
మాధవ్ శింగరాజు
మనం ఏదైనా ఒకటి బలంగా అనుకున్నప్పుడు, దానిని నెరవేర్చటానికి పంచభూతాలన్నీ కలసికట్టుగా ఒక్కటై మనకు సహాయం చేస్తాయని అంటారు! ఈ మాట హైందవ పురాణ ప్రబోధమా, పవిత్ర ఖురాన్ సందేశమా, లేక పరిశుద్ధ గ్రంథ వచనమా అన్నది నాకు తెలియదు కానీ... మత విశ్వాసాలను గౌరవించటానికి ఆస్తికులు కానవసరం లేదు కనుక నేను ఈ మాటను గట్టిగా నమ్ముతాను.
నాకు ఇంకొక మాట మీద కూడా గొప్ప నమ్మకం ఉంది. పదవి కోసం కాచుకొని కూర్చుండే మనుషులు ఆ పదవిలో ఉన్నవారిని తప్పించాలని బలంగా సంకల్పించినప్పుడు ఆ మహత్కార్యాన్ని పూర్తి చెయ్యటానికి గొలుసుకట్టుగా అంతా ఒక్కటవుతారని!
సీఎంగా నిన్న మొన్న నేను చేసిన ప్రమాణ స్వీకారానికి అప్పుడే రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నాయి. ‘రొటేషనల్ ఫార్ములా’ ప్రకారం మిగతా రెండున్నరేళ్ల ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వస్తారని పార్టీలో కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది.
అసలు రాజ్యాంగంలోనే రొటేషన్ అన్నది లేనప్పుడు ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుంది?! శనివారం రాత్రి, అత్యవసరంగా డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి మినిస్టర్‌లందర్నీ పిలిపించాను. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒక్కరే రాలేదు. ‘‘డీకే డిన్నర్‌కి ఎందుకు రాలేదో కనుక్కోండి పరమేశ్వర గారూ’’ అన్నాను.
ఆయన స్పందించలేదు. పరమేశ్వర హోమ్ మినిస్టర్. శివకుమార్ లాగే ఆయన కూడా సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. శివకుమార్‌కి ఫోన్ చేసే ఉద్దేశాన్ని పరమేశ్వర కనబరచకపోవడంతో నేనే శివకుమార్‌కి ఫోన్ చేసి, ‘‘ఎక్కడున్నారు డీకే? మీకోసం అందరం ఎదురు చూస్తున్నాం. మీరొస్తే డిన్నర్ స్టార్ట్ చేద్దాం’’ అన్నాను.
‘‘రాత్రి పూట భోజనం మానేసి రెండున్నరేళ్లు అవుతోంది సిద్ధరామయ్య గారూ! మీరంతా ఉన్నారు కదా, కానిచ్చేయండి’’ అన్నారు శివకుమార్. పెద్దగా నవ్వాన్నేను. ఆయనా నవ్వారు తప్పితే వస్తున్నానని మాత్రం అనలేదు. మెల్లిగా భోజనాలు మొదలయ్యాయి.
‘‘చెప్పండి మిత్రులారా... పార్టీలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?’’ అని నేనూ మొదలు పెట్టాను. ‘‘నవంబర్ 20 తర్వాత సీఎంగా మీ ప్లేస్‌లోకి శివకుమార్ వస్తారని వినిపిస్తోంది సీఎం గారూ’’ అన్నారు ఎమ్మెల్సీ బోసురాజు. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఆయన. ‘‘ఇంకా...!’’ అన్నాను.
‘‘మనలోనే కొందరు శివకుమార్‌తో టచ్‌లో ఉన్నట్లు వినిపిస్తోంది సీఎం గారూ’’ అని ఎనర్జీ మినిస్టర్ జోసెఫ్ జార్జి అన్నారు. ‘‘శివకుమార్‌తో టచ్‌లో ఉంటున్న ఆ కొందరు ఇప్పుడీ డిన్నర్ మీటింగ్‌లో ఉండి వుండవచ్చా జోసెఫ్ జార్జ్?’’ అని అడిగాను. డైనింగ్ హాల్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. హోమ్ మినిస్టర్ పరమేశ్వర అయితే మొదటి నుంచీ సైలెంట్ గానే ఉన్నారు.
‘‘ఈ భోజన సమావేశంలో, ఆ కొందరు ఉన్నారో లేదో చెప్పలేను కానీ... ‘ప్రభు రాత్రి భోజనం’ గురించి మాత్రం చెప్పగలను సీఎం గారూ’’ అన్నారు జోసెఫ్ జార్జి.‘‘చెప్పండి’’ అనలేదు నేను. శిష్యులలో ఒకరు క్రీస్తును పట్టించిన ‘ద లాస్ట్ సప్పర్’ గురించి ఆయన చెప్పబో తున్నట్లు నాకు అర్థమైంది.
భోజన సమావేశం ముగిసి అందరూ వెళ్లిపోతున్నప్పుడు పరమేశ్వరను ఆపాను. ‘‘డీకేకి మీరు ఫోన్ చేయకపోతే పోయారు. కలిసినప్పుడు మాత్రం ఆయనకో మాట చెప్పండి. ఇంకో రెండున్నరేళ్లు ఆయన తన రాత్రి భోజనాన్ని మానేయవలసి ఉంటుందని చెప్పండి’’ అన్నాను. ఆ మాట డీకేకి, పరమేశ్వరకి కూడా!