మాధవ్ శింగరాజు
చీఫ్ ఏఐ ఆఫీసర్‌గా ‘మెటా’ లోకి వచ్చీ రావటంతోనే అలెగ్జాండర్ వాంగ్ చేసిన రెండో పని... జింజర్ ఫైర్‌బాల్ తెప్పించుకుని వాక్ ఏరియాలో నాతో కలిసి నడుస్తూ తాగటం.
ఇక అతడు చేసిన మొదటి పని... 600 మంది ఏఐ నిపుణులను ఒకేసారి ఫైర్ చేసి, నవంబర్ 21లోగా రిజైన్ చేయాలని కోరుతూ వాళ్లందరికీ లెటర్స్ మెయిల్ చేయించటం.
28 ఏళ్ల వయసుకే కాఫీ, టీలను త్యజించినవాడు వాంగ్. నిజంగా జ్ఞానోదయం పొందినవారు మాత్రమే పని మధ్యలో ఒక కప్పు సాదాసీదా వేడి నీటితో తమ ఇంద్రియాలను పునరుజ్జీవింప జేసుకోగలరని అంటాడతడు.
‘‘ఎవర్నీ ఫైర్ చెయ్యకుండా మెటా ‘ఏఐ’ని నడిపించలేమా వాంగ్?’’ అన్నాను.
ఫైర్‌బాల్ జ్యూస్‌ను సిప్ చేస్తున్న క్రీస్తు పూర్వపు చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్‌లా... నా వైపు చూశాడు వాంగ్,
‘‘హైర్ చేసేటప్పుడు ఎంపిక చేసుకుంటాం కదా, ఇదీ అంతే మార్క్. ఫైర్ చేయటానికి ఎంపిక చేసుకుంటున్నాం’’ అన్నాడు.
ట్రంప్ కంటే మొండివాడు వాంగ్. ‘‘ఏఐ వార్‌లో అమెరికా గెలిచి తీరవలసిందే’’ అని ట్రంప్‌కే నేరుగా లెటర్ రాసినవాడు! వాంగ్ ‘రూట్స్’ చైనావి. వాంగ్ ‘హార్ట్ బీట్స్’ అమెరికావి.
‘‘కానీ వాంగ్, కొన్నిసార్లు ఆఫ్రికా ఖండంలోని ఆకలి చావుల కన్నా, మన ఇంటి ముందర నిర్జీవంగా పడి ఉన్న ఉడుతే మనల్ని ఎక్కువగా కలచివేస్తుంది!’’ అన్నాను.
మెటాకు నేనొక ‘ఔట్‌మోడెడ్’ వెర్షన్ అన్నట్లుగా నా వైపు చూశాడతడు. ‘‘ఓకే మార్క్... మళ్లీ కలుద్దాం’’ అనేసి వెళ్లిపోయాడు.
ఎంప్లాయీస్‌ని తొలగించినందుకు యూజర్స్ చేస్తున్న కామెంట్స్ అన్నీ వాంగ్ మీద వస్తున్నవే! వాంగ్ చైనీస్ పర్సన్ కనుక అతడు ఫైర్ చేసిన వాళ్లలో ఒక్కరు కూడా చైనీస్ ఉండకపోవచ్చని ఒకరు కామెంట్ చేశారు!
దారుణమైన కామెంట్ కూడా ఒకటి ఉంది. జుకర్‌బర్గ్ భార్య చైనీస్ పర్సన్ కనుక, వాంగ్ అనే చైనీస్ పర్సన్ కి ‘మెటా’లో అంత పెద్ద ఉద్యోగం దొరికిందని!!
నిజానికి, మెటాలోకి వచ్చేటప్పటికే వాంగ్ ‘స్కేల్ ఏఐ’ అనే ఒక పెద్ద కంపెనీకి కో–ఫౌండర్. అందులో సగ భాగాన్ని మెటా కొనేయటంతో అతడు మెటాలోకి వచ్చాడు కానీ, మెటాలో ఉద్యోగం దొరకటం వల్ల వచ్చినవాడు కాదు.
వాంగ్ వెళ్లిపోయాక, వాకింగ్ ఏరియా నుంచి నా డెస్క్‌లోకి వచ్చి కూర్చున్నాను. ఓపెన్ డెస్క్ అది. చుట్టూ ఎంప్లాయీస్ ఉంటారు.
‘‘మార్క్! మీతో మాట్లాడాలి. యాక్చువల్లీ మీతో మాట్లాడటం కోసమే నేను ఎదురు చూస్తున్నాను’’ అంటూ – ఇండియన్ యాక్సెంట్‌తో ఒక అమ్మాయి. చాలా కోపంగా ఉంది. చాలా అంటే చాలా!
‘‘షూట్ మీ..’’ అన్నాను నవ్వుతూ.
తను నవ్వదలచుకోలేదని ఆమె ముఖంలో స్పష్టంగా తెలుస్తూ ఉంది.
‘‘మార్క్! ఎంప్లాయీస్ అంటే స్ప్రెడ్‌షీట్స్ కాదు.. మనుషులు. యునీక్ స్కిల్స్, ఎమోషన్ ్స, అనుభవం ఉన్నవారు. ఎలా తీసేస్తారు అంతమందిని? అంతమంది అని కాదు. అసలు వారిలో ఒక్కరినైనా?!!’’ – స్థిరంగా, స్ట్రాంగ్‌గా అంటోంది. అం... టూ...నే ఉంది!
తను వెళ్లాక, వాంగ్‌కి కాల్ చేసి... ‘‘ఏఐ ల్యాబ్స్ నుంచి ఫైర్ చేసిన వాళ్లలో తను కూడా ఉందా?’’ అని అడిగాను.
కాసేపటి తర్వాత వాంగ్ కాల్ బ్యాక్ చేసి, ‘‘ఏఐ ల్యాబ్స్ ఫైరింగ్ లిస్ట్‌లో తను లేరు మార్క్! కానీ తను చేస్తున్నది ఏఐ ల్యాబ్స్‌లోనే!!
ఇంటెర్న్. సూపర్ ఇంటెలిజెంట్ అని విన్నాను’’ అన్నాడు వాంగ్.
ఆ అమ్మాయి తన కోసం తను ఫైట్ చెయ్యటం లేదంటే తను ఎవరితోనైనా ఫైట్ చేయగలదని!
అమెరికన్ కంపెనీలు ప్రపంచంలో నంబర్ 1గా ఉండటానికి నాకిప్పుడు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి –ప్రాక్టికల్‌గా ఉండే చైనీస్ చీఫ్ ఆఫీసర్స్. రెండు – ‘ఫైటింగ్ స్పిరిట్’ ఉన్న ఇండియన్ ఇంటెర్న్‌లు!


