
అభిప్రాయం
తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పేరుతో ఇద్దరు మావోయిస్టు నేతలు ప్రభుత్వానికి ఆయుధాలు అప్పగించి లొంగిపోవడం సంచలనం రేపింది. విప్లవకారులు గతంలో ఎందరో లొంగిపోయారు. కానీ, వీళ్లు లొంగిపోయిన తీరు అనేక ప్రశ్నలను లేవదీసింది. సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహావేశాలు వెల్లడవుతున్నాయి. దీనికి ప్రతిగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనుకోవడం తప్పా? జీవిత పర్యంతం విప్లవం చేయాలని నిర్దేశించడానికి మీరెవరు? విప్లవకారులు కలలో కూడా ఆయుధం వదలకూడదనే హక్కు ఉన్నదా? అనే నైతిక ప్రశ్నలు సంధిస్తున్నారు.
విప్లవ సిద్ధాంతాన్ని ఎదుర్కోలేకే...
విప్లవంలో అలసిపోయో, ఆనారోగ్యంతోనో, ఇష్టం తగ్గిపోయో ఇంటికి వచ్చిన వాళ్లను ఎవరేమంటారు? అంటే తప్పు. కానీ ఈ నాయకులు అంత సాధారణంగా ఉద్యమం నుంచి బయటికి రాలేదని గడ్చిరోలిలో, జగ్దల్‌పూర్‌లో జరిగిన లొంగుబాటు సన్నివేశాలు చూసిన వాళ్లెవరైనా గ్రహించగలరు. విప్లవోద్యమం వెనుకపడ్డానికి మావోయిస్టు పంథాయే కారణమని, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేసి బయటికి రావాలని అనుకున్నట్లు వాళ్ల ప్రకటనలను బట్టి తెలుస్తోంది. విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికే ఈ పని చేస్తున్నామని కూడా అన్నారు. ఇంతకుమించి ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలకు ఎట్లాంటి ప్రత్యామ్నాయమూ ప్రతిపాదించలేదు. వాళ్లు లొంగిపోయిన తీరు దాన్ని బలపరిచింది. ‘తాత్కాలికం’ పేరుతో శాశ్వతంగా ఆయుధాలు వదిలేయడం తప్ప, ఇంకో ఆలోచన ఏదీ లేదని స్పష్టమైపోయింది. వాళ్లు మావోయిస్టు పంథాను వ్యతిరేకించి బయటికి వచ్చారని అనుకున్న విప్లవోద్యమ విమర్శకులను నిరాశకు గురిచేశారు. ‘సాయుధ పోరాట విర మణ’ ప్రభుత్వ ప్రాయోజితమని తేటతెల్లమై పోయింది. ఆ సన్నివేశాల్లో కలిసిన ఇరుపక్షాలే దాన్ని నిరూపించుకున్నాయి.
ఈ విషాదకర పరిణామాలు ‘ఆపరేషన్ కగార్’ (operation kagar) అనే అంతర్యుద్ధం మధ్యలో జరిగాయి. ఎందుకిలా జరిగింది? అనేది ప్రత్యేక చర్చనీయాంశం. ఈ కగార్ మారణకాండ ఆగాలని మార్చి నెల చివరిలో మావోయిస్టులు కాల్పుల విరమణను ప్రతిపాదించారు. శాంతి చర్చల కోసం దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వం పట్టించుకోకపోగా గడువులోపే మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తానని అన్నది గాని, అది అంత తేలిక కాదని అర్థమైంది. తుపాకులను, తలకాయలను లెక్కించుకుంటూ రాజ్యం సరిపెట్టుకోదు.
లక్షల సైనిక బలగాలతో, ఆధునాతన సాంకేతికతతో మనుషులను చంపుతున్నంత సులభంగా విప్లవ సిద్ధాంతాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. బయటి యుద్ధానికి లోపలి యుద్ధం తోడు కావాలి. మావోయిస్టు పంథా పూర్తి తప్పనీ, మారుతున్న ప్రపంచం గురించి ఆ ఉద్యమానికి ఏమీ తెలియదనీ, కేవలం సైనిక చర్యలుగా మిగిలిపోయిందనీ, కాబట్టి ఆయుధాలు వదిలేయాలనే వాదన లోపలినుంచే రావాలి. తద్వారా మావోయిస్టు పంథా తన సంబద్ధతను కోల్పోయేలా చేయాలి. రాజ్యం జాగ్రత్తగా ఆ పని చక్కపెట్టింది. కగార్ యుద్ధానికి కొనసాగింపే సాయుధ పోరాట విరమణ అనే వాదనతో కగార్ వ్యతిరేక ప్రజాస్వామిక ఆందోళన కూడా పక్కకు పోయింది.
