ ఒక కాలక్రమంలో పేర్చి పెట్టి చూస్తే, మొత్తం మీద కనిపించేది ట్రంప్ చక్రవర్తి ‘ఏడువారాల నగలు’.
మనంఅంటున్న ఈ మాట ఆయనకు చేరే అవకాశం లేదుగానీ, ఇటీవల అమెరికన్ పౌరులు ‘నో కింగ్’ అంటూ పెద్ద ఎత్తున జరిపిన నిరసనలను హాస్యాస్పదంగా చూపేందుకు తానే హాస్యాస్పద వేషధారణ చిత్రాన్ని పోస్ట్ పెట్టినట్లు, ఏడువారాల నగలతో ఏడు పోస్టులు పెట్టే వారేమో!
చక్రవర్తి ఎందుకు?
ట్రంప్ చేస్తున్నదంతా ఒక వ్యూహంలో భాగమని ఆయన అంతే వాసులు ప్రచారం చేసి లోకాన్ని నమ్మించజూశారు. వారు చెప్పిన దాని ప్రకారం ఆయన ఒక విషయమై అవతలి వారిని పిచ్చుకపై వేస్తాను సుమా బహ్మాస్త్రం అన్నట్లు మొదటే భయపెడతారు. అట్లా వేయటం నిజంగా తన ఉద్దేశం కాదు. కానీ అట్లా భయపెడితే అవతలి వారు బ్రహ్మాస్త్ర ప్రయోగం నిజంగానే జరగవచ్చునని భయ పడిపోయి, తన ఆదేశాలను శిరసావహించగలరన్నది ట్రంప్ అంచ నాలట! దానిని వారు బ్రహ్మాస్త్ర వ్యూహమన్నారు. ఇది యథాతథంగా వినేందుకు గొప్పగా తోస్తుంది. మధ్యయుగాల నాటి ‘బెనెవెలెంట్ డిక్టేటర్ (ఉదార నియంత) లక్షణాల తరహాలో కనిపిస్తుంది.
ట్రంప్ వ్యక్తిత్వంలో, వ్యవహరణలో నిజంగానే ఈ లక్షణాలు ఉన్నాయన్నది కొందరి అభిప్రాయం. పరిస్థితి అంతవరకే అయితే ఫరవాలేదు. నిజం చెప్పాలంటే ‘ఉదార నియంత’ భావన ఆధునిక ప్రజాస్వామ్య భావనలకు సరిపడేది కాదుగానీ, ఒకోసారి అందువల్ల కొంత మంచి కూడా జరుగుతుంటుంది. అదే సమయంలో ఎక్కువసార్లు బెడిసి కొడుతుంది. ఈ రెండింటిలో ఏమి జరిగేదీ అవతలి పక్షాల పైనా, వాస్తవ పరిస్థితుల పైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, కిరీటం ధరించిన ‘కింగ్ ట్రంప్’ గారి ‘బెనెవె లెంట్ డిక్టేటర్’ వ్యూహం కొద్ది సందర్భాలలో తప్ప పనిచేయదు.
వాస్తవానికి ఈ హెచ్చరిక ఆయనకు అందరికన్నా ముందు చేసినవాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా. అయినదానికి కాని దానికి ట్యారిఫ్‌లు పెంచుతూ, వాణిజ్య ఒప్పందాల గురించి బెది రిస్తూ, చివరకు బ్రెజిల్ ప్రతిపక్ష నాయకుడు బోల్సొనారోపై చర్యల విషయంలోనూ జోక్యం చేసుకొనజూసినపుడు, ‘‘ప్రపంచం చక్ర వర్తిని కోరుకోవటం లేదు. అమెరికన్లు ట్రంప్‌ను ఎన్నుకున్నది చక్ర వర్తి అయేందుకు కాదు’’ అని ఘాటుగా మాట్లాడారాయన. పరిస్థి తిని ట్రంప్ అర్థం చేసుకోలేదన్నది వేరే విషయం!
మార్చేందుకే మాట ఉన్నది...
ప్రస్తుతానికి వచ్చి, పైన పేర్కొన్న వేర్వేరు విషయాలను గమనిస్తే, అమెరికా అధ్యక్షుడు నాలుగు రోజులకు ఒక విధంగా మాట మార్చటం చూస్తున్నాం. ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటలలో ఆపివేయగలనంటూ మొదలుపెట్టిన ఆయన, ఇపుడు ఏమిచేయాలో తోచక, టేబుల్‌కు రెండు వైపులా తానే నిలిచి తనతో తానే పింగ్‌పాంగ్ ఆడుతున్నారు. ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని, సోమవారం నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరిస్తారు.
