
న్యాయవ్యవస్థ, చట్టసభలు, యంత్రాంగం లక్ష్యం అదే
సీజేఐ బీఆర్ గవాయ్
ఇటానగర్: ప్రజలకు సేవ చేసేందుకు, అతి తక్కువ ఖర్చుతో సత్వరమే వారికి న్యాయం అందించేందుకు మాత్రమే న్యాయవ్యవస్థ, చట్టసభలు, అధికార యంత్రాంగం ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందంటూ ఆయన ప్రజల గుమ్మం వద్దకే న్యాయం చేరాలన్నారు.
ఆదివారం ఆయన ఇటానగర్‌లో గౌహతి హైకోర్టు ఇటానగర్ శాశ్వత ధర్మాసనం నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘కోర్టులు, న్యాయవ్యవస్థ, చట్ట సభలు ఉన్నది గొప్పవారికి, న్యాయమూర్తులకు, అధికారులకు చేసే చేసేందుకు కాదు. మనమందరం ప్రజలకు న్యాయం అందించేందుకే ఉన్నాం’అని ఆయన పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో భిన్నత్వంలో ఏకత్వం మేళవించి ఉందని, రాష్ట్రంలో 26 ప్రధాన గిరిజన తెగలు, 100కు పైగా ఉప గిరిజన తెగలున్నాయని వివరించారు.
ప్రతి గిరిజన తెగ సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ప్రగతితోపాటు సంప్రదాయాలు, సంస్కతీ పరిరక్షణ కూడా ముఖ్యమైనవేనని, ప్రాథమిక విధుల్లో ఇవి కూడా ఒకటని తెలిపారు. అశాంతి నెలకొన్న మణిపూర్‌లో ఇటీవల పర్యటన సమయంలో జరిగిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘షెల్టర్ హోంలో ఆశ్రయం పొందుతున్న ఓ మహిళ మీ ఇంటికి వచ్చిన మీకు స్వాగతం అని నాతో అంది. ఆమె మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. మనది ఒకటే భారతదేశం. మనందరం భారతీయులం. భారత్ మన నివాసం’అని సీజేఐ వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడికీ రాజ్యాంగమే అత్యున్నత గ్రంథం. ప్రతి ఒక్కరూ చదవి తీరాలని పిలుపునిచ్చారు.