ఆదివాసుల అస్తిత్వం ఏమైపోతుంది?
ఈ మొత్తం వల్ల సరికొత్త చర్చ ఆరంభమైంది. కగార్‌ను విస్మరించి మావోయిస్టు పంథా తప్పని చెప్పడానికి చాలా మంది ఉత్సాహపడ్డారు. రాజ్య దుర్మార్గాన్ని మాట్లాడటం మర్చిపోయారు. మావోయిస్టుల సాయుధ పోరాటం ఆగిపోతే, అక్కడ ఉండే ఆదివాసుల పరిస్థితి ఏమిటి? దానికి రాజ్యం ఏమైనా హామీ పడుతుందా? ఈ పరిణామాల్లో ప్రజలను కేంద్రంగా చేసుకోవాల్సి ఉన్నది. ఆయుధాల అప్పగింత మీద ఒకింత ఆగ్రహంగా మాట్లాడినవాళ్లను ఉద్దేశించి ‘అయితే మీరు వెళ్లి ఆయుధాలు పట్టుకోండి మరి’ అన్నారేగానీ, కార్పొరేట్ల కోసం చుట్టుముట్టిన లక్షల సైనిక బలగాల మధ్య ఆదివాసుల అస్తిత్వం ఏమైపోతుంది? అని ప్రశ్నించుకోలేదు.
విప్లవోద్యమానికి ఆయుధాలు సెంటిమెంట్ కాదు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధమంటే రాజకీయార్థిక సాంస్కృతిక సైనిక విధానం. ఆయుధాలు కేంద్రంగా మావోయిస్టు ఉద్యమాన్ని చూసేవాళ్లకు ఇది తెలియదు. విప్లవాన్ని ప్రజల వైపు నుంచి చూడాలి. సమకాలీన సామాజిక పరిణామాలు, నానాటికీ బలపడుతున్న రాజ్యం, ప్రజల దుర్భరస్థితి సాయుధ పోరాట అవసరాన్ని పెంచుతున్నాయి. ప్రజాస్వామిక పోరాటాలకు కనీస అవకాశం లేని, ఏ పోరాటమూ కొద్ది కాలం కూడా స్థిమితంగా కొనసాగలేని పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధ పోరాటాల, సాయుధ పోరాటాల మేళవింపుతోనే ఈ స్థితిని అధిగమించడం, ప్రజల్ని సమీకరించడం సాధ్యం. నిరంతర ఆత్మవిమర్శతో ఉద్యమాలు తప్పొప్పులను పరీక్షించుకోవాలి.
చదవండి: రాజ్యాంగం వర్సెస్ రైఫిల్
ఈ వైపు నుంచి చూస్తే కొత్త చారిత్రక ప్రపంచంలో విప్లవం చేస్తున్నామనే ఎరుక ఉన్నదని మావోయిస్టులు తమ ఆచరణతో ఇప్పటికే రుజువు చేసుకున్నారు. గత ఇరవై ఏళ్ల ప్రపంచ విప్లవోద్యమాల్లో మావోయిస్టు పంథా కొన్ని విజయాలు సాధించింది. అయినా వాళ్ల ముందు అనేక ఆచరణాత్మక సవాళ్లు ఉన్నాయి. రాజ్య నిర్బంధం వల్ల ఇటీవల కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యారు. ఈ లొంగుబాట్లతో మరింత కుంగిపోవచ్చు. కొందరు దీనికంతా విప్లవోద్యమ పంథా కారణం అంటున్నారు. మావోయిస్టు పంథా ఆరంభమైనప్పుడే ఓడిపోయిందని అంటున్నారు. ఈ చమత్కారాన్ని వాస్తవ చరిత్ర అంగీకరించదు!
- పాణి
‘విరసం’ సభ్యులు