డోన్‌బాస్‌ను వదలుకోవాలని మంగళవారం ఆదేశించి క్రిమియాను సైతం స్వాధీన పరచుకునేందుకు జెలెన్‌స్కీకి తోమహాక్‌లు అంద జేయగలనంటూ బుధవారం నాడు పుతిన్‌ను భయపెట్టజూస్తారు. గురువారంరోజు ఇద్దరితోనూ ఖనిజ ఒప్పందపు చర్చలు నడుపు తారు. శుక్రవారం యూరోపియన్ దేశాలను మీ దారి మీదేనని చెప్పి, శనివారం నాడు ‘నాటో’ను అందరం కలిసి బలోపేతం చేద్దామంటారు. ఈ విధంగా ఉక్రెయిన్ విషయమై ప్రపంచం గమనించి అబ్బు రపడుతున్న ‘ఏడువారాల నగల ప్రదర్శన’ వంటిదే ఇతర సంద ర్భాల్లోనూ చూస్తున్నాము.
ఉక్రెయిన్ వలెనే మరొక యుద్ధమైన గాజాను గమనించండి. గతాన్ని కొద్దిసేపు అటుంచి ఇటీవలి పరిణామాలనే గమనిస్తే– 20 అంశాల ప్రకటన, షర్మ్ అల్ షేక్ సంతకాలతో మొత్తం పశ్చిమాసియాలోనే ‘శాశ్వత శాంతి’ సిద్ధించిందని ప్రకటించారు ట్రంప్. అది తొందరపాటనీ, మొదటి దశ అయిన కాల్పుల విరమణే ఇంకా స్థిరపడవలసి ఉందనీ అందరూ ఎత్తిచూపారు. కానీ అధ్యక్షుడు మాత్రం నోబెల్ శాంతి ప్రకటన ముగిసినదే తడవు హమాస్‌కు హెచ్చరికలు మొదలుపెట్టారు.
అంతర్గత అరాచక శక్తులను అదుపు చేసేందుకు హమాస్ ఆయు ధాలను ఉంచుకోవచ్చునని ఒకరోజు ప్రకటించి, ఒకరోజు తిరిగే సరికి అస్త్రసన్యాసం చేస్తారా లేక ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ‘సర్వనాశనం’ చేయాలా అని బెదిరింపులు మొదలుపెట్టారు. ఇజ్రా యెల్ బాంబింగులు, సహాయ సరఫరాల నిలిపివేతలపై మౌనం వహిస్తున్నారు. గతంలోకి వెళితే, ఆయన గాజా, పాలస్తీనా విధా నాలు, రకరకాల ప్రకటనలు తెలిసినవే గనుక ఇక్కడ రాయ నక్కర లేదు.
20 అంశాల ప్రకటన అయితే బయటి వారితో తాత్కా లిక ప్రభుత్వం, బయటి దళాలతో భద్రతావ్యవస్థ, బయటి వారి ప్రణాళికల మేరకు అభివృద్ధి అని చెప్పటం మినహా, స్వతంత్ర పాలస్తీనా గురించి నిశ్చితంగా ఏమీ పేర్కొనక పోవటం తెలిసిందే. వీటన్నింటి చుట్టూ తిరుగుతూ ట్రంప్ వేర్వేరు మాటలతో ఏడు వారాల నగలు ధరిస్తూనే ఉన్నారు.
మధ్యయుగాల క్రీడ
భారత దేశం, చైనాలతో ట్యారిఫ్‌లు, వాణిజ్య ఒప్పందాలకుసంబంధించి కూడా సరిగా ఇదే జరుగుతున్నది. ఒక రోజు బెదిరింపులు, ఈసడింపులు, మరునాడు సానునయమైన మాటలు. ఒక రోజు సంయుక్త సమావేశపు ప్రతిపాదనలు, మరొకరోజు వాయి దాలు... ఇది ఈ రెండు ఆసియన్ దేశాల విషయంలోనూ జరుగు తున్నది. ట్రంప్‌కు సమస్య ఎక్కడ వస్తున్నదంటే, కొద్ది తేడాలతో రెండు దేశాలు కూడా ఒక పరిమితిని దాటి తమ జాతీయ ప్రయో జనాలను వదులుకునేందుకు సిద్ధంగా లేవు.
చైనా అయితే తన ఆర్థిక బలిమి వల్ల, కొన్ని రంగాలలో అమెరికాను పూర్తిగా ధిక్కరించ గలగటం ట్రంప్‌కు పాలుపోని పరిస్థితి అయింది. అయినా చైనా, ఇండియాలను గెలవనివ్వకూడదు గనుక, తరచూ ‘నగల మార్పిడి’ చేసుకుంటూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు అర్థం చేసుకుని మారవలసింది ఏమంటే, తన వ్యూహంలో బలహీనతలు అనేకం ఉన్నాయి. ప్రపంచం ఒకప్పటి వలె లేదు. అందువల్ల, మధ్య యుగపు రాజువలె కిరీట ధారణ, రాణివలె ఏడువారాల నగలు చూసి చిత్తభ్రమలకు లోనై లొంగిపోయే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతున్నది.
- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
- టంకశాల అశోక్


